సినిమా: ఇద్దరి లోకం ఒకటే
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్, పృథ్వీ, రోహిణి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: శిరీష్(శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.ఆర్.కృష్ణ
విడుదల: 25 డిసెంబరు 2019
రీమేక్ కథతో సినిమా చేయడం సురక్షితమని నమ్ముతుంటుంది చిత్ర పరిశ్రమ. పరాజయాల్లో ఉన్న హీరోలు, దర్శకులైతే మరింతగా ఈ విషయాన్ని విశ్వసిస్తుంటారు. అప్పటికే ప్రేక్షకుల్ని మెప్పించిన కథలు కాబట్టి, మనకూ విజయాన్నే అందిస్తుందని ఓ నమ్మకం. అలా ఈ ఏడాది చాలా రీమేక్ కథలు తెరకెక్కాయి. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. టర్కిష్ చిత్రం 'లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్' ఆధారంగా రూపొందింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పరాజయాల్లో ఉన్న రాజ్‌తరుణ్‌కు విజయాన్నిచ్చినట్టేనా? తదితర విషయాలు తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.
కథేంటంటే:
మహి (రాజ్‌తరుణ్), వర్ష (షాలినీ పాండే) చిన్ననాటి స్నేహితులు. 18 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకుంటారు. చిన్నప్పటి ఓ జ్ఞాపకమే ఆ ఇద్దరినీ కలుపుతుంది. హీరోయిన్ కావాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వర్ష జీవితాన్ని మలుపు తిప్పుతాడు మహి. చిన్నప్పటి స్నేహం, ఆ జ్ఞాపకాలు ఇద్దరినీ మరింత దగ్గర చేస్తాయి. ఒకరితో మరొకరు ప్రేమలో పడేలా చేస్తాయి. ఇంతలో మహి జీవితంలో ఒక పెద్ద అగాథం. అప్పుడు వర్ష ఏం చేసింది? అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వాళ్లిద్దరి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఇందులో కథ కంటే సంఘటనలే కీలకం. వాటి చుట్టూనే కథను అల్లారు. ఒకొక్క సంఘటన ఇద్దరి జీవితాల్ని ఎలా మలుపు తిప్పిందన్నదే ఆసక్తికరం. ప్రేమకథల్లో కొత్తదనాన్ని ఆశించకూడదు. ఆ కథ నుంచి పండే అనుభూతి, ప్రేమజంట మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపిస్తుంటాయి. ఆ విషయంలో ఈ సినిమా కొద్దిమేర ప్రభావం చూపిస్తుందంతే. ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు దర్శకుడు కొన్నిసార్లు మాతృకను మక్కీకి మక్కీ అనుసరించారు. కొన్నిసార్లు మాత్రం మూల కథను మాత్రమే తీసుకొని తమదైన శైలిలో సన్నివేశాల్ని కొత్తగా తీర్చిదిద్దుతుంటారు. దర్శకుడు ఇక్కడ కథ, కథనాల విషయంలో పెద్దగా స్వేచ్ఛ తీసుకోలేదు. హీరో హీరోయిన్ల పాత్రల పరిచయం, వాళ్ల కెరీర్, కుటుంబ నేపథ్యం, చిన్నప్పటి జ్ఞాపకాలు.. ఇలా సన్నివేశాల్ని పేరుస్తూ వచ్చారు.
అసలే కథ లేకపోవడం, కథనం పరంగా చెప్పుకోదగ్గ కసరత్తులు లేకపోవడం వల్ల ప్రథమార్ధం అతి సాధారణంగా సాగుతుంది. తర్వాత ఏం జరగబోతోందో సులభంగా ఊహించేలా సన్నివేశాలు సాగుతుంటాయి. మధ్యలో వచ్చిన పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో కొంచెం పట్టును ప్రదర్శించాడు దర్శకుడు. రాహుల్‌తో పెళ్లి, మహితో ప్రేమ.. ఈ రెండింటి మధ్య సంఘర్షణవైపుగా కథను తీసుకెళ్లాడు. కానీ, ఆ ఘట్టాలు ఎంతసేపో ఉండవు. అంతలోనే కథను ముగింపు దిశగా మళ్లించారు. పతాక సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. అసలే తెలుగు ప్రేక్షకులు విషాదాంతమైన కథల్ని ఇష్టపడరనే మాట తరచూ వినిపిస్తుంటుంది.
ఎవరెలా చేశారంటే:
రాజ్ తరుణ్ - షాలినీ పాండే జోడీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. షాలినీ పాండే తన అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. రాజ్ తరుణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు. తన జోరును, హుషారును మరిచిపోయి పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. రాజ్‌తరుణ్ లాంటి హీరో ఇలా కనిపించడం అక్కడక్కడా చప్పగా అనిపిస్తుంటుంది. రాజ్ తరుణ్ స్నేహితుడిగా భరత్ కనిపిస్తాడు. రోహిణి కథానాయకుడి తల్లిగా కనిపించింది. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మిక్కీ జె.మేయర్ సంగీతం మెప్పిస్తుంది. పాటలు, వాటి చిత్రణే ప్రధాన బలం. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. రీమేక్ సినిమా అంటే మాతృకలోని తప్పుల్ని సరిదిద్దుకుని చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. భావోద్వేగాలు, ప్రేమజంట మధ్య అనుభూతుల్ని పండించడంలో దర్శకుడి ప్రతిభ కొన్నిచోట్ల కనిపిస్తుందంతే.
బలాలు
- షాలినీ పాండే, రాజ్‌తరుణ్ నటన
- ఛాయాగ్రహణం
- సంగీతం, పాటల చిత్రీకరణ
బలహీనతలు
- కథనం
- సాగదీతగా అనిపించే సన్నివేశాలు
చివరిగా.. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా సాగే ప్రేమకథట
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">