తెలుగు సినీపరిశ్రమలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి రెండేళ్లకోసారి సినీ నటీనటుల సంఘం(మా)లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగిసింది. మార్చి 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నటుడు నరేశ్ నామినేషన్ దాఖలు చేశారు.
జీవిత-రాజశేఖర్ దంపతులతో కలిసి 'మా' కార్యాలయానికి వచ్చారు నరేశ్. దాసరి విగ్రహానికి నివాళులర్పించి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మా అసోసియేషన్ ఎన్నికలపై స్పందించిన నరేష్‌తోపాటు జీవిత-రాజశేఖర్ దంపతులు నటీనటుల సంఘంలోని గత సభ్యుల పనితీరును తప్పుబట్టారు.
అసోసియేషన్‌లో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానందునే సినీ పెద్దలు, సభ్యుల కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు నరేష్ స్పష్టం చేశారు. తెలుగు నటీనటుల సంఘంలో మొత్తం 800కి పైగా సభ్యులున్నారు. గత ఎన్నికల్లో జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటీచేయగా రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఓ విడత అధ్యక్షునిగా పనిచేసిన హాస్యనటుడు అనంతరం శివాజీ రాజాకు అధ్యక్ష పదవిని అప్పగించారు.