'సైరా' సినిమాలోని మెగాస్టార్ లుక్‌ను అచ్చు అలాగే చిత్రీకరించి ఆ పటాన్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు అందజేశాడు యువ రచయత విశ్వనాథ్ వెంకట్ దాసరి. కళ్లు కనపడక పోయినా చిరు దృశ్యాన్ని అదిరిపోయేలా గీశాడు. చిత్రాన్ని చూసిన పవర్ స్టార్ అతడిని మెచ్చుకున్నాడు.
విశ్వనాథ్ చాలా ఏళ్లుగా నిస్టాగ్మస్, ఫొటో ఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల ఏ వస్తువును సెకను కన్నా ఎక్కువ సేపు చూడలేడు. ఇంతటి కష్టంలోనూ 'హ్యారీ పోటర్' నవలా రచయిత్రి జేకే రోలింగ్‌ను ఆదర్శంగా తీసుకుని రచనలవైపు దృష్టిపెట్టాడు.
మెగాస్టార్ చేతుల మీదుగా పుస్తకం...
18 ఏళ్ల వయసు (2012)లో ఈ యువరచయిత 'ఫరో అండ్ ద కింగ్' పేరుతో ఓ పుస్తకం రాశాడు. దీనిని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించాడు. ఇది భారత్, ఈజిప్టియన్ చరిత్ర ఇతివృత్తంగా ఉంటుంది. 276 పేజీల ఈ పుస్తకాన్ని రాయడానికి దాదాపు ఏడేళ్లు కష్టపడ్డాడు. దిల్లీ, లండన్, కైరో, గాజా వంటి ప్రాంతాల నేపథ్యంలో కథను మలిచాడు. ఇందులో పురాతన కాలంలోని మానవ జీవన విధానం, పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి వాటిని అద్భుతంగా రాశాడు. అంతేకాకుండా వివకదేవ అనే విలన్ ఏ విధంగా పలు ప్రాంతాల్లో పురాతన నిధులను దొంగతనాలు చేస్తుంటాడో చెప్పాడు. చివరికి పిరమిడ్లలోని మమ్మీల నుంచి కాస్మిక్ శక్తిని ఉపయోగించి ప్రపంచానికి చెడు తలపెట్టాలనుకున్న అతడికి ఏం జరిగిందనేదే ఇందులో సారాంశం. ఈ పుస్తకం భారత్‌లోనే కాకుండా అమెరికా, బ్రిటన్ మార్కెట్లలోనూ విడుదలైంది.
ఇవీ చదవండి...