- చిత్రం: పలాస 1978
- నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శ్రుతి, జగదీష్ తదితరులు
- సంగీతం: రఘు కుంచె
- సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ
- నిర్మాత: ధ్యాన్ అట్లూరి
- రచన-దర్శకత్వం: కరుణ కుమార్
- సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 06-03-2020
విడుదలకు ముందే ఎంతో మంది సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్న చిత్రం 'పలాస 1978'. రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. ఉత్తరాంధ్రలో ఓ ఊరి కథ అంటూ విడుదలైన ఈ సినిమా కథేంటీ, అంతగా ప్రముఖుల్ని ఆకట్టుకున్న పలాసలో ఏముందో ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇదీ కథ
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని అంబుసోలి గ్రామంలో పద్యాల సుందర్రావుకు రంగారావు(తిరువీర్), మోహన్‌రావు(రక్షిత్) ఇద్దరు కుమారులు. కుటుంబమంతా జానపద పాటలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అలరిస్తూ జీవిస్తుంటారు. పలాసలో పెద్దషావుకారు(జనార్దన్), చిన్నషావుకారు(రఘు కుంచె) అన్నదమ్ములు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలోనే ఓ రోజు పెద్దషావుకారు కొడుకు తారకేశు.. సినిమా థియేటర్ వద్ద రంగారావు చేసుకోబేయే అమ్మాయి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అది సహించలేని అన్నదమ్ములిద్దరూ ఓ రోజు రాత్రి మాటువేసి తారకేశును చితకొడుతారు. ఈ గొడవలో తారకేశు కొద్దిరోజులు మంచానికే పరిమితమవుతాడు. కళ్లముందే కొడుకు మంచానికి పరిమితమవడం తట్టుకోలేని పెద్దషావుకారు.. పలాస రౌడీ బైరాగితో అన్నదమ్ములిద్దరిని చంపమని పురమాయిస్తాడు. ఆ ప్రయత్నంలో రంగారావు, మోహన్ రావు... బైరాగిని చంపేసి పెద్దషావుకారుకు ఎదురుతిరుగుతారు.
అన్నను ఎదిరిరించిన రంగా, మోహన్‌లను చిన్నషావుకారు తన దగ్గర చేర్చుకుంటాడు. రాజకీయంగా లబ్ధి పొందుతాడు. అప్పుడే పలాసకు ఎన్నికలొస్తాయి. ఎన్నాళ్లీ బతుకులు. తమ కులం వాళ్లూ రాజకీయంగా ఎదగాలని భావిస్తాడు రంగారావు. పలాస టికెట్ ఆశిస్తాడు. అందుకు చిన్నషావుకారు ఒప్పుకోడు. ఘోరంగా అవమానించి పంపిస్తాడు. ఇంతలోనే పెద్దషావుకారు భార్య మరిదిని వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును మంచాన పడేసిన వాళ్లను వదిలిపెట్టొద్దని ప్రాధేయపడుతుంది. వదిన మాటలకు చలించిపోయిన చిన్నషావుకారు... అన్నదమ్ములిద్దరిని ఒకేసారి చంపేందుకు కుట్రపన్నుతాడు. కిరాయిగుండాలతో రంగారావును అత్యంత కిరాతకంగా చంపిస్తాడు. కళ్లముందే అన్న చనిపోవడం తట్టుకోలేని మోహన్‌రావు... పెద్దషావుకారు, చిన్నషావుకారులను చంపాలనుకుంటాడు.
ఓ రోజు మార్కెట్ లో పెద్దషావుకారును మట్టుబెడతాడు. ఆ వార్త విన్న చిన్నషావుకారు రహస్యంగా జీవిస్తూ బైరాగి కొడుకు(మాజీ నక్సలైట్)తో మోహన్‌రావును చంపాలని ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్‌లో మోహన్‌రావు భార్య లక్ష్మి(నక్షత్ర) చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోదరుడు, భార్యను హత్య చేయించిన చిన్నషావుకారును మోహన్‌రావు ఏం చేశాడు? షావుకార్ల రాజకీయ కుట్రకు బలైన మోహన్‌రావు చివరకు ఏమయ్యాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ కథ ఉత్తరాంధ్రలో జరిగిన ఓ ఊరి కథ. 1978లో జరిగిన కథ. ఇప్పటి జనాలకు ఎవరికి తెలియని కథగా పలాసను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు కరుణకుమార్. రచయితగా తన అనుభవాన్నంతా రంగరించి ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన వాస్తవిక సంఘటలను కథావస్తువుగా అల్లుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా ప్రతి పాత్రను, ప్రతి సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లాడు. పలాసలో జానపద కళాకారుల పరిస్థితి, అణగారిన వర్గాలపై షావుకార్ల పెత్తందారి వ్యవస్థను చూపిస్తూ వారిపై రంగా, మోహన్ ల తిరుగుబాటు ఎలా మొదలైందో ఇందులో వివరించారు. రాజకీయ కుట్రలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు, కుటుంబ కలహాలు, భావోద్వేగాలతో నడిపించి కథలో ప్రేక్షకుడ్ని లీనం చేశాడు.
రాజకీయ చదరంగంలో అణగారిన వర్గాల ప్రజలు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో చెబుతూ పలాస కథను ముగించాడు. కథ పరంగా పలాస రంగస్థలం, అసురన్ చిత్రాలను గుర్తుచేసినా దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని తీర్చిదిద్ది కొత్తదనాన్ని చూపించాడు. రంగా, మోహన్ రావులతోపాటు పెద్దషావుకారు, చిన్నషావుకారు పాత్రలు పలాస కథకు ప్రాణం పోశాయి.
ఎవరెలా చేశారంటే?
ఈ కథను భుజానికెత్తుకుంది నలుగురు. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. దర్శకుడు ఎలాంటి కథ రాసుకున్నా అందుకు తగిన నటీనటులు దొరకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ పలాస కథకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. రంగారావుగా తిరువీర్, మోహన్ రావుగా రక్షిత్, పెద్దషావుకారు, చిన్నషావుకారుగా రఘు కుంచె తమదైన నటనతో పలాసను ఆద్యంతం రక్తికట్టించారు.
పలాసకు రఘు కుంచె సంగీత దర్శకుడి ప్రాణం పెట్టి పనిచేశారని నేపథ్య సంగీతాన్ని వింటే అర్థమవుతుంది. అలాగే టాలీవుడ్‌కు మరో కొత్త విలన్ దొరికాడనేలా చేశారు. కథానాయిక నక్షత్ర తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో చేసిన నటీనటులంతా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా కరుణకుమార్ పలాస మొదటి చిత్రంతో శభాష్ అనిపించుకున్నాడు.
విడుదలకు ముందే ప్రముఖులు, మేథావులు, సినీ విశ్లేషకుల ప్రశంసలందుకున్న కరుణకుమార్.. పలాసను జాతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో నిలబెట్టాడు. మాటల్లో తన కలం బలమేంటో చూపించాడు. ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీసి, పలాసను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి చిత్రంగా తీర్చిదిద్దాడు.
బలం
- కథ
- మాటలు
- నటీనటులు
బలహీనత
- పాటలు
- పతాక సన్నివేశాలు
చివరగా: పలాస... అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది కేవలం అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">