బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై మంగళవారం పార్లమెంట్లో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఆమె వ్యాఖ్యలను కొంతమంది సమర్థించగా మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా సీనియర్ నటి హేమమాలిని జయా వ్యాఖ్యలతో ఏకీభవించారు.
బాలీవుడ్ చిత్రపరిశ్రమ తనకెంతో ఇచ్చిందని.. అలాంటిది ఇప్పుడు దాని గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఊరుకోగలను అని హేమ ప్రశ్నించారు.
"బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఎవరూ దెబ్బతీయలేరు. ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అది చిన్న విషయం మాత్రమే. ఇది దుస్తులకు పట్టిన మురికి లాంటిది. కాబట్టి శుభ్రంగా కడిగివేయాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానాలు పొందాను. ఎవరైనా వ్యక్తులు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఉండగలను" అని హేమమాలిని అన్నారు.
ఇదిలా ఉండగా తాప్సీ, సోనమ్ కపూర్, దియామీర్జాతో పాటు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు.. పార్లమెంట్ వేదికగా జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. జయ చక్కగా చెప్పారంటూ ట్వీట్లు చేశారు.
సరికాదంటూ
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిసగా మారిందంటూ పార్లమెంటులో ఎంపీ రవికిషన్ వ్యాఖ్యలను సమర్థించారు సీనియర్ నటి, భాజపా నాయకురాలు జయప్రద. అంతేకాదు జయాబచ్చన్ దీనికి వ్యతిరేకంగా మాట్లడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జయప్రద. రాజ్యసభ వేదికగా చిత్రపరిశ్రమ గురించి జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను.. ఇటీవల హీరోయిన్ కంగనా రనౌత్ కూడా తప్పుబట్టింది.
అలా మొదలైంది
బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పురి నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్ సోమవారం పార్లమెంటు సమావేశాల్లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. లోక్‌సభలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడం ఎంతో సిగ్గుగా ఉందని విమర్శించారు.
ఇదీ చూడండి: 3 వేల పాటలు పాడి రూ.85 లక్షల విరాళం సేకరణ