బాలీవుడ్ హీరో సుశంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నటుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించినా.. అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే సినీరంగంలో అద్భుతమైన భవిష్యత్తును కళ్లముందు పెట్టుకొని.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన అవసరం సుశాంత్‌కు ఎందుకొచ్చింది?. సుశాంత్ ఒక్కడే కాదు.. అసలు నటీనటులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి?.
తాజాగా, ఈ విషయంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్. సాగర్ ముండాడ. ఇంటర్వ్యూలో పలు అంశాలను విశ్లేషించారు.
"గ్లామర్ ప్రపంచంలో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాలు వృత్తిపరమైనవి. సినిమాల్లో కనిపించే భావోద్వేగాలు ఎలా ఉన్నా.. వాస్తవికతలో వారి జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది ద్వంద ముఖాలు కలిగి ఉంటారు. సమాజం కోసం ఒక రకంగా కనిపిస్తూ.. వ్యక్తిగతంగా మరోలా ఉంటారు. అలా రెండు రకాలుగా ఉండటానికి కష్టంగా ఉన్నవారు నిరాశకు లోనవుతారు. పరిశ్రమలో అడుగుపెట్టగానే.. డబ్బు, విజయం, కీర్తి అనే వ్యసనాలకు బానిసలవుతారు. అవి రోజురోజుకు పెరిగిపోతూనే ఉంటాయి. ఫలితంగా మానసిక స్థిరత్వాన్ని కోల్పోతారు. చివరికి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకూ వెనకాడరు"
డాక్టర్. సాగర్ ముండాడ, మానిసిక వైద్య నిపుణులు
సినిమాల్లో నటించడం ఎంతో బాగున్నప్పటికీ.. ప్రతి రోజూ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు సాగర్. విజయంతో పాటు వైఫల్యం కూడా సరి సమానంగా ఉంటాయని.. అటువంటి సమస్యలను అధిగమించి మళ్లీ స్టార్డమ్ స్థాయికి చేరుకోవడానికి సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటంలో ఎప్పటికీ ఒంటరిగానే ఉంటారని.. ఇందులో నుంచి బయటపడిన వారే విజయం వైపు అడుగులేస్తారని సాగర్ స్పష్టం చేశారు.
మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణాలలో నిరాశ ఒకటని వివరించారు. ప్రేమ వైఫల్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర సమస్యల వల్ల ఒత్తిడి తీవ్రతరం అవుతందని సాగర్ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలోనే దగ్గర వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడటం, వైద్యులను సంప్రదించడం అవసరమని సూచించారు.
ఒకరి తర్వాత ఒకరు
ఇటీవలే కాలంలో సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించారు. కోలుకోలేని ఇబ్బందుల్లో జీవించడం కంటే ఇలా మరణించడమే ఉత్తమమని భావిస్తున్నారు. సుశాంత్ మేనేజర్ దిశా సలియన్, టీవీ యాక్టర్ సమీర్ శర్మ, మరాఠీ నటుడు అశుతోష్ భక్రే, భోజ్‌పురి యాక్టర్ అనుపమ పాథక్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థికంగా మోసపోయినందుకే అనుపమ పాథక్ మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు.
దీపిక, ఇలియానాకు తప్పని డిప్రెషన్
బాలీవుడ్లో గతంలో ఇటువంటి మానసిక ఒత్తిడితో సతమతమైన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకొని సమస్య నుంచి బయటపడ్డారు. ప్రేమ విఫలంతో నిరాశకు లోనైన దీపిక పదుకొణె.. సకాలంలో చికిత్సతో ఆరునెలల్లో కోలుకుంది. ఈ క్రమంలోనే 'లైవ్ లవ్ లాఫ్' ఫౌండేషన్నూ స్థాపించింది. ఇలియానా కూడా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. అయితే, సరైన సమయంలో వైద్య సలహా, చికిత్సతో కోలుకున్నట్లు తెలుస్తోంది.
హీరోలాగే బతకాలి
జీవితంలో ఎప్పుడూ ఒడుదొడుకులు ఉంటాయని.. సినిమాలో హీరోలాగే ప్రతి ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉండాలని సాగర్ సూచించారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి కొన్ని విషయాలను వదిలేయాలని.. ప్రారంభంలో కఠినంగా అనిపించినా అసాధ్యం మాత్రం కాదని అన్నారు.