బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ప్రముఖ నటి కంగనా రనౌత్. స్నేహం ముసుగులో ఓ నటుడు తనను పార్టీలకు తీసుకెళ్లి తాగే పానీయాల్లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవాడని పేర్కొంది. తన కెరీర్ ప్రారంభంలో అతను.. తనను వదిలేసి వేరొకరితో సహజీవనం చేశాడని ఆరోపించింది. అయితే, అకస్మాత్తుగా ఒకరోజు జరిగిన సంఘటనలతో తన జీవితం మలుపు తీసుకున్నట్లు వివరించింది.
![Kangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5c4e82d50f1806f387d6cde50ca5023d_2908newsroom_1598708666_1035.jpg)
"ఏమైందో ఏమో తెలియదు. ఆమెతో గొడవ పడి.. అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పాడు. నా వస్తువులను ఇంట్లోనే ఉంచి.. నన్ను గదిలో బంధించాడు. నేను ఏం చేసినా అక్కడున్న సిబ్బంది వెంటనే అతనికి సమాచారం అందించారు. దాదాపు అది గృహ నిర్బంధంలా అనిపించింది. అతను నన్ను పార్టీలకు తీసుకెళ్లి నాకు మత్తు పదార్థాలు ఎక్కించాడు. అది మా మధ్య సాన్నిహిత్యానికి దారి తీసింది. అయితే, నాకు ఇష్టం లేకుండానే జరిగిందని తర్వాత గ్రహించా. ఆ సంఘటన జరిగిన వారంలోనే తనను నాకు భర్తగా ప్రకటించుకున్నాడు. ఒక వేళ నేను నువ్వు నా బాయ్‌ఫ్రెండ్‌వి కాదని అంటే.. నన్ను కొట్టడానికి చెప్పు ఎత్తేవాడు."
-కంగనా రనౌత్, సినీ నటి
తనను దుబాయ్‌కు చెందిన వారితో సమావేశాలకు తీసుకెళ్తాడని.. వృద్ధుల మధ్య కూర్చొబెట్టి వెళ్లిపోతాడని పేర్కొంది. ఆ సమయంలో తనను దుబాయ్‌కి అమ్మేస్తారేమోనని భయపడినట్లు 'పంగా' సినిమా నటి ఆవేదన చెందింది.
కంగన సినిమా అవకాశాల కోసం ముంబయి వచ్చినప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. "నాకు సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు అతను ఆందోళన చెందాడు. ఇంత త్వరగా నాకు బ్రేక్ వస్తుందని అతను అసలు ఊహించలేదని చెప్పేవాడు. ఆ తర్వాత నన్ను మెల్లగా మత్తు ఇంజెక్షన్లతో ప్రభావితం చేశాడు. ఫలితంగా నేను షూటింగులకు వెళ్లలేకపోయేదాన్ని. ఒక రోజు దర్శకుడు అనురాగ్ బసుతో విషయం మొత్తం చెప్పా. అప్పుడు ఆయన తన కార్యాలయంలోనే ఉండే ఏర్పాట్లు చేసి.. నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు" అని కంగన వివరించింది.
ఈ క్రమంలోనే సుశాంత్‌కు కూడా మత్తు పదార్థాలు అందించి.. అతని మనస్సును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించి ఉంటారని కంగన భావిస్తోంది. సుశాంత్ డ్రగ్స్ అలవాటున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడు కాదని.. రియా విదేశాల నుంచి గంజాయి తెప్పించి ఉండొచ్చని కంగన ఆరోపించింది. కాగా సుశాంత్ మృతికి సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ ప్రారంభించింది.