ఎప్పుడెప్పుడా అని బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కార్యక్రమం 'ఎవరు మీలో కోటీశ్వరులు' తొలి ఎపిసోడ్ వచ్చేసింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా విచ్చేసి సందడి చేశారు. 'ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రేక్షక దేవుళ్లకి శతకోటి వందనాలు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది.
"తెర మీద మీకు కనిపించి మూడు సంవత్సరాలు అవుతోంది. మీకొక అద్భుతాన్ని అందించాలని దర్శకుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'ను తీర్చిదిద్దుతున్నారు. అందులో పాత్రధారిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే ఓ చరిత్రను ఆవిష్కరిస్తుంది మా 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం. ఈలోగా మీ ప్రేమ, అభిమానాన్ని పొందాలని ఈ షో ద్వారా మీ ముందుకొచ్చాను. కొన్ని నెలల క్రితమే ఈ షో రావాలి. కరోనా కష్టం వచ్చి పడింది. కష్టమంటే నాకు గుర్తొచ్చేది.. మహాకవి శ్రీశీ రచన. 'దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే" అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని ఎన్టీఆర్ తనదైన శైలిలో వినిపించారు. గుక్క తిప్పుకోకుండా తారక్ కవిత్వం చెప్పడం వల్ల కార్యక్రమంలో చప్పట్లు మార్మోగాయి.
'ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది' అంటూ హుషారుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్. రామ్ చరణ్ రాకతో ఆ ఉత్సాహం మరింత రెట్టింపైంది. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన 'ఏవీ'తోనే చరణ్‌ని ఆహ్వానించారు. 'నా మిత్రడు' అంటూ రామ్ చరణ్‌కి వెల్‌కమ్ చెప్పారు. త్వరలో వెండితెరపై చూడాల్సిన ఈ ఇద్దరినీ ఇలా బుల్లితెరపై ముందుగానే చూడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షో ఆద్యంతం వీరి మధ్య సాగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: 'మెగా'ఫ్యామిలీలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు