చిత్రం: నిశ్శబ్దం
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, మైకేల్ మాడిసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల: అమెజాన్ ప్రైమ్
మహిళా ప్రాధాన్యం ఉన్న కథలంటే ప్రస్తుతం దర్శక, నిర్మాతలకు గుర్తొచ్చే పేరు అనుష్క. ఆమె కథానాయికగా నటిస్తోందంటే తప్పకుండా ఆ సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. అలా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కీలక పాత్రలో నటించిన చిత్రమే 'నిశ్శబ్దం'. పైగా అనుష్క దివ్యాంగురాలి(మూగ/చెవిటి)గా నటించడం వల్ల సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. వేసవి కానుకగా థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. మరి 'నిశ్శబ్దం' ఎలా ఉంది? ఆమె కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రమైందా? మాధవన్, అంజలి, షాలినీ పాండేలతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ పాత్రలేంటి?
కథేంటంటే?
అమెరికాలోని సియాటెల్‌కు 70 కి.మీ దూరంలో ఉన్న వుడ్‌సైడ్ విల్లాలో ఓ జంట హత్యకు గురవుతుంది. ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోతారు. ఆ ఇంటి యజమాని ఆత్మ వారిని చంపేసిందంటూ ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ విల్లాను ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారు. అయితే, 2019లో ఆ విల్లాను కొలంబియన్ బిజినెస్‌మెన్ కొనుగోలు చేస్తాడు. సాక్షి(అనుష్క) అనాథ. అద్భుతంగా పెయింటింగ్‌లు వేయగలదు. ఓ ఆర్ట్ గ్యాలరీలో ఆమె గీసిన పెయింటింగ్‌లు చూసి, ప్రఖ్యాత సంగీతకారుడైన ఆంటోనీ(మాధవన్) ముచ్చటపడతాడు. అప్పుడు మొదలైన సాక్షి, ఆంటోనీల పరిచయం ప్రేమగా మారుతుంది. వుడ్‌సైడ్ విల్లాలో ఉన్న ఓ అరుదైన పెయింటింగ్‌ను గీయడానికి సాక్షి, ఆంటోని కలిసి వెళ్తారు. కొద్దిసేపటికే ఆంటోని హత్యకు గురవుతాడు? సాక్షి మాత్రం ప్రాణాలతో బయపడుతుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? పోలీస్ ఆఫీసర్ అయిన రిచర్డ్(మైకేల్ మాడిసన్), క్రైమ్ డిటెక్టివ్ మహాలక్ష్మి(అంజలి)తో కలిసి ఎలా చేధించారు. ఈ హత్యకూ సోనాలి(షాలినీ పాండే), వివేక్(సుబ్బరాజు)లకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ కథలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఒక హత్య, లేదా వరుస హత్యలు జరగడం, ఆ హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు కథానాయకుడు/నాయిక రంగంలోకి దిగడం ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. అనుష్క కీలక పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' కూడా ఆ కోవకు చెందిందే. అయితే, ఆ హత్యలను ఛేదించే క్రమాన్ని ఎంత ఉత్కంఠగా, ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టేలా తీర్చిదిద్దాడన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు హేమంత్ మధుకర్ విజయం సాధించాడు. కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆంటోని హత్యతో చిక్కుముడి వేసేశాడు దర్శకుడు. ఇక చేయాల్సిందల్లా ఆ కేసును ఛేదించడమే. ఇందులో భాగంగానే రిచర్డ్, మహా పాత్రలు రంగంలోకి దిగి విచారణ మొదలుపెడతాయి. సాక్షిని విచారించే పేరుతో నడిచే ఆయా సన్నివేశాలన్నీ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. అయితే, కథ ముందుకు వెళ్లే కొద్దీ నెమ్మదిగా ఉత్కంఠ పెరుగుతుంది. అన్ని పాత్రలపైనా అనుమానం కలిగించే ప్రయత్నమూ చేశాడు దర్శకుడు.
