చిత్రం: నాట్యం; నటీనటులు: సంధ్యా రాజు, ఆదిత్య మేనన్, రోహిత్ బెహల్, కమల్ కామరాజు, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ తదితరులు; సంగీతం: శ్రావణ్ భరద్వాజ్; నిర్మాత: సంధ్యా రాజు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, కూర్పు, ఛాయాగ్రహణం: రేవంత్ కోరుకొండ; విడుదల తేదీ: 22-10-2021
చిత్రసీమలో దసరా కొత్త ఉత్సాహాన్ని నింపింది. 'మహా సముద్రం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'పెళ్లి సందD' వంటి చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టాయి. దీంతో సినీప్రియులు ఉత్సాహంగా థియేటర్ల వైపు అడుగేశారు. ఈ వారం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే బాధ్యతను చిన్న సినిమాలు భుజానికెత్తుకున్నాయి. వాటిలో కాస్తో కూస్తో ఆకర్షించింది 'నాట్యం'(Natyam Movie Review). ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు(sandhya raju movies) ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రమిది. రేవంత్ కోరుకొండ తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రతారలు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం.. సంధ్యారాజు ప్రయత్నాన్ని అభినందిస్తూ సినిమాపై ప్రశంసలు కురిపించడం వల్ల అందరి దృష్టీ దీనిపై పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందిందా? నటిగా సంధ్యా రాజుకు తొలి ప్రయత్నంలోనే విజయం దక్కిందా?
కథేంటంటే?
సంప్రదాయ నృత్యానికి పెట్టింది పేరు నాట్యం గ్రామం. అక్కడందరూ క్లాసికల్ డ్యాన్సర్లే. వాళ్లలో సితార (సంధ్యా రాజు) ఒకరు. నాట్యమే ఊపిరిగా జీవించే ఆమెకు ఓ కల ఉంటుంది. చిన్నతనంలో తన గురువు (ఆదిత్య మేనన్) తనకు చెప్పిన కాదంబరి కథను ఎప్పటికైనా అందరి ముందు ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే ఆ కథను ఎవరు చెప్పాలనుకున్నా.. వారి ప్రాణానికి ముప్పు తప్పదనేది అందరిలో బలంగా నాటుకుపోయిన నమ్మకం. దీనికి గురువు గారి భార్య మరణమే ఉదాహరణగా భావిస్తుంటారు ఆ ఊరి వాళ్లు. అందుకే సితార కోరికకు ఆమె గురువు అడ్డు చెబుతారు. నిజానికి దీని వెనుక మరో ఆసక్తికర కథ దాగి ఉంటుంది. అదేంటి? అసలు కాదంబరి ఎవరు? ఆమె కథ ఏంటి? ఆ కథను సితార ప్రజలందరికీ ఎలా తెలియజేసింది? ఈ క్రమంలో ఆమె లక్ష్య సాధనకు వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్ (రోహిత్ బెహల్) ఎలా సాయపడ్డాడు?అన్నది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే?
నాట్యం, సంగీతం ప్రధానంగా సాగే కళాత్మక చిత్రాలకు కళాతపస్వి కె.విశ్వనాథ్ చిరునామా. ఆయన నుంచి వచ్చిన 'సాగర సంగమం', 'శంకరాభరణం', 'స్వర్ణకమలం', 'సిరిసిరి మువ్వ' వంటి చిత్రాలు సినీ ప్రియులపై చెరగని ముద్ర వేశాయి. ఇలాంటి కళాత్మక కథలు ప్రశంసలు దక్కించుకుంటాయే తప్ప.. కాసులు కురిపించవనే నమ్మకం నిర్మాతల్లో నాటుకుపోయింది. అందుకే ఇటీవల కాలంలో ఆ తరహా ప్రయత్నాలు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ నాట్య ప్రధాన కథాంశంతో 'నాట్యం' తీసుకురావాలనుకోవడం అభినందించాల్సిన విషయం. రేవంత్ ఈ కథను భావోద్వేగభరితమైన ఎమోషనల్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేశాడు. దీని కోసం ఆయన ఎంచుకున్న స్టోరీ లైన్.. దాన్ని ఆరంభించిన తీరు మెప్పిస్తాయి. ప్రారంభంలో నాట్యం గ్రామం.. అందులోని దేవాలయం.. దాని వెనుకున్న కథను ఆసక్తికరంగా వివరిస్తూ సినిమా ప్రారంభించిన తీరు బాగుంది. కాదంబరి కథను చెప్పాలనుకునే ప్రయత్నంలో ఆదిత్య మేనన్ తన భార్యను పోగొట్టుకోవడం వల్ల అసలు ఆ కథేంటి? ఎందుకిలా జరుగుతుందన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. సితారగా సంధ్యారాజును పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే రోహిత్ పాత్ర ప్రవేశించాక కథలో వేగం తగ్గినట్లనిపిస్తుంది. ముఖ్యంగా నాట్యం నేర్పించే క్రమంలో అతనికి సితారకి మధ్య వచ్చే సన్నివేశాలు మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సమయానికి సితారకు తన ఊరి వాళ్ల నుంచే ప్రమాదం ఎదురవడం.. ఈ క్రమంలో రోహిత్ వారి నుంచి ఆమెని కాపాడి హైదరాబాద్‌కి తీసుకురావడం వల్ల ద్వితీయార్ధంపై ఆసక్తి పెరుగుతుంది.
