తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త చిత్రం 'సూరారై పోట్రు'ను నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం, ఇప్పట్లో తెరచుకునే వీలు లేకపోవడం వల్ల ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కాగా ఇప్పుడు అందరి కళ్లు విజయ్ 'మాస్టర్'పైనే ఉన్నాయి. సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపడం వల్ల విజయ్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'మాస్టర్' చిత్రానికి 'ఖైదీ'తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో చిత్రబృందం కూడా విడుదలపై ఆలోచిస్తోంది. ఇందులో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.