రాష్ట్ర రాజధానిలో సినిమా థియేటర్ వ్యాపారం గందరగోళంలో పడింది. కరోనా కారణంగా వ్యాపారం కుదేలైంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు నెలకు సుమారు లక్ష నుంచి లక్షన్నర రూపాయలకు పైగా నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించి థియేటర్ల పునఃప్రారంభానికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే... కొంతమంది సింగిల్ థియేటర్ యజమానులు మాత్రం తెరిచేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక నష్టాలు భరించడం కంటే వ్యాపారం నుంచి తప్పుకోవటం మేలని భావిస్తున్నారు.
వాణిజ్య సమూదాయాలకు...
హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్స్ స్క్రీన్ థియేటర్లు కలిపి సుమారు 120 వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే సుమారు 15 థియేటర్లను పూర్తిగా తొలగించాలని యాజమానులు నిర్ణయించుకున్నారు. ఇందులో మెహిదీపట్నం అంబ థియేటర్, టోలీచౌకిలోని గెలాక్సీ, ముషీరాబాద్ సాయిరాజా, బహదూర్ పురా శ్రీరామ, నారాయణగూడ శాంతి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీ మయూరి, దిల్‌సుఖ్‌నగర్ వెంకటాద్రి, మేఘ సినిమా హాల్స్‌తోపాటు వనస్థలిపురం సుష్మ థియేటర్లు పూర్తిగా మూతపడనున్నాయి. శ్రీమయూరి థియేటర్‌ను కూల్చివేసి ఓ కార్ల కంపెనీకి లీజుకు ఇవ్వగా... మెహిదీపట్నంలోని అంబ థియేటర్‌ను... అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసే గోదాం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. మిగతా థియేటర్ల ప్రదేశంలో వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు యాజమానులు సన్నాహాలు చేస్తున్నారు.
ఓటీటీల కారణంగా...
థియేటర్లను తొలగించడం ఇష్టంలేకపోయినా... భవిష్యత్‌లో సినిమా వ్యాపారం ప్రశ్నార్థకంగా మారతుండటం వల్ల తప్పడం లేదని పలువురు థియేటర్ యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం పార్కింగ్ ఫీజులను ఎత్తివేయడం, పెద్ద సినిమాల సమయంలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వాటాల విషయంలో వివాదాలు, సాంకేతికపరమైన ఇబ్బందుల వంటి కారణాలతో వ్యాపారం చతికిలపడిందని చెబుతున్నారు. ఇక మల్టీప్లెక్స్‌లతో దెబ్బతిన్న వ్యాపారం... కరోనా వల్ల పుట్టుకొచ్చిన ఓటీటీల కారణంగా మరింత క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో భాగ్యనగరంలోని చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగుకానున్నాయి.
ఇదీ చదవండి : 'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'