తరగని అందం.. చెరగని నవ్వు.. అలుపెరగని పోరాట గుణాలే మహిళలకు అసలైన ఐశ్వర్యం అని నిరూపించారు నటి ఐశ్వర్య. నటనలో తల్లికి తగ్గ తనయగా.. మూడు దశబ్దాల నుంచి దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా, సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. బుల్లితెర ద్వారా కుటుంబ ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన ఆమె.. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. అవన్నీ మీకోసం..
శాంతమీనా అలియాస్ ఐశ్వర్య ఇంకేమైనా పేర్లు ఉన్నాయా?
ఐశ్వర్య: పాస్‌పోర్ట్ ఆఫీసర్ కూడా ఇలాగే అడిగాడు. ‘ఇవేనా ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఇన్ని పేర్లుంటే ఏ పేరుతో పాస్‌పోర్ట్ ఇవ్వాలి?’ అన్నాడు. ఐశ్వర్య పేరుతోనే పాస్‌పోర్ట్ ఇవ్వమని చెప్పాను.
మీ అంత ఎత్తు ఉన్న హీరోయిన్లు అప్పట్లో ఉన్నారా?
ఐశ్వర్య: నా ఎత్తు 5.9 అడుగులు. నాతో పాటు టబు, శోభన ఉన్నారు. ముగ్గురం ఒకే ఎత్తు.
సినీ పరిశ్రమలోకి ఎప్పుడు వచ్చారు?
ఐశ్వర్య: మొదట కన్నడలో ‘ఒస కావ్య’ చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. తెలుగులో నా తొలి చిత్రం.. జగపతిబాబుతో ‘అడివిలో అభిమన్యుడు’(హీరోగా జగపతిబాబుకు అది రెండో సినిమా). దాని తర్వాత దర్శకుడు జంధ్యాల సినిమాలో నటించాను. ఆ తర్వాతే తమిళ సినిమాకి పరిచయమయ్యా!
మీ అమ్మ (నటి లక్ష్మి) ఎలా ఉన్నారు. ఆమెకు ఎంత మంది పిల్లలు?
ఐశ్వర్య: బాగున్నారు. నేను ఒక్కదాన్నే. మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది. నాకు మరొక సోదరి కూడా ఉన్నారు.
ఎన్ని సినిమాల్లో నటించారు?
ఐశ్వర్య: గుర్తులేదు. ఇప్పటిలా సినిమాలను లెక్కపెట్టేవాళ్లం కాదు. నేను లెక్కపెట్టలేదు. కానీ.. మీరు(కార్యక్రమాన్ని ఉద్దేశించి) గుర్తుపెట్టుకొని లెక్కపెట్టడం గొప్ప విషయం. నాకు తెలిసి అన్ని భాషల్లో కలిపి 50కిపైగా సినిమాలు చేశా. హిందీలో జాకీ ష్రాఫ్‌తో ‘గర్దీష్’ చేశా. ఆ తర్వాత సినీ పరిశ్రమను చూడలేదు.
మీవారేం చేస్తుంటారు?
ఐశ్వర్య: మావారితో విడాకులు అయ్యాయి. ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మా కుమార్తెకు వివాహం కుదరడంతో మేమంతా కలిసి పెళ్లి చేస్తున్నాం. మా వివాహానికి ముందు మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. వివాహమైన తర్వాత పరిస్థితులు మారాయి. దీంతో విడాకులు తీసుకొని మళ్లీ స్నేహితులమయ్యాం. మా అమ్మాయి జర్నలిజం అండ్ కార్పొరేట్ రంగంలో ఉంది. ఒక కంపెనీ కూడా స్థాపించింది. కానీ, కరోనా కారణంగా అది మూతపడింది. ఆ తర్వాత డైవింగ్ కోర్సులో చేరుతానని వెళ్లి డైవింగ్ ప్రాంతం యజమానితో ప్రేమలో పడింది. వచ్చే నెలలోనే వారి వివాహం.
మీ కెరీర్‌లో ఎంత మందిని కొట్టారు?
