వినూత్న కథలను ఆదరించేవారిలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అదే తరహాలో వచ్చిన చిత్రం 'ఎవరు'. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే..?
సమీర మహా(రెజీనా) ఒక ప్రముఖ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ అదే సంస్థ యజమానిని పెళ్లి చేసుకుంటుంది. డీఎస్పీ అశోక్(నవీన్ చంద్ర)ను అనుకోకుండా ఓ రోజు హత్య చేస్తుంది. అతడు తనపై అత్యాచారం చేసినందుకే ఇలా చేశానని చెబుతుంది. ఆ కేసును విచారించేందుకు విక్రమ్ వాసుదేవ్(అడివి శేషు) రంగంలోకి దిగుతాడు. కానీ అవినీతి పోలీసు అధికారిగా ముద్రపడ్డ విక్రమ్... సమీరను ఆ కేసు నుంచి బయటకు తీసుకురావడానికి లంచం తీసుకుంటాడు. దర్యాప్తులో భాగంగా వాస్తవాలు తెలుసుకునేందుకు ఆమెను ప్రశ్నిస్తున్నప్పుడు ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? డీఎస్పీ అశోక్‌కు, సమీరకు ఉన్న సంబంధం ఏంటి? దర్యాప్తులో వెలుగుచూసిన వినయ్ వర్మ (మురళీశర్మ) హత్యకు, వాసుదేవ్‌కు లింకేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే 'ఎవరు'.
ఎలా ఉంది...?
ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో చిక్కుముడులతో అల్లుకున్న గంటా 58 నిమిషాల కథ. ఒక్కొక్క చిక్కుముడి విప్పే కొద్దీ దొరికే సమాధానాలు కథను కీలక ములుపు తిప్పుతుంటాయి. ఒక నేరం జరిగాక దాని నుంచి బయటపడేందుకు నిందితులు వేసే ఎత్తుగడలు, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ద్వితీయార్థంలో విక్రమ్, సమీరల ఎత్తుగడలు, డీఎస్పీ అశోక్, వినయ్ వర్మల హత్యలకు గల కారణాలు, పతాక సన్నివేశాల్లో ఊహించని మరో మలుపు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ఫ్రెంచ్ సినిమా 'ద ఇన్విజిబుల్ గెస్ట్' ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తూ కొన్ని మార్పులు చేశారు.
ఎవరెలా చేశారు..!
ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. ప్రతి మలుపులోనూ ఒక్కో పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ప్రతి నటుడు రెండు కోణాల్లో కనిపిస్తూ ప్రాణం పోశారు. అడివి శేష్ మరోసారి తనలో నటుడ్ని బయటపెట్టాడు. ప్రాధాన్యమున్న పాత్రలో రెజీనా చక్కగా ఒదిగిపోయింది.
బలాలు
-కథ
-కథలో మలుపులు
-అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర
-పతాక సన్నివేశాలు
-నేపథ్య సంగీతం
బలహీనతలు
-అత్యాచార సన్నివేశాలు
-ద్వితీయార్ధం మలుపుల్లో గందరగోళం
చివరగా: ‘ఎవరు’ ఎవరో తెలిసే కొద్దీ థ్రిల్లే..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">