చిత్రం: జగమే తంత్రం;
నటీనటులు: ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జోజి జార్జ్ తదితరులు;
సంగీతం: సంతోష్ నారాయణ్;
సినిమాటోగ్రఫీ: శ్రేయస్ కృష్ణ;
ఎడిటింగ్: వివేక్ హర్షన్;
దర్శకుడు: కార్తిక్ సుబ్బరాజ్;
నిర్మాణం: వై నాట్ స్టూడియోస్;
విడుదల: నెట్‌ఫ్లిక్స్(18-06-2021)
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ధనుష్ చిత్రం 'జగమే తంత్రం'. గతేడాది వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అన్ని అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు డిజిటల్ వేదికగా అభిమానుల ముందుకొచ్చింది. ధనుష్, కార్తిక్‌సుబ్బరాజుల కలయికలో వస్తున్న చిత్రం కావడం, మరోసారి ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండటం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. పాటలు, ట్రైలర్‌లతో సినిమాపై విడుదలకు ముందే భారీ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? గ్యాంగ్‌స్టర్ ధనుష్ ఏ మేరకు మెప్పించారు?
కథేంటంటే?
లండన్ దాదాగా బ్రిటన్‌ను శాసిస్తుంటాడు పీటర్(జేమ్స్ కాస్మో). అలాంటి పీటర్‌ను ముప్పుతిప్పలు పెడుతుంటాడు తమిళ గ్యాంగ్‌స్టర్ శివదాస్(జోజి జార్జ్). అడ్డొచ్చినందుకు తన మనిషిని చంపడం వల్ల శివదాస్ మీద కక్ష పెంచుకుంటాడు పీటర్. ఆ తమిళడాన్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మధురైలో వీధిరౌడీగా చలామణి అవుతున్న సురులి(ధనుష్)ని లండన్‌కు పిలిపించుకుంటాడు. మధురై నుంచి ఇక్కడికొచ్చిన సురులి మెల్లమెల్లగా శివదాస్ గ్యాంగ్‌ను బలహీనపరుస్తాడు. శివదాస్ మారణాయుధాల వ్యాపారం మీద దెబ్బకొడతాడు. ఆ తర్వాత శివదాసు పంచన చేరి అతడికే వెన్నుపోటు పొడుస్తాడు. పీటర్ చేతిలో శివదాస్ హతమయ్యేందుకు కారణమవుతాడు.
ఈ మధ్యలోనే సురులి లండన్‌లోనే ఓ తమిళ గాయనితో ప్రేమలో పడతాడు. ఓ రోజు వీరిద్దరూ బయటకు వెళ్లినప్పుడు వీరిపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఆ దాడి నుంచి తప్పించుకున్న సురులికి అసలు నిజం తెలుస్తుంది. అసలు శివదాస్ ఎవరు? అతని వెనుకున్న కథేంటి? ఇదంతా తెలుసుకున్నాక సురులి ఏం చేశాడు? అనేది తెలియాలంటే 'జగమే తంత్రం' చూడాలి.
ఎలా ఉందంటే?
తమిళ శరణార్థుల కన్నీటి గాథలతో చాలా సినిమాలే తెరకెక్కాయి. మణిరత్నం 'అమృత' నుంచి తాజాగా విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్2' వరకూ చాలానే వచ్చాయి. అయితే శరణార్థుల కథకు గ్యాంగ్‌స్టర్ కోణాన్ని కలిపి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్.
ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలన్నీ తమిళనాడు లేదా శ్రీలంకలోని తమిళ శరణార్థుల మీద తీసినవే. ఇది లండన్‌కు వలస వెళ్లిన తమిళులపై తెరకెక్కింది. అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి? జాతివివక్ష ఏ మేరకు ఉంటుంది? అనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. లండన్‌లోని తమిళ గ్యాంగ్‌స్టర్లుగా జోజీ, ధనుష్‌ల నటన కట్టిపడేస్తుంది. అయితే శివదాసు రహస్యాలను అంత సులువుగా తెలుసుకున్న సురులికి అతడి వెనుకున్న అసలు కథ తెలియకపోవడమే కొంత సినిమాటిక్‌గా అనిపిస్తుంది. రెండు ముఠాల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు చూసేందుకు బాగుంటాయి.
సినిమాను పూర్తిగా గ్యాంగ్‌స్టర్ సినిమాగా మలిచే క్రమంలో కథలోని అసలు ఆత్మ పక్కదారి పట్టిందేమో అనిపిస్తుంది. లండన్‌లోని జాతి వివక్షను, మనదేశంలో కుల పిచ్చిని ముడిపెట్టి చెప్పడం బాగుంటుంది. అయితే శరణార్థుల కష్టాలు, జాత్యహంకారం లాంటి వాటిని ఇంకా ప్రభావవంతంగా చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సురులి లండన్ రావటం, డాన్‌గా మారడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది. ఈ సన్నివేశాలన్నీ సాదాసీదాగానే ఉంటాయి. ఎప్పుడైతే శివదాస్ హత్య జరిగిందో అక్కడి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటి వరకూ డాన్‌గా తన స్వార్థం కోసం పని చేసిన సురులి తమిళ శరణార్థుల కష్టాలు తెలుసుకున్న తర్వాత వాళ్ల తరపున నిలబడి పోరాటం మొదలు పెడతాడు. అయితే, ఆ సన్నివేశాల్లో బలమైన ఎమోషన్స్ లేవు. కేవలం యాక్షన్ సన్నివేశాలకు పరిమితమైనట్లు అనిపిస్తుంది. కేవలం ధనుష్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడి ఊహకు అందేదే.
ఎవరెలా చేశారంటే?
ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా చేయడం ఇది కొత్తేమీ కాదు. 'పుదుపెట్టై', 'మారి', 'వడాచైన్నై' సినిమాలతో లోకల్ డాన్‌గా ఆకట్టుకున్నాడు. 'జగమే తంత్రం'లో ఇంటర్నేషనల్ డాన్‌గా స్టైలిష్‌గా కనిపించారు. ధనుష్ నటనే సినిమాకు ప్రధానబలం. మాఫియా నేపథ్యంతో ఇదివరకు వచ్చిన ధనుష్ చిత్రాలతో పోలిస్తే మాత్రం ఇది తేలిపోతుంది. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కూడా ఓ పాత్రలో మెరవడం విశేషం.
'నాయట్టు', 'జోసెఫ్' లాంటి చిత్రాలతో ఎంతటి సహజ నటుడో నిరూపించుకున్న జోజీ జార్జ్ ఇందులో డాన్‌గా కనిపించడం కొత్తగా ఉంటుంది. అయితే పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల ఆయన్ని సరిగా వినియోగించుకోలేదనే భావన కలుగుతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లైటింగ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫ్రీ. శ్రేయస్ కృష్ణ తన కెమెరా పనితనంతో హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కానీ, గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో బీజీఎం తారస్థాయిలో ఉంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఎంచుకున్న పాయింట్ పాతదే. అయితే, దాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. ఎమోషనల్ సన్నివేశాలను ఇంకా బలంగా చూపించాల్సింది. సినిమాలో చాలా చోట్ల కథనం నెమ్మదిగా సాగడం మరో బలహీనత. కేవలం ధనుష్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని కథా, కథనాలను తీర్చిదిద్దారు.
బలాలు | బలహీనతలు |
+ ధనుష్ నటన | - నెమ్మదిగా సాగే కథనం |
+ కెమెరా పనితనం | - దర్శకత్వం |
+ సంగీతం |
చివరిగా: ధనుష్ అభిమానుల కోసం 'జగమే తంత్రం'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">