వెబ్ సిరీస్: ది ఫ్యామిలీమ్యాన్: సీజన్2; నటీనటులు: మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత తదితరులు; రచన, దర్శకత్వం: రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్.వర్మ; నిర్మాత: రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే; సంస్థ: డీ2ఆర్ ఫిల్మ్స్; విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
బాండ్.. జేమ్స్‌బాండ్.. ఈ పేరుకు, పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు అంత క్రేజ్ ఉంది. 2019లో వచ్చిన సీజన్-1 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దానికి కొనసాగింపుగా 'ఫ్యామిలీమ్యాన్: సీజన్-2' విడుదలైంది. మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు, ప్రస్తుత సిరీస్‌లో తెలుగు కథానాయిక సమంత నటించడం వల్ల దీనిపై అంచనాలను భారీగా ఏర్పడ్డాయి. అందునా సమంత ప్రతినాయిక పాత్రలో కనిపిస్తుందనేసరికి మరింత ఆసక్తిని పెంచింది. దీంతో పాటు ట్రైలర్ విడుదలతోనే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈసారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ ఎలాంటి సాహసం చేశారు? సమంత పోషించిన రాజీ పాత్ర కథేంటి?
కథేంటంటే: దిల్లీ కెమికల్ ఫ్యాక్టరీలోని ప్రమాద రసాయనాలను ఉగ్రవాదులు విడుదల చేయటం వల్ల పలువురు ప్రజలు చనిపోతారు. ఆ ఘటనను అడ్డుకోలేకపోయినందుకు తాను బాధ్యత వహిస్తూ టాస్క్‌లో సీనియర్ ఏజెంట్ అయిన శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పాయ్) తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు ఓ ఐటీ కంపెనీలో చేరతాడు. అయితే, తను చేస్తున్న ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోతాడు. ఒక ఆపరేషన్ నిమిత్తం జేకే తల్పాడే (షరీబ్ హష్మి) చెన్నై వెళ్లాల్సి వస్తుంది. శ్రీలంకలోని తమిళ రెబల్స్ ఓ భారీ కుట్రకు పాల్పడుతున్నారని తల్పాడేకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్‌తో పంచుకుంటాడు. సుచిత్ర (ప్రియమణి)తో జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా శ్రీకాంత్ మళ్లీ టాస్క్‌లో చేరతాడు. తమిళ రెబల్స్ చేయాలనుకుంటున్న ఆ భారీ విధ్వంసం ఏంటి? అందులో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ (సమంత) పాత్ర ఏంటి? శ్రీకాంత్ తివారి, అతడి టీమ్ ఆ కుట్రను ఎలా అడ్డుకుంది? ఈ క్రమంలో శ్రీకాంత్ కుటుంబానికి ఎదురైన ఆపద ఏంటి? దాని నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు?
ఎలా ఉందంటే: ఇప్పటివరకూ వెండితెరపై ఎన్నో రకాల జేమ్స్ బాండ్, డిటెక్టివ్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎంతో మంది ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తరహా కథ, పాత్రలతోనే రూపొందించిన ఇండియన్ టెలివిజన్ సిరీస్ ‘ఫ్యామిలీమ్యాన్’. కొన్ని అసాంఘిక శక్తులు సమాజంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నడం.. నిఘా, భద్రత విభాగంలో ఉన్న కథానాయకుడు వాటిని ఛేదించి కుట్రదారులను మట్టుబెట్టడం ప్రధానంగా దీని ఇతివృత్తం. కథా నేపథ్యం తెలిసినా దాన్ని ఎంత ఉత్కంఠగా, ప్రేక్షకులను తెర ముందు కూర్చోబెట్టగలిగేలా తీర్చిదిద్దామన్న దానిపైనే ఆ సినిమా/టెలివిజన్ సిరీస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ‘ఫ్యామిలీమ్యాన్: సీజన్-2’ బృందం సఫలమైంది. షో చూడటం మొదలు పెట్టిన తర్వాత క్లైమాక్స్ వరకూ బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది.
