చిత్రం: ఆకాశం నీ హద్దురా
తారాగణం: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి తదితరులు
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
కథ, దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత: సూర్య
విడుదల: 12/11/20 (అమెజాన్ ప్రైమ్)
![suriya aakasam nee haddura movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9519278_aane-2.jpg)
తెలుగు తెరపై జీవిత కథలు కొత్తేం కాదు. కానీ ప్రజలు మెచ్చిన ఓ వ్యాపారవేత్త జీవితం సినిమాగా వస్తే ఆసక్తికరమే. అలాంటి ప్రయత్నం 'ఆకాశం నీ హద్దురా'. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. 'సింప్లీ ఫ్లై' అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకున్నారు. గోపీనాథ్ జీవితం ఎంత ఆసక్తికరమో, ఆ పాత్రలో సూర్య కనిపించడం ఇంకా ఆసక్తికరం. సినిమా కోసం సూర్యలో కనిపించిన మేకోవర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. అలాంటి సినిమా గురువారం(నవంబరు 12), అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఎలా ఉందంటే?
కథేంటంటే?
2003లో విమానం ల్యాండింగ్ కోసం ఓ పైలట్ ప్రయత్నించడం, ఏవియేషన్ అధికారులు అంగీకరించకపోవడంతో సినిమా మొదలవుతుంది. అసలు ఏవియేషన్ అధికారులు ఎందుకు అంగీకరించలేదు... చంద్రమహేష్ అలియాస్ మహా (సూర్య) అధికారులతో గొడవపడి ఎందుకు ల్యాండ్ చేయించాడు. ఆ విమానం ఏంటి? ఎందుకు ఎగిరింది? అసలు దిగడానికి ఎందుకు అంగీకరించలేదు. విమానానికి మహాకు ఏంటి సంబంధం, ‘విమాన’ ప్రయాణంలో మహా భార్య సుందరి (అపర్ణా బాలమురళి), పరేశ్ గోస్వామి (పరేశ్ రావల్), భక్తవత్సలం నాయుడు (మోహన్‌బాబు)ల పాత్రలేంటి అనేదే కథ.
![suriya aakasam nee haddura movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9519278_aane-5.jpg)
సినిమా ఎలా ఉందంటే?
బయోపిక్‌లను తీయాలంటే చాలా ధైర్యం కావాలి. సినిమా నటుల జీవిత కథలంటే... కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి. కానీ ఇతరులు, ముఖ్యంగా వ్యాపారవేత్తల జీవిత కథలు అనేసరికి కత్తి మీద సామే. అచ్చంగా కథ చెప్పేస్తే బోర్ కొట్టేస్తుంది, మరీ సినిమాటిక్‌గా చెబితే విషయం పక్కదారి పట్టింది అంటారు. అలా వచ్చి విజయాలు సాధించిన వాళ్లు చాలా తక్కువ మంది. ‘ఆకాశం నీ హద్దురా’తో సుధ కొంగర అలాంటి ప్రయత్నమే చేశారు. ఈ విషయంలో ఆమె విజయవంతం అయ్యారనే చెప్పాలి. కెప్టెన్ గోపీనాథ్ జీవితం పల్లెటూరు నుంచి విమాన సంస్థ అధిపతిగా ఎదిగిన క్రమం చూపించిన విధానం బాగుంది. ఆయన జీవన ప్రయాణంలో ఏ ఒక్క స్టేజీని వదలకుండా చూపించారు. దానికి వినోదం, కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలు జోడించి రాసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో నిడివి పెరిగిపోయింది.
![suriya aakasam nee haddura movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9519278_aane-4.jpg)
కథను సూటిగా ఒకే ఫ్లోలో చెప్పకుండా, ముందుకు వెనక్కి మార్చి... బోర్ కొట్టకుండా చూసుకున్నారు దర్శకురాలు. ప్రథమార్ధంలో పాటలు, వినోదంతో కథను ముందుకు నడిపించారు. ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి విమానయాన సంస్థ ఏర్పాటు కోసం హీరో పడ్డ కష్టాలు, దానిని అధిగమించిన విధానం ఉంటుంది. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాయకనాయికల మధ్య వచ్చే సన్నివేశాలు సాధారణ సినిమాల్లో కనిపించవు. పెళ్లి చూపులు దగ్గర నుంచి, వ్యాపారంలో తోడుగా ఉన్నంతవరకు, ఆ తర్వాత వ్యాపారం కష్టాల్లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా ఆఖరున పేద ప్రజలు విమానం దిగిన సన్నివేశాలు కూడా బాగుంటాయి. అయితే సూర్య, మోహన్‌బాబు, పరేశ్‌రావల్ మాత్రమే మనకు తెలిసిన ముఖాలు కావడం ఇబ్బంది పెట్టింది. డబ్బింగ్ సినిమా కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే.
![suriya aakasam nee haddura movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9519278_aane-1.jpg)
ఎవరెలా చేశారంటే?
సినిమాను సూర్య ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పొచ్చు. విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా సూర్య నటన అదిరిపోయిందంతే. ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక... టికెట్ కొనలేకపోయిన సందర్భంలో సూర్య నటనకి చప్పట్లు తక్కువే. పతాక సన్నివేశాల్లో సూర్య నటన చూస్తే... అతనిని ఎందుకు స్టార్ హీరో అంటారో తెలుస్తుంది. భర్త మనసును అర్థం చేసుకొని, అతని ఉన్నతిని కాంక్షించే భార్యగా అపర్ణ చక్కగా నటించింది. గడుసుతనం చూపిస్తూనే, అనుకున్నది సాధించే మహిళగా కనిపించింది. భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్‌బాబు తనదైన శైలిలో నటించారు. తొలుత సీరియస్‌గా కనిపించినా, అవసరమైన సమయంలో తన పాత్రలో షేడ్ మార్చి అలరించారు. మహా ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్‌గా పరేశ్ రావల్ మంచి నటనను కనబరిచారు. సూర్య తల్లి పాత్రలో ఊర్వశి, ఇతర నటీనటులు పాత్ర పరిధి మేరకు నటించారు.
![suriya aakasam nee haddura movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9519278_aane-1.png)
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం బాగుంది. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ నికేత్ చక్కగా సన్నివేశాల్ని కెమెరాలో బంధించాడు. జీవిత కథను సినిమాగా తీసుకురావడంలో సుధా కొంగర, షాలిని ఉషాదేవి సఫలీకృతులైనట్లుగా చెప్పుకోవచ్చు. నిజ జీవిత కథకు సినిమాటిక్ ఫిక్షన్ జోడించాం అని చిత్రబృందం చెప్పేసింది. ఆ ఫిక్షన్ జోడింపు సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు దర్శకురాలు. సూర్య లాంటి పెద్ద స్టార్‌ను హ్యాండిల్ చేయడంలోనూ ఆమె విజయం సాధించారనే చెప్పాలి. రాకేందు మౌళి మాటలు కూడా ఆకట్టుకుంటాయి. సూర్యకు సత్యేదేవ్ డబ్బింగ్ అంతగా అతకలేదు అనిపిస్తోంది. సినిమా నిడివి విషయంలో ఎడిటర్ సతీష్ సూర్య ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు: సూర్య నటన, కథ..
బలహీనతలు: నిడివి, తెలుగుదనం లోపించడం
చివరిగా: ఆకాశం నీ హద్దురా... విజేత ప్రయాణం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">