ప్రథమార్ధంలో ఆసక్తికరంగా కథ నడిపిన దర్శకుడు.. ముగింపు వరకు ఆ ఆసక్తిని కొనసాగించలేకపోయాడు. ముఖ్యంగా సితార హైదరాబాద్‌కు వచ్చాక రోహిత్ డ్యాన్స్ ట్రూప్‌తో వచ్చే సన్నివేశాలు, ఇద్దరి మధ్య నడిచే లవ్ ట్రాక్ ఏ మాత్రం రసవత్తరంగా అనిపించదు. మళ్లీ సితార తన ఊరిలోకి ప్రవేశించాకే కథలో వేగం పెరుగుతుంది. ముగింపులో వచ్చే కాదంబరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. దాన్ని నృత్యరూపకంగా సితార - రోహిత్ టీమ్ ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. ఈ ఎపిసోడ్‌లోని సంఘర్షణను మరింత భావోద్వేగభరితంగా తీర్చిదిద్దుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
సితార పాత్రలో సంధ్యా రాజు అభినయం ఆకట్టుకుంది. క్లాసికల్ డ్యాన్స్ విషయంలో ఆమె ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఆరంభంలో ఆమెకి కమల్ కామరాజుకు మధ్య వచ్చే పరిచయ గీతం, ముగింపులో ఆమెకు రోహిత్‌కు మధ్య వచ్చే కాదంబరి నృత్యరూపకం ఆకట్టుకుంటుంది. రోహిత్ పాత్రలో రోహిత్ బెహల్ చక్కగా ఒదిగిపోయాడు. తెరపై అందంగా కనిపించాడు. నటన పరంగా పెద్దగా ఆస్కారం లేకున్నా.. అటు వెస్ట్రన్ డ్యాన్స్, ఇటు క్లాసికల్ డ్యాన్స్‌లో ఎనర్జీ చూపించాడు. క్లాసికల్ డ్యాన్సర్‌గా కమల్ కామరాజు కనిపించిన విధానం బాగుంది. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం.. తెరపై తొలి పాటలో కనిపిస్తుంది. కథను ఏ రూపంలో చెప్పినా.. దాన్ని భావోద్వేగభరితంగా ఆవిష్కరించగలిగినప్పుడే ప్రేక్షకులకు చేరువవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు గ్రహించలేకపోయాడనిపిస్తుంది. తన ఆలోచనకు తగ్గ ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకున్నా.. దాన్ని ఆకర్షణయంగా తీర్చిదిద్దుకోవడంలో తడబడ్డాడు. శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలు.. వాటిని సంధ్యారాజు ఆకట్టుకునేలా ఆవిష్కరించిన విధానం బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే సినిమా మరింత మెరుగై ఉండేది. రేవంత్ ఛాయాగ్రహణం ఆకట్టుకునేలా ఉంది. భానుప్రియ, ఆదిత్య మేనన్, శుభలేఖ సుధాకర్ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. అయితే ఇలాంటి కళాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేర ఆదరిస్తారనేది చూడాలి.
బలాలు
+ కథా నేపథ్యం
+ సంధ్యా రాజు, రోహిత్ అభినయం
+ ప్రారంభ, విరామ సన్నివేశాలు
బలహీనతలు
- స్క్రీన్ ప్లే
- సాగదీత సన్నివేశాలు
- ద్వితీయార్ధం
చివరిగా: అక్కడక్కడా మెప్పించే 'నాట్యం'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మ త్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">