చిత్రం: రాజరాజచోర
నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ , సునయన, రవిబాబు తదితరులు
రచన-దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాణం: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
![raja raja chora movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815645_raja.jpg)
వైవిధ్యమైన కథలతో పరిమిత బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే కథానాయకుడు శ్రీవిష్ణు. అప్పుడప్పుడు పరాజయాలు పలకరించినా ఏ మాత్రం కుంగిపోకుండా మరో సినిమా తీస్తుంటారు. అలాంటి ఓ సినిమానే 'రాజ రాజ చోర'. యువ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో గురువారం(ఆగస్టు 19) విడుదలైన ఈ చోరుడు.. ప్రేక్షకులను మెప్పించాడా లేదా ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
ఇదీ కథ: భాస్కర్(శ్రీవిష్ణు) ఓ స్టేషనరీ దుకాణంలో ఉద్యోగి. సాప్ట్వేర్ ఉద్యోగి అని నమ్మించి సంజన(మేఘా ఆకాశ్ ) అనే అమ్మాయితో సహజీవనం చేస్తుంటాడు. కానీ భాస్కర్‌కు అప్పటికే విద్య(సునైన)తో పెళ్లై ఓ పిల్లాడు ఉంటాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి సంజనతో ప్రేమాయణం సాగిస్తుంటాడు. ఇంట్లో భార్య చదువు కోసం, ప్రియురాలి అవసరాల కోసం పగలు షాపులో పనిచేస్తూ రాత్రిళ్లు ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడు.
![raja raja chora movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815645_raja-raja-chora-3.jpg)
భాస్కర్ ఉండే ఏరియాలోనే విలియమ్ రెడ్డి(రవిబాబు) ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటాడు. ఓ రోజు దొంగతనం చేస్తూ భాస్కర్ విలియమ్ రెడ్డికి పట్టుబడతాడు. ఆ తర్వాత భాస్కర్ పరిస్థితి ఏంటి? అతను దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది ? విద్య విషయం సంజనకు తెలిసిందా? అంజమ్మకు(గంగవ్వ) భాస్కర్‌కు సంబంధం ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
అవసరానికో, అత్యాశకో తప్పులు చేయడం చివరకు పశ్చాతపపడటం సగటు మనిషి నైజం. అలాంటి ఓ మనిషి కథే రాజ రాజ చోర. దొంగ వాల్మీకి ఎలా అయ్యాడో.. అలా ఓ దొంగ తన జీవితంలో ఎదురైన అనుభవాలతో ఎలా పరివర్తన చెందాడో ఈ చిత్రం అద్దం పడుతుంది. మనసు ఒకటి చెబుతున్నా... డబ్బు కోసం మరొకటి చేయడం కూడా తప్పే అనే సందేశాన్ని సునిశితమైన హాస్యం, భావోద్వేగాలను మేళవించి దర్శకుడు హసిత్ గోలీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పాత్రల పరిచయానికి బాగా సమయం తీసుకున్నారు దర్శకుడు. భాస్కర్ జీవితంలో విద్య ఉందని తెలిసిన తర్వాత, వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలతో కథలో వేగం పెరుగుతుంది. ప్రథమార్థంలో శ్రీవిష్ణు దొంగతనాలు, పట్టుబడటం, ప్రియురాలితో ప్రేమాయణంతో సాగుతుంటాయి. భాస్కర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదనే విషయం తెలిసినప్పుడూ.. రాజు దొంగగా శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు, గంగవ్వతో కబుర్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ మలుపులు కథను కూడా మరింతగా రక్తికట్టిస్తాయి. విలాపం, విఘాతంతో నడిచే ప్రథమార్థంలోని విరామ మలుపులు ద్వితీయార్థం కోసం ఆసక్తిగా ఎదురు చూసేందుకు కారణమవుతాయి. కానీ ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు నెమ్మదించడం మళ్లీ ప్రేక్షకుడు కథలో లీనమవడానికి సమయం పడుతుంది. తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథను నడిపించిన విధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్ర వెనక రెండో కోణాన్ని ఆవిష్కరించిన తీరు, పతాక సన్నివేశాల్లో అజయ్ ఘోష్ చెప్పే సంభాషణలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి.
![raja raja chora movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815645_raja-raja-chora-1.jpg)
ఎవరెలా చేశారంటే :
శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకుంటారు. దొంగగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో కనిపించిన తీరు, హాస్యం.. భావోద్వేగాల్ని పండించిన విధానం చిత్రానికి ప్రధాన బలం. మేఘ ఆకాశ్, సునైన పాత్రలు కథలో కీలకంగా నిలిచాయి. మేఘ అందంగా కనిపించమే కాదు, ఆమె అభినయం కూడా ఆకట్టుకుంటుంది. గృహిణి పాత్రలో సునైన, పోలీసు అధికారిగా రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. బలం ఉంటే.. చిన్న పాత్రలైనా బాగా పండుతాయనడానికి ఈ సినిమా ఓ నిదర్శనం. గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు పోషించిన చిన్న పాత్రలు, వాళ్ల నటన కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ పాటలు, నేపథ్య సంగీతం కథకు ప్రాణం పోసింది. వేదారామన్ కెమెరా పనితనం, విప్లవ్ కూర్పుతో పాటు ఇతర విభాగాలు కూడా చక్కటి పనితీరు కనబరిచాయి. దర్శకుడిగా కంటే కూడా హసిత్ గోలి తన రచనతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. నిజాన్ని ఎన్ని నకళ్లు తీసినా నిజమనేది ఎప్పటికైనా నిజమనే లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
![raja raja chora movie telugu review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815645_raja-raja-chora-5.jpg)
బలం: కథ, కథనం, శ్రీవిష్ణు నటన, హాస్యం, మాటలు
బలహీనత: అక్కడక్కడ నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరగా: ఈ రాజుదొంగ భలే చమత్కారి. నూరుశాతం వినోదం గ్యారంటీ.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!