ఐశ్వర్య: ఎవరినీ కొట్టలేదు. కానీ, తెలుగు ఇండస్ట్రీలో ఒక దర్శకుడిని కొట్టాలనిపించింది. ఇకపై కోటి రూపాయలు ఇచ్చినా ఆయన సినిమాలో నటించను. అతడు నా సహనాన్ని పరీక్షించాడు. ఆ చిత్రం తర్వాత ఎదురుపడినప్పుడు నేను అన్ని మర్చిపోయి చక్కగా మాట్లాడాను కానీ, నా గురించి ఆయన ఇతరులతో చెత్తగా మాట్లాడాడని తెలిసింది. అసలు అప్పుడే కొట్టి ఉంటే బాగుండు అనిపించింది. ఆయన తప్ప.. మిగతా దర్శకులంతా నా గురువులే. ఆ చిత్రంలో మనిద్దరం(అలీని ఉద్దేశించి) కలిసి నటించాం.
ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
ఐశ్వర్య: నాకు ఇండస్ట్రీలో స్నేహితులెవరూ లేరు. బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరితోనే ఉండటం నాకు నచ్చదు. నాకు అందరూ స్నేహితులే. స్కూల్, కాలేజ్‌లో ఉన్నప్పుడు స్నేహితుల బృందం ఉండేది. సినీ ఇండస్ట్రీలో స్నేహబంధం ఉండదు. స్నేహితులమని చెప్పుకున్నా.. అది అబద్ధం.
డాక్టర్ అవ్వాలనుకున్నారా?
ఐశ్వర్య: నేను కాదు.. ఇంట్లోవాళ్లు అనుకున్నారు. నేను లాయర్ అవ్వాలనుకున్నాను. సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ మీద ఆసక్తి ఎక్కువ. నేను కరాటే బ్లాక్ బెల్ట్ సాధించా.
మీ వాయిస్ మీకు ప్లస్సా? మైనస్సా?
ఐశ్వర్య: నేను పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. కానీ, ఇండస్ట్రీలో చాలా మంది నాకది మైనస్ అనే చెప్పారు. ఆ తర్వాత అదే నాకు ప్లస్ అయింది. ‘హే రామ్’ చిత్రం తెలుగు వెర్షన్‌లో రాణి ముఖర్జీకి నేనే డబ్బింగ్ చెప్పాను. కమల్ హాసన్ అంకుల్ పిలిచి నాతో చెప్పించారు.
ఇండస్ట్రీకి రాకముందు మిమ్మల్ని సినిమా వైపు చూడొద్దని.. చూస్తే కాళ్లు విరగ్గొడతామని మీవాళ్లు హెచ్చరించారట?
ఐశ్వర్య: ‘సినిమా వైపు కాదు, అద్దంలో కూడా చూసుకోకు. చూస్తే అద్దం పగిలిపోతుంది’ అని మా వాళ్లు హేళన చేశారు. సినిమాల్లోకి వచ్చి అమ్మ పేరు చెడగొట్టొదన్నారు. ‘లక్ష్మి గారికి ఇంత అసహ్యమైన కూతురు పుట్టిందా’ అన్నారు. లెజెండరీ వ్యక్తుల పిల్లలు అదే రంగంలోకి వెళ్లకూడదు. నేను టీచర్‌గా పనిచేసినా విజయం సాధించేదాన్ని. అనుకోకుండా ఈ సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది.
చదువుకోవడం కోసం యూఎస్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. అమ్మ కన్నడలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాని కోసం 60 మంది అమ్మాయిలకు స్క్రీన్ టెస్ట్ జరిగింది. ఎవరూ సరిగా డైలాగులు చెప్పట్లేదు. దీంతో అంత బాగా నేర్పిస్తున్నా చెప్పటం లేదని అసహనం వ్యక్తం చేశా. దీంతో ఆ డైలాగులు నన్ను చెప్పమని అమ్మ అనగానే వచ్చి ఫటాఫటా చెప్పేసి వెళ్లిపోయా. దీంతో ఆ సినిమాలో నన్నే నటించమని కోరారు.
ఫోన్ చేసి ఐశ్వర్య ఎక్కడ ఉన్నారు? అని అడిగితే మీకు నచ్చదట ఎందుకు?
ఐశ్వర్య: ఫోన్ చేసి మొదట ఎలా ఉన్నారు? అని అడగాలి. ఎక్కడ ఉన్నావు అంటే ఎలా? నాకు అలా అడిగితే అస్సలు నచ్చదు.
ఐశ్వర్యగా ఎప్పుడు మారారు?