మొత్తం తొమ్మిది ఎపిసోడ్‌ల రూపంలో విడుదలైన తాజా సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది. శ్రీలంకలో అణచివేతకు గురవుతున్న తమిళులకు మద్దతుగా అక్కడి ప్రభుత్వంపై ఓ సంస్థ పోరాటం చేయటం, దాన్ని శ్రీలంక ఆర్మీ భగ్నం చేయడం, ఆ దాడి నుంచి కొందరు తప్పించుకుని పారిపోవడం తదితర సన్నివేశాలతో ఉత్కంఠగా షో మొదలువుతుంది. ఏళ్లు గడిచినా పగ, ప్రతీకారాలతో ఆ సంస్థ సభ్యులు రగిలిపోతుంటారు. తమ నాయకుడి ఆదేశాల కోసం స్లీపర్‌సెల్స్‌గా వేచి చూస్తుంటారు. కట్ చేస్తే శ్రీకాంత్ తివారి సీక్రెట్ ఏజెంట్ ఉద్యోగం వదిలి ఐటీ ఉద్యోగంలో చేరటం, అతడి కుటుంబం, ఆఫీస్‌లో శ్రీకాంత్ పడే ఇబ్బందులతో సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇవన్నీ కాస్త నిడివితో కూడుకున్నవి కావడం వల్ల అక్కడక్కడా శ్రీకాంత్ పంచ్‌లతో అలరించినా.. సాగదీతగా అనిపిస్తాయి. ఎప్పుడైతే శ్రీకాంత్ మళ్లీ టాస్క్ ఏజెంట్‌గా ఉద్యోగంలో చేరాడో అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతుంది. ఏమాత్రం భయంలేని, బోల్డ్ పాత్రలో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీగా సమంతను పరిచయం చేసిన తీరు కూడా ఆసక్తిగా ఉంటుంది.
వట్టి చేతులతో తనపై అధికారిని హతమార్చడం ద్వారా సమంత పాత్ర బలమేంటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తమ నాయకుడి నుంచి సందేశం వచ్చిన తర్వాత రాజీ పాత్ర మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. రాజీ, ఆమె బృందం భారీ కుట్రకు యత్నించడం, అడుగడుగునా శ్రీకాంత్ బృందం అడ్డుకోవడం ఇలా సన్నివేశాలన్నీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతాయి. ఒకసారి రాజీ బృందం పైచేయి సాధిస్తే, మరోసారి శ్రీకాంత్ బృందం పైచేయి సాధిస్తుంది. పోలీసులు అడ్డుకున్న ప్రతిసారీ రాజీ కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంటుంది. ఇలా కథనం కీలక మలుపులు తిరుగుతూ షో చూస్తున్న ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతుంది.
ఒకవైపు వీరి పోరాటం చూపిస్తూనే.. కౌమారదశలో ఉండే పిల్లలు ఎలాంటి వాటికి ప్రభావితమవుతారన్న అంశాలను శ్రీకాంత్ కుమార్తె ధ్రుతి ద్వారా దర్శక-రచయితలు చక్కగా చూపించారు. పోలీసులకు పట్టుబడిన రాజీని ఆమె బృందం విడిపించటం, అపహరణకు గురైన కుమార్తెను శ్రీకాంత్ రక్షించుకునే సన్నివేశాలు తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్లు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏం జరుగుతుందో ఊహించగలుగుతారు. అయినా ప్రతి ఎపిసోడ్ బోర్ కొట్టకుండా అలరించేలా తీర్చిదిద్దారు. పతాక సన్నివేశాలతో సహా ప్రతి యాక్షన్ ఎపిసోడ్ రియలిస్టిక్‌గా రూపొందించారు. ఎక్కడా భారీదనానికి పోలేదు. ప్రతి సన్నివేశాన్ని సహజంగానే చూపించే ప్రయత్నం చేశారు. అందరూ ఊహించినట్లే క్లైమాక్స్ ఉంటుంది. తొలి సీజన్‌లో ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసినా, కెమికల్ ఫ్యాక్టరీ ఉదంతంతో ప్రేక్షకుడు దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కానీ, తాజా సీజన్‌లో దర్శక-రచయితలు అందరూ మెచ్చే క్లైమాక్స్ ఇచ్చారు. మొదటి రెండు ఎపిసోడ్‌లలో ఐటీ ఉద్యోగిగా తన బాస్‌తో శ్రీకాంత్ పడే ఇబ్బందులు సాగదీతగా, కాస్త ఇరికించినట్లు అనిపిస్తాయి. అదే విధంగా శ్రీకాంత్ కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నిడివి పెరగడానికి కారణమయ్యాయి.
