తన సినిమా పరువుహత్య నేపథ్యంగా సాగే కథ కాదని 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు స్పష్టం చేశారు. సుకుమార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన బుచ్చిబాబు.. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సలహా ఎంతో దోహదపడిందని ఆయన అన్నారు. హీరోయిన్గా కృతిశెట్టిని ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. మట్టిలో పుట్టిన తన కథకు ప్రేక్షకులు పట్టం కడతారనే ధీమాను వ్యక్తం చేశారు. దర్శకుడు సుకుమార్‌తో తనకున్న బంధం గురించి చెప్పుకొచ్చారు.
'ఉప్పెన' కథ అలా పుట్టింది
"సుకుమార్ సర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తరుణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఏదైనా ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశపడ్డా. అలా నాకు వచ్చిన ఆలోచనల్ని మొదట సుకుమార్‌కే చెప్పేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. 'రంగస్థలం' షూట్‌లో ఉన్నప్పుడు నాకీ 'ఉప్పెన' ఆలోచన వచ్చింది. వెంటనే సుకుమార్‌తో చెప్పాను. చాలా బాగుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లేపై పూర్తిగా పనిచేయ్ అని అన్నారు. ఆరు నెలలు సమయం తీసుకుని పూర్తి కథ సిద్ధం చేసి మళ్లీ సుకుమార్‌ను కలిసి మొత్తం వివరించాను. ఆయన వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకుని.. 'సూపర్‌గా ఉంది. నువ్వు నా పెద్దకొడుకువిరా' అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని అపురూప జ్ఞాపకం." అని బుచ్చిబారు అన్నారు.
ఇదీ చూడండి: 'ఉప్పెన' దర్శకుడ్ని నీటిలో పడేసిన తారక్!