ఐశ్వర్య: శాంతమీనా అనేది మా అత్త పేరు. ఆమె చనిపోయిన తర్వాత నేను పుట్టానని ఆ పేరు పెట్టారు. సినిమాల్లో నటించాలని భావించినప్పుడు ఆ పేరు బాగోలేదని.. ఐశ్వర్య అని మా అమ్మే పేరు మార్చింది.
19 ఏళ్ల వరకు మీ నాన్నని మీరు చూడలేదు కదా? మీది ఓ ఇంటర్వ్యూ చూసి.. ఒకతను మిమ్మల్ని మీ నాన్నని కలిపారట?
ఐశ్వర్య: ఆయన మా నాన్న సహోద్యోగి. ‘మా నాన్న ఎక్కడ ఉంటారు..? ఎలా ఉంటారో కూడా తెలియదు. నా దగ్గర ఫొటో కూడా లేదు. కానీ, ఆయన్ను కలవాలనుకుంటున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. అది అతను చూసి.. నాకు మా నాన్న వివరాలు ఇచ్చారు. మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ పని మీద వెళ్లి కలిశా. అప్పుడు మా కుటుంబసభ్యులతో ఓ ఫొటో దిగాను. నేను ఒకటిన్నర ఏడాది వయసున్న సమయంలోనే మా అమ్మానాన్న విడిపోయారు. మా అమ్మమ్మే నన్ను పెంచింది. తాతగారు వైవీ రావు దర్శకత్వం వహించిన ఓ సినిమాలో మా అమ్మమ్మ నటించింది. తెలుగు సినీ పరిశ్రమలో మూకీ చిత్రాలు నడుస్తోన్న కాలంలో తొలి టాకీ చిత్రాన్ని పరిచయం చేసింది మా తాతే. ఆ చిత్రం పేరు ‘చింతామణి’.
‘మీ అమ్మగారి అందం నీకు రాలేదు’ అని ఎవరైనా అన్నప్పుడు మీ స్పందన?
ఐశ్వర్య: చాలా మంది అలాగే చెబుతారు. మొదట్లో చాలా బాధపడేదాన్ని. ఇప్పుడేం బాధపడను. నాకు మా నాన్న పోలిక వచ్చింది. ఏం చేస్తాం..
తెలుగు చక్కగా మాట్లాడే మీకు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రాలేదా?
ఐశ్వర్య: వస్తాయి. కానీ, రెగ్యులర్‌గా తీసుకోరు. నిర్మాణ సంస్థపరంగా మోహన్‌బాబు గారి బ్యానర్‌లో మూడు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ నందిని రెడ్డి నన్ను తన మూడు సినిమాల్లో తీసుకున్నారు. తమిళ్‌లో దర్శకుడు హరి. మిగతా వాళ్లు అవకాశం ఇచ్చినా చేస్తాను. మోహన్ బాబు గారికి టైమింగ్ ముఖ్యం. నాకు అంతే. మంచు కుటుంబం చాలా అద్భుతమైన కుటుంబం.
తొలిసారి తిరుపతి వెళ్లినప్పుడు వేంకటేశ్వరస్వామిని చూసి.. ఆ హ్యాండ్సమ్ ఎక్కడ? అని అడిగారట..!
ఐశ్వర్య: ఈ విషయం ఎవరికీ తెలియదు. చిన్నప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఎన్టీ రామారావుగారినే చూశా. ఏడేళ్ల వయసులో తిరుపతికి వెళ్లినప్పుడు విగ్రహం చూసి.. ‘ఈయన నల్లగా ఉన్నాడు.. అందంగా, తెల్లగా ఉండే ఆయన(ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) ఎక్కడ’ అని అడిగా. నా దృష్టిలో ఎన్టీఆర్ మాత్రమే విష్ణువు.. శ్రీకృష్ణుడు. నన్ను సినిమాల్లోకి తీసుకురమ్మని మొదట అడిగింది ఎన్టీఆర్ గారే. ‘విశ్వామిత్ర’ చిత్రంలో శకుంతల పాత్రతో నన్ను పరిచయం చేయాలనుకున్నారు. నన్ను హైదరాబాద్ పిలిపించి ‘ఏం చదువుతున్నా’వని అడిగారు. అమెరికా వెళ్లి లా చదువుకోవాలని ఉందని చెప్పా. అంతే ఆశీర్వదించి తిరిగి పంపించేశారు. ‘ఇప్పుడు చిన్నపిల్లగా ఉంది.. కాస్త పెద్దయ్యాక చూద్దా’మన్నారు. మరుసటి ఏడాదే సినిమాల్లోకి వచ్చాను.
