చిత్రం: వరుణ్ డాక్టర్; నటీనటులు: శివ కార్తికేయన్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, వినయ్ రాయ్, మిలింద్ సోమన్ తదితరులు; సంగీతం: అనిరుధ్; నిర్మాత: శివ కార్తికేయన్; దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; విడుదల తేదీ: 09-10-2021
తెలుగు చిత్రసీమలో దసరా జోష్ కనిపిస్తోంది. ప్రేక్షకులకు పండగ వినోదాలు అందించేందుకు తెలుగు చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్నాయి. ఈ రేసులో 'వరుణ్ డాక్టర్' అనే ఓ అనువాద చిత్రమూ అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది. తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన చిత్రమిది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. 'రెమో', 'శక్తి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత కార్తికేయన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. దీనికి తోడు ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం వల్ల ప్రేక్షకుల్లోనూ అంచనాలేర్పడ్డాయి. మరి 'వరుణ్ డాక్టర్' ఆ అంచనాల్ని అందుకుందా? లేదా?
కథేంటంటే: వరుణ్ (శివ కార్తికేయన్) ఓ ఆర్మీ డాక్టర్. పెళ్లిచూపుల్లో పద్మిని (ప్రియాంక అరుళ్ మోహన్)ని చూసి ఇష్టపడతాడు. ఆమెతో ఏడడుగులు వేయడానికి సిద్ధపడుతున్న సమయంలోనే.. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో అనుకోకుండా పద్మిని చెల్లెలు కిడ్నాప్ అవుతుంది. దీంతో ఆ పాపను వెతికి పట్టుకునే బాధ్యతను వరుణ్ తన భుజాలకు ఎత్తుకుంటాడు. ఆ పిల్ల కోసం వెతుకుతున్న క్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ పాపలాగానే గత నాలుగేళ్లలో 400మంది వరకూ పిల్లలు కిడ్నాప్ అయ్యారని తెలుస్తుంది. మరి ఈ భారీ కిడ్నాప్ రాకెట్ వెనకున్న ఆ అరాచక శక్తి ఎవరు? ఆ దుర్మార్గుడ్ని వరుణ్ ఎలా పట్టుకుంటాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? కనిపించకుండా పోయిన ఆ పిల్లలందరూ క్షేమంగా తిరిగొస్తారా? అన్నది తెరపై చూడాలి!
ఎలా ఉందంటే: మనుషుల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నగరంలో వరుస కిడ్నాప్‌లు.. వాటిని పట్టుకునేందుకు ఓ ఆర్మీ డాక్టర్ రంగంలోకి దిగడం.. ఓ బాధిత కుటుంబాన్ని తన సైన్యంగా మార్చుకుని ఆ కిడ్నాప్ రాకెట్‌ను ఛేదించే ప్రయత్నం చేయడం.. ఇలా లైన్‌గా వింటున్నప్పుడు దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భలే కథ ఎంచుకున్నాడు కదా అనిపిస్తుంది. బహుశా కార్తికేయన్ కూడా ఈ కథను విన్నప్పుడుఅలాగే ఫీలై సినిమాకు ఓకే చెప్పి ఉంటాడు. నిజానికి ఇలాంటి కథల్ని చెప్పడంలో కంటే తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోనే దర్శకుడి సత్తా బయటపడుతుంది. అయితే ఈ విషయంలో నెల్సన్ తొలి ఫ్రేం నుంచే బోల్తా కొట్టినట్లు అనిపిస్తుంది. థ్రిల్లర్‌గానే ప్రేక్షకులు ఊహించని మలుపుల్ని.. బిగి సడలని కథనాన్ని ఊహిస్తారు. తాను చెప్పే కథలో ఎన్ని చిక్కుముడులు ఉంటే కథ అంత రసవత్తరంగా సాగుతుంది. కానీ, ఇలాంటి మలుపులు, ఆసక్తిరేకెత్తించే చిక్కుముడులు ఈ కథలో ఒక్కటి కూడా కనిపించదు. దీనికి తోడు సీరియస్‌గా నడిపించాల్సిన ఇలాంటి కథనాల్ని.. నెల్సన్ కామెడీ యాంగిల్‌లో నడిపించాలనుకోవడం మరో పెద్ద పొరపాటు. అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్.
