చిత్రం: ఒరేయ్ బామ్మర్ది
నటీనటులు: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్, లిజోమల్ జోస్, కశ్మీర, మధుసూధనన్, దీప రామానుజమ్, ప్రేమ్ తదితరులు
నిర్మాత: ఎ.ఎన్.బాలాజీ
సంగీతం: సిద్ధు కుమార్
ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్.కుమార్
దర్శకుడు: శశి
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
విడుదల తేదీ: 13-08-2021
కథేంటంటే: బైక్ రేస్‌లంటూ అల్లరిగా తిరిగే ఆవేశపరుడైన కుర్రాడు మదన్(జీవీ ప్రకాష్ కుమార్). అక్క రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ (లిజోమోల్ జోస్) అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోవడం వల్ల తానే అమ్మానాన్నై అక్కని ఎంతో జాగ్రతగా చూసుకుంటుంటాడు. అందుకే ఆమెకి కూడా తమ్ముడంటే అంతే ప్రేమ. రాజశేఖర్ అలియాస్ రాజ్ (సిద్ధార్థ్) నిజాయితీ గల దమ్మున్న ట్రాఫిక్ పోలీస్. రూల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అలాంటి రాజ్‌కు మదన్ ఓ రోజు బైక్ రేసింగ్ చేస్తూ దొరికిపోతాడు. ఆ సమయంలో రాజ్ అతనికి ఆడవాళ్ల నైటీ వేసి అందరి ముందు అవమానిస్తాడు. అరెస్ట్ చేసి ఓ రోజంతా జైల్లో వేస్తాడు. దీంతో రాజ్‌పై పగ పెంచుకుంటాడు మదన్. తనని అందరి ముందు అవమానించిన అతన్ని దెబ్బకు దెబ్బ తీయాలని కసిగా ఎదురు చూస్తుంటాడు. ఈలోపు ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. తనెవరి వల్లయితే అవమాన పడ్డాడో ఆ రాజే తన అక్కకి భర్తగా.. తనకి బావగా వస్తాడు. దీంతో అతనికి పుండు మీద కారం చల్లినట్లవుతుంది. తన మాట కాదని రాజ్‌ను పెళ్లి చేసుకున్నందుకు అక్కని కూడా దూరం పెడతాడు మదన్. రాజ్‌పై మరింత పగ పెంచుకుంటాడు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు మదన్ బైక్ దొంగతనం చేస్తారు. ఆ బండితో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ఆ కేసులో మదన్‌ని ఇరికిస్తారు. దీంతో బామ్మర్దిని కాపాడుకునేందుకు రాజశేఖర్ రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజ్ తన బామ్మర్దిని ఎలా కాపాడుకున్నాడు? అక్కని తమ్ముడిని కలపడానికి అతనేం చేశాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? మధ్యలో డ్రగ్ డీలర్ మధు (మధుసూధన్ రావు)కి రాజశేఖర్‌కి నడిచే పోరు ఏంటి? మధన్.. కవిన్ (కశ్మీరా)ల ప్రేమకథ ఏమైంది? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే: మానవ జీవితాల్లోని భావోద్వేగాలు.. వాటి తాలూకు సంఘర్షణలతో ఆసక్తికరంగా కథలు అల్లడంలో సిద్ధహస్తుడు దర్శకుడు శశి. 'బిచ్చగాడు'తో తల్లీబిడ్డల అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించిన ఆయన.. ఇప్పుడీ 'ఒరేయ్ బామ్మర్ది'తో బావా బామ్మర్దుల అనుబంధాన్ని.. అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలను చూపించే ప్రయత్నం చేశారు. తమిళంలో విజవంతమైన 'సివప్పు మంజల్ పచ్చై' చిత్రానికి తెలుగు అనువాదమిది. ప్రథమార్ధంలో మధన్ - రాజ్యలక్ష్మిల బాల్యం.. వారిద్దరి మధ్య అనుబంధాన్ని చూపిస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తర్వాత మదన్ రేసింగ్ చేస్తూ రాజశేఖర్‌కు పట్టుపడటం.. అతని నుంచి తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథలో వేగం పెరుగుతుంది. అనంతరం మదన్‌ని రాజ్ అవమానకర రీతిలో అరెస్ట్ చేయడం వల్ల రసవత్తరంగా మారుతుంది. ఓవైపు మదన్ తనకు జరిగిన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుందామా అని ఆలోచిస్తున్న తరుణంలోనే.. రాజ్ తన ఇంటికి పెళ్లి చూపులకు రావడం.. తొలి చూపులోనే రాజీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం వల్ల కథలో అనుకోని మలుపు చోటు చేసుకుంటుంది. తర్వాత ఆ పెళ్లిని చెడగొట్టడానికి మదన్ రకరకాల ఎత్తులు వేయడం.. ఆ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ రాజ్ అతన్ని ముప్పుతిప్పలు పెట్టడం వంటి సన్నివేశాలతో సినిమా టామ్ అండ్ జెర్రీ రేస్‌లా సరదాగా సాగిపోతుంటుంది. అయితే మధ్యలో వచ్చే మదన్ - కవిన్‌ల లవ్ ట్రాక్ కథకి స్పీడ్ బ్రేకర్‌లా అడ్డు పడుతున్నట్లు అనిపిస్తుంటుంది. సరిగ్గా విరామ సమయానికి ముందు రాజీని రాజ్ పెళ్లి చేసుకోవడం.. ఈ క్రమంలో మదన్ - రాజ్‌ల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం వల్ల ద్వితీయార్ధంలో ఏం జరగనుందా? అన్న ఆసక్తి పెరుగుతుంది.