ఎందుకు మీరు మీ అమ్మగారితో దూరంగా ఉంటున్నారు?
ఐశ్వర్య: ఒక వయసు వచ్చాక.. మనం పెద్దల్ని చూసుకోవాలి గానీ.. వారికి ఇబ్బందిగా మారకూడదు. నాకు 18ఏళ్లు వచ్చాక అమెరికా వెళ్లి స్వతంత్రంగా బతకాలని భావించా. అది ఇండియాలోనే జరిగింది అంతే. ఏ బంధంలోనైనా ఇబ్బంది ఉంటే వేరుగా ఉండటం ఉత్తమం.
షూటింగ్ బ్రేక్ సమయంలో వెళ్లి పెళ్లి చేసుకున్నారట?
ఐశ్వర్య: అప్పుడే సమయం దొరికింది. లంచ్‌కి అని చెప్పి.. పెళ్లి చేసుకొని షూటింగ్‌కి వచ్చేశా.
చిన్నప్పుడు దేనికోసమో అప్పు చేశారట?
ఐశ్వర్య: ఎల్‌కేజీలో ఉన్నప్పుడు స్కూల్ దగ్గర పుల్ల ఐస్‌క్రీం అమ్మేవారు. గ్రేప్ ఐస్‌క్రీం 50పైసలు ఉండేది. ఓ రోజు నేను ఒక ఐస్‌క్రీం తీసుకున్నాను. కానీ, డబ్బులు ఇవ్వలేదు. ఐస్ క్రీం అమ్మేవాడూ డబ్బులు అడగలేదు. తర్వాత రోజు ఆ విషయం మా అమ్మమ్మకి తెలియడంతో నన్ను బాగా కొట్టింది. అప్పు చేయకూడదని చెప్పింది. మా అమ్మమ్మకి అబద్ధాలు చెబితే ఇష్టం ఉండదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అప్పు లేదు.. క్రెడిట్‌కార్డు లేదు. సేవింగ్స్ లేవు.. బాధ్యతలు లేవు. చాలా మంది లైఫ్‌స్టైల్ చూపించడానికి క్రెడిట్ కార్డులు వాడి అప్పుల్లో కూరుకుపోతున్నారు.
అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?
ఐశ్వర్య: దర్శకుడు జగన్ గారే అడిగారు. ఆ పాత్ర కోసం నన్ను తీసుకోమని ప్రకాశ్‌రాజ్ సూచించారట. రవితేజను ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసినప్పుడు చూశా. మళ్లీ ఈ చిత్రంలోనే కలిసి నటించా.
అమ్మగారు నటించిన చిత్రాల్లో ఏ చిత్రాలంటే ఇష్టం?
ఐశ్వర్య: చట్టానికి కళ్లు లేవు, నిన్నే పెళ్లాడతా, మురారి, ఓ బేబీ చిత్రాలు చాలా ఇష్టం.
భరతనాట్యం నేపథ్యంలో సినిమా చేయాలని కోరిక ఉందట?
ఐశ్వర్య: విశ్వనాథ్ గారి సినిమాల్లో ఉండే హీరోయిన్ పాత్రల్లో నటించాలని కోరిక ఉండేది. ఇప్పుడు ఎవరూ హీరోయిన్‌గా అవకాశం ఇవ్వరు. కానీ, భరతనాట్యం డ్యాన్సర్‌గా సినిమాలో చేయాలని ఉంది.
వీరిపై ఒక్క పదంలో మీ అభిప్రాయం చెప్పండి..
ఐశ్వర్య:
అమ్మమ్మ - నాని
ఎన్టీఆర్ - నా దేవుడు
మోహన్‌బాబు - డ్యూడ్
కుమార్తె - బార్బీ డాల్
ఐశ్వర్య - మెంటల్
ఇల్లు - ప్రశాంతత
చెన్నై - నా ఇల్లు
హైదరాబాద్ - నా రెండో ఇల్లు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">