చిత్రం: నాంది
నటీనటులు: అల్లరి నరేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి, నవమి తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత: సతీశ్ వేగేశ్న
దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల: 19-02-2021
అల్లరి నరేశ్ అనగానే కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ, ఆయన అప్పుడప్పుడూ సీరియస్‌గా సాగే పాత్రల్లోనూ కనిపించి మెప్పిస్తుంటారు. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ తదితర సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా రోజుల తర్వాత మరోసారి అలాంటి కథను ఎంచుకుని 'నాంది' చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సరైన విజయాల్లేని అల్లరి నరేశ్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది? అసలు దేనికి 'నాంది' పడింది?
కథేంటంటే: సూర్యప్రకాశ్ (అల్లరి నరేశ్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మధ్య తరగతి కుర్రాడు. అమ్మానాన్న, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడితో కలసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. మీనాక్షితో(నవమి) పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఇంతలో న్యాయవాది, మానవ హక్కుల కోసం పోరాడే సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్ (సి.వి.ఎల్.నరసింహారావు)ని హత్య చేశాడనే ఆరోపణతో సూర్యను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ హత్య కేసులో ఐదేళ్లు జైల్లోనే మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యను సూర్యప్రకాశే చేశాడా? ఐదేళ్ల తర్వాత అతని జీవితంలో ఏం జరిగింది? జూనియర్ లాయర్ ఆద్య (వరలక్ష్మి శరత్‌కుమార్) సూర్యప్రకాశ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అక్రమ నేరారోపణతో జైల్లో మగ్గుతున్న ఓ యువకుడి పోరాటమే ఈ చిత్రం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 ఎంత శక్తిమంతమైనదో ఇందులో ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. ఒక అమాయకుడి జైలు జీవితం... అతను న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ప్రథమార్ధంలో సూర్యప్రకాష్ జీవితం, ఊహించని రీతిలో జైలు గోడల మధ్యకు చేరడం నేపథ్యంలో సాగుతుంది. ద్వితీయార్ధంలో కోర్ట్ రూమ్ డ్రామా కీలకం. అండర్ ట్రయల్ ఖైదీగా కథానాయకుడిని జైలుకు తీసుకెళ్లడంతోనే సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు, జైల్లో అతని జీవితం గురించి వివరించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఉద్యోగం సంపాదించిన ఓ మధ్య తరగతి కుర్రాడు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు త్యాగం చేసిన చిన్న చిన్న ఆనందాల్ని గుర్తు పెట్టుకుని వాటిని తీర్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. భావోద్వేగాలపై అక్కడ్నుంచే పట్టు ప్రదర్శించాడు దర్శకుడు. అంతా హాయిగా.. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడటం, చేతికందివచ్చిన కొడుకు అన్యాయంగా జైలుపాలు కావడంతో ఆ కుటుంబం పడే బాధను చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. విరామానికి ముందు వచ్చే మలుపు ఈ కథను మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తుంది.
ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. సహజంగానే వాటిలో కావాల్సినంత డ్రామా పండింది. బలమైన భావోద్వేగాలు... ఆసక్తిని రేకెత్తించే కథనంతో సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎంచుకున్న అంశం సాధారణమైనదే. కానీ, దాన్ని ఆకట్టుకునే కథనంతో చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శించాడు. ఇలాంటి అంశాల్ని స్పృశిస్తున్నప్పుడు ఎంతో పరిశోధన కావాలి. దర్శకుడు ఆ పరిశోధన కావాల్సినంత చేశాడనిపిస్తుంది. అల్లరి నరేశ్ కెరీర్‌కు ఈ సినిమా ఓ కీలక మలుపు. ఇకపై ఆయన కొత్త అడుగులు వేయడానికి ఇదొక నాంది అవుతుందనడంలో సందేహం లేదు. నటుడిగా నరేశ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రంలో, ఆయన మేకోవర్ మరో ప్రధాన ఆకర్షణ. ఇలాంటి కథలు బాలీవుడ్‌లో తరచూ రూపొందుతుంటాయి. తెలుగు సినిమా కథల్లోనూ మార్పునకు ఈ చిత్రం నాంది పలుకుతుంది.
ఎవరెలా చేశారంటే: సూర్యప్రకాశ్ పాత్రలో ఒదిగిపోయాడు నరేశ్. ఆయన కామెడీ ఇమేజ్, ఆయన గత చిత్రాల ప్రభావం, ఈ పాత్రపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదంటే ఆయన ఆ పాత్రలోఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభ సన్నివేశాల్లోనే నరేశ్ సాహసోపేతంగా కనిపించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. జైల్లో మగ్గుతున్నప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, ఆ క్రమంలో పండే భావోద్వేగాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాకి మరో ప్రధాన బలం. జూనియర్ లాయర్ ఆద్య పాత్రలో ఆమె ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తుంది. ఆమె పరిచయం, విరామానికి ముందు వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు కీలకం.
ద్వితీయార్ధంలో కోర్టులో ఆమె నటన అద్భుతంగా ఉంది. ప్రియదర్శి, ప్రవీణ్ అక్కడక్కడా నవ్విస్తూ పాత్రల్లో ఒదిగిపోయారు. హరీశ్ ఉత్తమన్, వినయ్ వర్మ ప్రతినాయకులుగా కనిపిస్తారు. దేవిప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, కథానాయిక నవమి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అన్ని విభాగాలూ చక్కటి పనితీరుని కనబరిచాయి. అబ్బూరి రవి మాటల బలం అడుగడుగునా వినిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం, సిద్ కెమెరా పనితనం, కళ ప్రతిభ మెప్పిస్తాయి. దర్శకుడు విజయ్ కనకమేడల ఏ దశలోనూ ఆసక్తి తగ్గకుండా సినిమాను నడిపించాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి.
బలాలు
+ అల్లరి నరేష్, వరలక్ష్మి నటన
+ కథ, కథనం
+ కోర్టు రూమ్ డ్రామా, భావోద్వేగాలు
బలహీనతలు
- పతాక సన్నివేశాలు
చివరిగా: న్యాయం కోసం 'నాంది'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">