"మన మట్టి కథలు, మన భూమి కథలు రావాలి. మోడ్రన్ కథలు, ట్రెండీ సినిమాలంటూ మనం మరో దారిలోకి వెళ్లిపోతున్నాం. కనుమరుగై పోతున్న మన కథల్ని గుర్తు చేస్తూ, ఇదీ మన నేపథ్యం అని చెప్పిన మరో సినిమా 'ఉప్పెన' అవుతుంద"న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.
ఆయన మేనల్లుడు పంజా వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఉప్పెన'. కృతిశెట్టి కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ఈ విధంగా మాట్లాడారు.
"కరోనాతో ఏడాది కాలం పాటు భవిష్యత్తు తెలియక ఇంటికే పరిమితమయ్యాం. ఇప్పుడు మళ్లీ ఓ శుభారంభంలా అనిపిస్తోంది. 'ఉప్పెన' సినిమా ఒక దృశ్యకావ్యం, అద్భుతం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది మరో 'రంగస్థలం' అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబు చూపించిన పనితనం, దర్శకత్వ విలువలు గొప్పగా ఉంటాయి. స్క్రీన్‌ప్లేకు ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. 80, 90ల్లో భారతీరాజా తీసిన సినిమాలు గుర్తుకొచ్చాయి. విజయ్ సేతుపతి నటనతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. తొలి సినిమా అయినా కృతిశెట్టి చాలా బాగా చేసింది. వైష్ణవ్ మా కుటుంబానికి గర్వకారణం. అంత బాగా నటించాడు. మైత్రీ సంస్థ కథానాయకులందరికీ ఇష్టమైన నిర్మాణ సంస్థ అయ్యిందంటే సినిమాపై వాళ్లకున్న ప్రేమే కారణం."
- చిరంజీవి, కథానాయకుడు
అంతకుముందు హీరో వైష్ణవ్‌తేజ్, విజయ్ సేతుపతి, సుకుమార్, దర్శకుడు బుచ్చిబాబు, హీరోయిన్ కృతిశెట్టి సినిమా గురించి మాట్లాడారు.
"మా అమ్మ త్యాగం లేకపోతే, మా మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్యలు ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. జీవితాంతం మా మావయ్యలకు రుణపడి ఉంటాం. బుచ్చిబాబు రాసిన కథే ఈ సినిమాకు హీరో."
- వైష్ణవ్ తేజ్, కథానాయకుడు
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. "ఈ కథలో ఆత్మ ఉంది. సంభాషణలు చాలా బాగా నచ్చాయి" అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. "బుచ్చిబాబు 'ఉప్పెన' కథ చెప్పగానే గది మొత్తం గంభీరమైంది. అప్పుడే ఇది వంద కోట్ల సినిమా అని చెప్పా. చాలా భవిష్యత్తు ఉన్నవాడు బుచ్చిబాబు. ఇంత సులభంగా 'ఉప్పెన' కనిపిస్తుంది కానీ, బుచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టమైన ప్రయాణం చేశాడు" అన్నారు.
హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. "సుకుమార్ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆయన చెప్పిన మాటలు మనసులో ఉంటాయి. ఈ సినిమా చేయడం నా అదృష్టం. వైష్ణవ్‌తో ప్రయాణం చాలా బాగుంది" అన్నారు. "సుకుమార్ సర్ నాకు లెక్కలు చెప్పకపోతే మరొకటేదో చేసుకునేవాణ్ని. దర్శకత్వం మాత్రం కాదు. 'ఉప్పెన' కథని ఎలా రాశానో, అలాగే తీసే అవకాశాన్నిచ్చారు ఈ చిత్ర నిర్మాతలు. చాలా భావోద్వేగంతో రాసిన కథ ఇది" దర్శకుడు బుచ్చిబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల, సందీప్‌రెడ్డి వంగా, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బాబీ, కొరటాల శివ, హరీష్ శంకర్, దేవీశ్రీప్రసాద్, చంద్రబోస్, రామకృష్ణ - మౌనిక, ఛాయాగ్రాహకుడు శ్యామ్‌దత్ సైనుద్దీన్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అక్షయ్‌తో పాటు 'బచ్చన్ పాండే' టీమ్‌పై కేసు