'అర్జున్ రెడ్డి'తో సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇతడు తన అభిమానుల్ని ఎప్పుడూ 'రౌడీస్' అని పిలుస్తుంటాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అతడి నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్ వెనుక కారణం ఏంటి? అని ఓ ఆంగ్ల మీడియా విజయ్‌ను తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆసక్తికర సమాధానం చెప్పాడు.
"నన్ను ప్రేమించే వారిని 'ఫ్యాన్స్' అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే. అందుకే.. 'మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్' అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్ వచ్చింది. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తుంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్ అంటుంటారు. కానీ మనకు నచ్చినట్లు మనం బతకాలని నేనంటా. అందర్నీ అలానే ఉండమని కోరుతుంటా. దీనర్థం ఇతరుల్ని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు.. స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా 'రౌడీ'ల్లా ముందుకు వెళ్లాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది"
-విజయ్ దేవరకొండ, కథానాయకుడు
సోషల్‌మీడియాలో "మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మీరు ఒక్కర్నీ ఫాలో కావడం లేదు ఎందుకు?" అని ప్రశ్నించగా.. ''నేను ఫోన్‌లోని అప్లికేషన్స్ వాడను. దాని కోసం నాకు ప్రత్యేక బృందం ఉంది. వాళ్లే అంతా చూసుకుంటారు. ముఖ్యమైనవి వాట్సాప్ ద్వారా పంపిస్తుంటారు. నేను రిప్లై ఇస్తుంటా. నాకు సాంకేతికతపై పెద్దగా అవగాహన లేదు. జీవితంలో ఏది ముఖ్యమో వాటికే సమయం కేటాయిస్తాను. సోషల్ మీడియా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే దానికి దూరంగా ఉంటాను" అని విజయ్ తెలిపాడు.