చిత్రం: జాంబీరెడ్డి
నటీనటులు: తేజ సజ్జా, ఆనంది, దక్ష నగార్కర్, హర్షవర్ధన్, రఘుబాబు, హరితేజ, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్, రఘు కారు మంచి తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: అనిత్
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్ విల్లే
ఎడిటింగ్: సాయిబాబు
ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగల
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
సంస్థ: యాపిల్ ట్రీ స్టూడియోస్
విడుదల తేదీ: 05-02-2021
హాలీవుడ్‌లో జాంబీ జానర్ సినిమాలు విరివిగా తెరకెక్కుతుంటాయి. తెలుగుకి మాత్రం కొత్త. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ సాగే ఈ కథల్లో కావల్సినంత థ్రిల్ ఉంటుంది. అందుకే ఆ జానర్ విజయవంతమైంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగుకీ ఈ నేపథ్యాన్ని చేరువ చేసేలా 'జాంబీరెడ్డి' తెరకెక్కించారు. బాలనటుడిగా 'ఇంద్ర'లో తొడగొట్టి గుర్తింపు పొందిన తేజ సజ్జా ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. 'అ','‘కల్కి' చిత్రాలతో విజయాల్ని అందుకున్న ప్రశాంత్ వర్మ మూడో ప్రయత్నంగా చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? జాంబీలు థ్రిల్‌ని పంచాయా? వంటి తదితర అంశాలను ఈటీవీ భారత్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. తాను చేసిన ఓ గేమ్ ఇంటర్నెట్‌లో సంచలనం అవుతుంది. మిలియన్ల కొద్దీ డౌన్‌లోడ్స్ వస్తాయి. అదే సమయంలో ఆ గేమ్‌లో ఓ సమస్య తలెత్తుతుంది. అప్పటిదాకా ట్రెండింగ్‌లో ఉన్న గేమ్ వెనక్కి పడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గేమ్‌కి ఎదురవుతున్న సమస్య తొలగించాలంటే మారియో స్నేహితుడైన కల్యాణ్ (హేమంత్ ) అవసరం ఏర్పడుతుంది. అతనేమో తన పెళ్లి కోసమని కర్నూలు జిల్లా రుద్రవరంలో ఉంటాడు. దాంతో మారియో తన స్నేహితులతో కలిసి రుద్రవరం బయల్దేరతాడు. ఈ మార్గమధ్యంలో ఊహించని ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. మారియో స్నేహితుల్లో ఒకరు మనుషుల్ని కొరికేసి, వారి మాంసాన్ని తినేసే జాంబీలా మారతాడు. అదెలా జరిగింది? ఈ స్నేహితులంతా రుద్రవరం వెళ్లాక ఏం జరిగింది? కరోనా వ్యాక్సిన్‌కీ, ఈ బృందానికీ సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉందంటే?
తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించే కథ ఇది. జాంబీ జోనర్ గురించి తెలిసిన, ఆ సినిమాల్ని చూసిన ప్రేక్షకులకు కూడా కొత్తదనాన్ని పంచేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మనదైన ఫ్యాక్షన్ కథలోకి జాంబీల్ని తీసుకొచ్చి కథని మలిచిన తీరు మెప్పిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అంటూ కథని ఆరంభించడం వల్ల ప్రేక్షకుడు తొందరగానే కనెక్ట్ అవుతాడు. అయితే ఆ తర్వాత కథలోకి వెళ్లడానికి మాత్రం బాగా సమయం తీసుకున్నాడు. మారియో స్నేహితుడు జాంబీగా మారడం నుంచే అసలు కథ మొదలవుతుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి.
ద్వితీయార్ధం సినిమాకి ప్రధానబలం. కామెడీ, సెంటిమెంట్, థ్రిల్ తదితర భావోద్వేగాలన్నీ చక్కగా పండాయి. దర్శకుడు కథపై ఆద్యంతం పట్టుని ప్రదర్శించాడు. గెటప్ శ్రీను-అన్నపూర్ణమ్మ, హేమంత్ పెళ్లి నేపథ్యంలోనూ కామెడీ బాగా పండింది. కథానాయకుడు, అతని స్నేహితులు గేమ్ డిజైనర్స్ కావడం వల్ల ఆ పాత్రల తాలూకు ప్రభావం కూడా కథపై ప్రతిబింబించేలా ఆట తరహాలోనే కొన్ని సన్నివేశాల్ని మలిచిన తీరు మెచ్చుకోదగ్గది. జాంబీలతో నాయకానాయికలు చేసే పోరాట ఘట్టాలే కాస్త శ్రుతిమించినట్టు అనిపిస్తాయి. కథని ముగించిన విధానంలో కూడా లాజిక్ లేదు. కథలో ఊహించని మలుపులున్నా, జాంబీలు థ్రిల్‌ని పంచినా కథ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగడం సినిమాకి మైనస్.
ఎవరెలా చేశారంటే?
తేజ సజ్జా ఓ విభిన్నమైన కథతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. డ్యాన్స్ తప్ప అతనిలోని అన్ని యాంగిల్స్‌ని తెరపై ఆవిష్కరించిందీ చిత్రం. తేజని తను చిన్నప్పుడు చేసిన పాత్రల కోణంలోనే చూస్తారని ఊహించిన దర్శకుడు హీరోయిజాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. అడుగడుగునా అగ్ర కథానాయకుల్ని గుర్తు చేస్తూ, వారి అభిమానుల్ని అలరిస్తూనే తేజని కూడా గంభీరంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆనంది, దక్ష నగార్కర్ పాత్రలు కూడా మెప్పిస్తాయి. గెటప్ శ్రీను, పృథ్వీ, అన్నపూర్ణమ్మ, హేమంత్ నవ్వించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం థ్రిల్‌ని పంచడంలో కీలక పాత్ర పోషించింది. అనిత్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. జాంబీల్ని, కర్నూలు నేపథ్యాన్ని తెరపై చూపించిన విధానం మెప్పిస్తుంది. నాగేంద్ర కళా ప్రతిభ కూడా అడుగడుగునా కనిపిస్తుంది. మేకప్ విభాగం కూడా ఈ సినిమాకి కీలకంగా పనిచేసింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి ఓ కొత్త కథని తెలుగు తెరపైకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
కథ
నటీనటులు
ద్వితీయార్ధంలో కామెడీ
బలహీనతలు
కథనం
చివరిగా: తెలుగు తెరకు కొత్తదనాన్ని పంచే 'జాంబీరెడ్డి'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!