ఆరంభంలో శివ కార్తికేయన్ ఎంట్రీ నిస్తేజంగా ఉంటుందో.. ఆ తర్వాత సాగే కథనం కూడా అంతే చప్పగా ఉంటుంది. ప్రారంభంలోనే ప్రేమించిన తనను అమ్మాయి కాదనడం.. దానికి ఆమె చెప్పిన సిల్లీ కారణాలతో కథ నిరుత్సాహంగా కథ మొదలు పెట్టిన దర్శకుడు.. వెంటనే ఓ కిడ్నాప్ అంశాన్ని తెరపైకి తెచ్చి కథలో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కిడ్నాప్‌లు జరిగిన తీరులోనూ.. ఆ కేసును ఛేదించే క్రమంలో కార్తికేయన్ వేసే ఎత్తుగడల్లోనూ ఎక్కడా నాటకీయత కనిపించదు. ప్రతిదీ చాలా సిల్లీగా.. ఊహలకు తగ్గట్లుగా సాగుతున్నట్లుండటం వల్ల ప్రథమార్ధమంతా బోరింగ్‌గా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కిడ్నాప్ రాకెట్‌ను ఛేదించేందుకు కార్తికేయన్ కూడా అదే తరహాలో కిడ్నాప్ డ్రామాలతో రౌడీల్ని బురిడీ కొట్టించే సన్నివేశాలు మరింత నవ్వు తెప్పించేలా ఉంటాయి తప్ప ఏ మాత్రం రసవత్తరంగా అనిపించవు.
అయితే ఈ క్రమంలో యోగిబాబు పంచే నవ్వులే కాస్తో కూస్తో కాలక్షేపాన్ని అందిస్తాయి. సరిగ్గా విరామ సమయానికి హీరో కిడ్నాప్ అయిన అమ్మాయిలు గోవాలో ఉన్నారని తెలుసుకోవడం.. వాళ్లను విడిపించేందుకు ఓ ఆపరేషన్ ప్రారంభించడం వల్ల ద్వితీయార్ధంలో ఏం జరగబోతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. ఇక కథ గోవాకు షిఫ్ట్ అయ్యాక.. కథనంలో వేగం పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడా నిరాశే ఎదురవుతుంది. ప్రధాన ప్రతినాయకుడు వినయ్ రాయ్‌కు.. శివ కార్తికేయన్‌కు మధ్య నడిచే మైండ్ గేమ్‌లోనూ ఎలాంటి ఉత్కంఠత కనిపించదు. అయితే ఆట పేరుతో యోగిబాబు వినయ్ గ్యాంగ్‌ను చితక్కొట్టే సన్నివేశాలు మాత్రం నవ్వులు పంచుతాయి. క్లైమాక్స్‌లో కార్తికేయన్‌కు.. వినయ్‌కు మధ్య వచ్చే పోరు. కిడ్నాప్ అయిన అమ్మాయిల్ని చెర నుంచి బయటకు తీసుకెళ్లేందుకు వేసిన ఎత్తుగడ ఫర్వాలేదనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే: డాక్టర్ వరుణ్ పాత్రలో శివ కార్తికేయన్ ఒదిగిపోయారు. ఆద్యంతం ఓ సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే.. స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మెట్రో ట్రైన్‌లో ఆయన ప్రతినాయకులతో చేసే ఫైట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పద్మినిగా ప్రియాంక ఫర్వాలేదనిపించింది. సినిమా మొత్తం ఆమె పాత్ర కనిపించినా.. నటనకు ఎక్కడా ఆస్కారం ఉండదు. యోగిబాబు తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రతినాయకుడిగా వినయ్ స్టైలిష్‌గా కనిపించినా.. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు చాలా పేలవంగా అనిపిస్తుంది. నెల్సన్ మంచి కథను ఎంచుకున్నా.. దాన్ని ఆసక్తికరమైన కథనంగా మార్చుకోవడంలో పూర్తిగా తడబడ్డాడు. క్లైమాక్స్‌లో అనిరుధ్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. విజయ్ కార్తిక్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది.
బలాలు
+ శివ కార్తికేయన్ నటన
+ యోగిబాబు కామెడీ
బలహీనతలు
- కథ, కథనం
- సాగతీత సన్నివేశాలు
చివరిగా: డాక్టర్ ఆపరేషన్ ఫెయిల్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">