బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన 'వీర్'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 'హేట్ స్టోరీ 3', 'హౌస్‌ఫుల్-2' సినిమాలతో బీటౌన్‌లో విజయాలను అందుకున్నారు నటి జరీన్ ఖాన్. అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు. కెరీర్ ఆరంభంలో తాను కూడా దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
"కెరీర్ ఆరంభంలో నేను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాలనుకోవడం లేదు. కానీ ఒకానొక సమయంలో ఓ వ్యక్తి మాత్రం ముద్దు సన్నివేశాలను కూడా రిహార్సల్స్ చేద్దామన్నాడు. ఆ మాటలకు నేను షాకయ్యా. అలాంటి వాటిని నేను చేయనని చెప్పా. దానికి అతను 'మనం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. ఇకపై నీ సినిమా వ్యవహారాలన్నింటినీ నేనే చూసుకుంటా. కావాలంటే అన్ని సినిమాల్లో నువ్వే మెయిన్ హీరోయిన్గా ఉండేలా చూస్తా' అని చెప్పాడు. అతను అనుకున్న విధంగా పని చేయడం నాకిష్టం లేదని చెప్పేశా" అని జరీన్ ఖాన్ తెలిపారు.
కాగా, 2019లో విడుదలైన 'చాణక్య'తో జరీన్ తెలుగులోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.