సాహో.. నుంచి వార్త ఏమైనా వస్తుందా అని మొన్నటివరకు సగటు అభిమాని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు. టీజర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ ఈ అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి. సినిమా విడుదలకు నెల ఉందనగానే ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రమోషన్లలో పాల్గొని... ఇంటర్వ్యూలతో సాహోపైనే అందరి కళ్లు ఉండేలా చేశాడు. టిక్కెట్లు కోసం అంతర్జాలంలో యుద్ధమే చేశాడు సగటు సినీప్రియుడు. చివరికి బొమ్మ థియేటర్లలోకి వచ్చింది. వాటిలోని కొన్ని విశేషాలివిగో..!
వాజీతో కథ మొదలు...
ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్ ఉండే వాజీ సిటీలో 'సాహో' కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్ (టిను ఆనంద్) తన రౌడీ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్ చేరదీసిన రాయ్ (జాకీ ష్రాఫ్)… రాయ్ గ్రూప్ పేరుతో క్రైమ్ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. ఫలితంగా రాయ్ మీద దేవరాజ్ పగ పెంచుకుంటాడు.
ఓసారి రాయ్ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్ పేలిపోతుంది. రాయ్ కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.2 లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు.
అదే సమయంలో ముంబయిలో రూ. రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్ కవర్ కాప్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్ (శ్రద్ధ కపూర్)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్ రూ. రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్ చక్రవర్తి - మీరా నాయర్ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ.
యాక్షన్ అదిరిందా...!
గ్యాంగ్‌స్టర్స్ సినిమాలకు ప్రాణం యాక్షన్ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్ గ్యాంగ్‌స్టర్స్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, గన్, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం ఆ ఫీల్ కనిపిస్తుంది. మొదట్లోనే గ్యాంగస్టర్ లీడర్ రాయ్ చనిపోవడం నుంచి ఈ సినిమా అండర్ వరల్డ్ వారసత్వం మొదలవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పోటాపోటీ సీన్లు, డైలాగ్‌తో సినిమా వేడెక్కుతుంది. వాజీలో డాన్ వారసుడిగా విశ్వక్ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగగానే సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి నీల్ నితిన్ ముఖేశ్ ఇచ్చే కౌంటర్లు ఆసక్తికరంగా ఉంటాయి.
- భారీగా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు అదుర్స్ అనిపించారు.
- ఎడారిలో భారీకాయులతో ప్రభాస్ చేసిన ఫైట్ సినిమా అదనపు ఆకర్షణ.
- ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్ ఫైట్లు బాగుంటాయి.
- శ్రీలంక అందం జాక్వెలైన్ ఫెర్నాండేజ్ 'బ్యాడ్ బాయ్...' పాట కుర్రకారుకి కిక్ ఇస్తుంది.
- సినిమా హాలీవుడ్ స్టైల్‌లో ఉన్నా మన నేటివిటీ తగ్గకుండా దర్శకుడు సుజిత్ జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లిష్ స్టైల్‌కి తెలుగు నేటివిటీని జోడించి తీర్చిదిద్దాడు.
- హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, సగటు అమ్మాయిగా శ్రద్ధ కపూర్ ఆలోచనలు, ఆఖరులో చూపించిన దాతృత్వానికి సంబంధించిన అంశాలు ఇలా అన్నీ మన స్టైలే.
- తెర మొత్తం బాలీవుడ్ విలన్లు, ఇంగ్లిష్ రౌడీలతో నిండిపోవడంతో అప్పుడప్పుడు ఇది డబ్బింగ్ సినిమా ఏమో అనిపిస్తుంటుంది.
- దేవరాజ్ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడం లోటు.
ఎవరెలా చేశారంటే...?
- అండర్ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు ప్రభాస్. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో 'మిర్చి' రోజులను గుర్తు చేశాడు.
- పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది.
- గ్యాంగ్‌స్టర్ నాయకుడిగా చుంకీపాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్ లుక్‌లో తన మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు.
- మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్, టిను ఆనంద్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేశ్, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సాంకేతికంగా సూపర్...!
- సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది స్టంట్ మాస్టర్ల గురించి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కెన్నీ బట్స్, రామ్ లక్ష్మణ్ సినిమా చక్కటి ఫైట్లు ఇచ్చారు. భారీ యాక్షన్ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్ స్టైల్ ఫైట్లతో నింపేశారు.
- జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు అదనపు బలం. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. వాళ్లు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా సినిమాటోగ్రాఫర్ మది చాలా కష్టపడ్డారు.
- డాన్ సిటీ, ముంబయి అందాలు, ఫైట్లు చక్కగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు.
సుజీత్ యాక్షన్ సన్నివేశాల రూపకల్పన మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద పెట్టినట్లుగా లేదు. డైలాగ్స్ కూడా అంతగా పేలలేదు.
బలాలు
- ప్రభాస్
- యాక్షన్ సన్నివేశాలు
- నిర్మాణ విలువలు
బలహీనతలు
- వినోదం
- పాటలు
- స్క్రీన్ ప్లే
తారాగణం: ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవ్లీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
సంగీతం: తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్ (నేపథ్యం)
కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాణం: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్;
కథ, దర్శకత్వం: సుజీత్; విడుదల తేదీ: 30-08-2019
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!