ఎవరెలా చేశారంటే: టాస్క్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. తొలి సీజన్‌లోనే ఆయనేంటో నిరూపించారు. ఇప్పుడు ఆయన నటన, పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు కుటుంబం కోసం తాపత్రయపడే వ్యక్తిగా మరో వైపు దేశం కోసం పరితపించే ఏజెంట్‌గా తన నటనతో మెప్పించారు. కుటుంబంలో తాను ఎదుర్కొంటున్న ఒత్తిడిని కళ్లతోనే పలికించారు మనోజ్. గతంలో మాదిరిగానే తనదైన కామెడీ పంచ్‌లతో అలరించారు. సీజన్-2కు ప్రధాన ఆకర్షణ సమంత. పగ, ప్రతికారంతో రగిలిపోయే తమిళ రెబల్‌గా సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో ఆమె కట్టిపడేసింది. మొదటి సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకూ సీరియస్ మూడ్‌ను కొనసాగించింది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో సరికొత్త సమంతను ప్రేక్షకులు చూస్తారు. ఆయా సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్ అని చెప్పాలి. తన లక్ష్యం కోసం ఏపని చేయడానికైనా సిద్ధపడే రాజ్యలక్ష్మిగా సమంత మెస్మరైజ్ చేసింది. ఇక తల్పాడేగా షరీబ్, ముత్తుగా రవీంద్ర విజయ్, ఉమయాల్‌గా దేవదర్శిని, భాస్కర్‌గా గోపి, దీపన్‌గా అజగమ్ పెరుమాళ్ తమదైన నటనతో మెప్పించారు. ప్రియమణి, శరద్ ఖేల్కర్ పాత్రలు పరిమితం.
సాంకేతికంగా.. ‘ఫ్యామిలీమెన్ సీజన్-2’ అత్యున్నతంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశాన్నీ హాలీవుడ్ సినిమా స్థాయిలో రిచ్‌నెస్ తీశారు. అదే సమయంలో రియలస్టిక్‌గా తీర్చిదిద్దారు. సచిన్ జిగార్, కేతన్ సోధా సంగీతం షోను మరోస్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వాస్తవికతకు దగ్గరగా ఉంది. కేమరన్ బ్రిసన్ సినిమాటోగ్రఫ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సన్నివేశాలను సింగిల్ టేక్‌లో తీశారు. షో ప్రారంభ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం అద్భుతం. క్లైమాక్స్ ఫైట్ మొత్తం సింగిల్ టేక్‌తో తీశారంటే నటులు, సాంకేతిక బృందం ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. సుమీత్ ఎడిటింగ్‌కు కాస్త పని చెప్పాల్సింది. శ్రీకాంత్ కుటుంబం, ఆఫీస్‌లో అతడు పడే ఇబ్బందులు తదితర సన్నివేశాలకు కోత పెట్టాల్సింది. తొలిసీజన్‌ను మించేలా రాజ్ అండ్ డీకే ‘ఫ్యామిలీమెన్: సీజన్ 2’ను తెరకెక్కించారు. తర్వాత ఏం జరుగుతుందని సగటు ప్రేక్షకుడికి తెలిసినా, కథ, కథనాలను ఆసక్తి మలచడంలో నూటికి నూరు మార్కులు సాధించారు. గూఢచారులు ఎలా పనిచేస్తారు? అసాంఘిక శక్తులు తప్పించకునేందుకు ఎలాంటి వారిని ఎరగా వేస్తారు? యువత ఎలా పెడదారి పడుతోంది? ఇలా ప్రతి అంశాన్ని దర్శక ద్వయం స్పృశించింది. ‘దేశం కోసం చనిపోవచ్చు కానీ, ఈ నీచమైన రాజకీయాల కోసం కాదు’, ‘ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. మన చుట్టూ ఏం జరిగినా ఈ దేశాన్ని కాపాడటం మన బాధ్యత’ వంటి సంభాషణలు మెప్పిస్తాయి.
బలాలు
+ మనోజ్ బాజ్‌పాయ్, సమంత
+ కథ, కథనాలు
+ సినిమాటోగ్రఫీ, సంగీతం
+ దర్శకత్వం, నిర్మాణ విలువలు
బలహీనతలు
- తొలి రెండు ఎపిసోడ్‌లలో కొన్ని సన్నివేశాలు
- నిడివి
చివరిగా: ‘ఫ్యామిలీ మ్యాన్: సీజన్-2’... ఈసారి డబుల్ థ్రిల్లింగ్..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">