ప్రథమార్ధమంతా బిగితో నడిచిన కథనం.. ద్వితీయార్ధంలో పూర్తిగా గాడి తప్పుతుంది. మదన్ అనుకోని రీతిలో చైన్ స్నాచింగ్ కేసులో ఇరుక్కోవడం.. బామ్మర్దిని కాపాడేందుకు రాజశేఖర్ రంగంలోకి దిగడం.. తన పూచీకత్తుపై విడిపించుకుని ఇంటికి తీసుకురావడంతో ఇద్దరి మధ్య ఏం జరగబోతుందన్న ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో డ్రగ్ డీలర్ మధుతో రాజ్‌కి పోరు మొదలవడం వల్ల సినిమా ఓ థ్రిల్లర్‌లా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచే కథపై పూర్తిగా పట్టుకోల్పోయాడు దర్శకుడు. ఇటు చైన్ స్నాచింగ్ కేసులో.. అటు డ్రగ్ డీలర్ మధు కేసులో ఊహించని మలుపులేవో ఉంటాయనుకుంటే.. ఆ రెండు ట్రాక్‌లు చాలా పేలవంగా సాగుతుంటాయి. ముఖ్యంగా డ్రగ్ డీలర్ మధును అరెస్ట్ చేసేందుకు రాజ్ వేసిన ఎత్తుగడ.. అరెస్ట్ అయ్యాక పోలీసుల నుంచి అతను తప్పించుకునే తీరు మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో రాజ్.. మధన్‌ల మధ్య వచ్చే రేసింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపినా.. సినిమాని ముగించిన తీరు అంత సంతృప్తికరంగా అనిపించదు.
ఎవరెలా చేశారంటే: నిజాయతీ గల ట్రాఫిక్ పోలీస్‌గా రాజశేఖర్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పాత్రకు తగ్గట్లుగా చాలా సెటిల్డ్‌గా నటించాడు. బైక్ రేస్‌లంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యవకుడిగా జి.వి.ప్రకాష్ తనదైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా సిద్ధార్థ్ - ప్రకాష్‌ల మధ్య వచ్చే వార్ ఎపిసోడ్స్.. ప్రకాష్ రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తమ్ముడిని అమితంగా ప్రేమించే అక్కగా రాజీ పాత్రలో లిజోమోల్ చక్కటి అభినయాన్ని చూపించింది. ద్వితీయార్ధంలో భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. కశ్మిరా, మధుసూధన్ పాత్రల్ని బలంగా తీర్చుదిద్దలేకపోయారు. ఆ పాత్రల్ని దర్శకుడు కథలో తన సౌకర్యం కోసం సృష్టించుకున్నట్లు అనిపిస్తుంది. శశి ప్రధమార్ధంలో కథని ఆసక్తికరంగా చెప్పినా.. ద్వితీయార్ధంలో తడబడ్డారు. సిద్ధు కుమార్ స్వరాలు.. ప్రసన్న కుమార్ ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
బలాలు | బలహీనతలు |
+ సిద్ధార్థ్.. జీవీ ప్రకాష్ నటన | - ద్వితీయార్ధం |
+ ఎంచుకున్న కథాంశం | - క్లైమాక్స్ |
+ ప్రథమార్ధం |
చివరిగా: అక్కడక్కడా అలరించే 'బావాబామ్మర్దులు'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: పుష్ప 'దాక్కో దాక్కో మేక' సాంగ్ వచ్చేసింది