అప్పటివరకూ ఆ హత్యను ఎవరెవరు చేసి ఉంటారని ఊహిస్తున్న ప్రేక్షకుడు.. విరామ సమయానికొచ్చే సరికి ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతాడు. అయితే, ఆ వ్యక్తి ఆంటోనిని ఎందుకు హత్య చేశాడన్న కోణంతో కథ మలుపు తిరుగుతుంది. డిటెక్టివ్ మహాలక్ష్మి పాత్ర కూడా హత్య కేసును ఛేదించడానికి అతడిని అనుసరిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఆ కోణం విచారణ మొదలు పెట్టిన తర్వాత మళ్లీ సోనాలి ఫ్లాష్‌బ్యాక్ తెరపైకి వస్తుంది. సోనాలి కేరక్టరైజేషన్ గురించి వచ్చే సన్నివేశాలు మళ్లీ సాగదీతగా అనిపిస్తాయి. అయితే, కొద్దిసేపటికే క్లైమాక్స్‌కు వచ్చేశాడు దర్శకుడు. సోనాలితో సహా సియాటెల్‌లో ఉన్న పలువురు అమ్మాయిలు హత్యకు గురి కావడం వెనుక కారణం తెలిసిన తర్వాత తప్పకుండా 2004లో యువతను విశేషంగా అలరించిన ఓ డబ్బింగ్ సినిమా గుర్తుకు వస్తుంది. 'ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో క్రైమ్ ఉంటుంది. కొన్ని బయటపడుతుంటాయి. కొన్ని కాలం లోతుల్లోకి జారిపోతుంటాయి. కానీ, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ నేరస్థులు కాదు' అంటూ సినిమా ప్రారంభంలో అంజలి వాయిస్‌తో అసలు కథేంటో చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే:
నిశ్శబ్దం'లో అనుష్క నటిస్తుందనగానే ఈ సినిమా క్రేజీ ప్రాజెక్టు అయింది. దివ్యాంగురాలి పాత్రలో అనుష్క నటన మెప్పిస్తుంది. సైగలు, హావభావాలు పలికించడంలో ఆమె తీసుకున్న శిక్షణ తెరపైన కనపడుతుంది. సంగీత కళాకారుడు ఆంటోనిగా మాధవన్ చక్కగా నటించారు. అదే సమయంలో ఆయనలోని వైవిధ్య నటనను కూడా తెరపై చూపించారు. ద్వితీయార్ధంలో ఆయన వైవిధ్య నటన మెప్పిస్తుంది. తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడికి డబ్బింగ్ చెప్పే వ్యక్తితో మాధవన్‌కు డబ్బింగ్ చెప్పించారు. ఆ వాయిస్ మాధవన్ గొంతు నుంచి వినడం తొలుత కాస్త కొత్తగా అనిపించినా, ఆ పాత్రకు ఆ వాయిస్ సరైనదేనని క్లైమాక్స్‌కు వచ్చేసరికి అర్థమవుతుంది. కేసు ఛేదించే డిటెక్టివ్‌గా అంజలి నటన పర్వాలేదు. రిచర్డ్ పాత్రలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్‌ను తీసుకోవడం సినిమాకు అదనపు ఆకర్షణే తప్ప ఆ పాత్ర వల్ల అదనపు ప్రయోజనం అయితే లేదు. సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీని అవసరాల తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
గోపీ సుందర్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'నిన్నే నిన్నే' యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. గిరీష్ నేపథ్య సంగీతం బాగుంది. షెనెల్ డియో సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. క్రైమ్ థ్రిల్లర్‌ను మరింత ఉత్కంఠగా చూపించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమా నిడివి 2 గంటలు మాత్రమే. దర్శకుడు హేమంత్ మధుకర్ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల ప్రేక్షకుడు కాస్త అసహనానికి గురవుతాడు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలంటే కథనం ఉత్కంఠతో ఊపేయాలి. అలాంటిదేమీ కనిపించదు. విచారణ పేరుతో ప్రథమార్ధంలో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
- అనుష్క, మాధవన్‌ల నటన
- ద్వితీయార్ధం
- సాంకేతిక విభాగం పనితీరు
బలహీనతలు
- ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
- నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడేవారు 'నిశ్శబ్దం'గా చూస్తారు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">