'చిన్న సినిమాలే శ్రీరామ రక్ష'.. చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించే మాటిది. ఇది అక్షర సత్యం కూడా. ఓ పెద్ద విజయం తీసుకొచ్చే రూ.వందల కోట్ల వసూళ్ల కన్నా.. ఓ చిన్న సినిమా విజయం అందించే స్ఫూర్తే చిత్రసీమలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ముఖ్యంగా కరోనాతో చీకట్లు అలుముకున్న చిత్రసీమలో.. చిన్న చిత్రాలే కొత్త కాంతులు నింపుతున్నాయి. కొత్తదనం నిండిన కథలతో ఊరిస్తూ.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తున్నాయి. వేసవిలో రాబోతున్న పెద్ద సినిమాలకు ఓ బలమైన భరోసాని అందిస్తున్నాయి.
'చిన్న చిత్రం.. పెద్ద సినిమా' అన్న మాటల్ని సినీప్రియులు ఎప్పుడో పక్కకు నెట్టేశారు. కథలో కొత్తదనం ఉండి.. చూపించే దర్శకుడిలో సత్తా ఉంటే చాలు.. తెరపై కనిపిస్తున్నది బడా హీరోనా.. యువ కథానాయకుడా? అన్నది పట్టించుకోవడం లేదు. విజయపు అంబారీ ఎక్కించి.. ఊరేగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగు తెరపై సత్తా చాటినవన్నీ ఈ తరహా చిత్రాలే.
కొత్త ప్రతిభ మెరవగా.. చిన్న చిత్రం మురవగా..
ఏటా కనీసం డజను మంది కొత్త దర్శకులైనా తెలుగు తెరపై మెరిపిస్తుంటారు. ఈ ఏడాది ఆ జోరు ఆరంభం నుంచే కనిపించింది. కరోనా పరిస్థితులతో డీలా పడ్డ చిత్ర సీమలో 'క్రాక్' విజయం కొత్త ఉత్సాహాన్ని నింపితే.. తర్వాత ఆ విజయపరంపరను చిన్న చిత్రాలే కొనసాగించాయి. వీటిలో ప్రతిదీ ఓ కొత్త దర్శకుడి నుంచి వచ్చింది కావడం విశేషం. ఫిబ్రవరిలో తొలి వారంలో 'జాంబీరెడ్డి'తో మ్యాజిక్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 'అ!', 'కల్కి' లాంటి వైవిధ్యభరిత సినిమాల తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా పరిచయం లేని జాంబీల కథతో.. వెండితెరపై ఆయన పంచిన వినోదం సినీప్రియుల్ని నవ్వించింది.
వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో మరో మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఓ వైవిధ్యభరితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం.. కుర్రకారును థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. పరిమిత బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా..బాక్సాఫీస్ ముందు దాదాపు రూ.70కోట్లకు పైగా వసూళ్లను అందుకుని చిత్రసీమలో కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఫిబ్రవరి మూడో వారంలో వచ్చిన 'నాంది' సినిమాతో సినీప్రియుల్ని ఆకర్షించారు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల. ఈ సినిమాతోనే 8ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు హీరో అల్లరి నరేష్.
మార్చి తొలివారంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్', 'పవర్ ప్లే', 'షాదీ ముబారక్' లాంటి అరడజనుకు పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టాయి. అయితే వీటిలో సందీప్ కిషన్.. 'ఏ1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రమే మంచి వసూళ్లు దక్కాయి. అయితే ఇదే వారం వచ్చిన ‘షాదీ ముబారక్’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా.. సరైన ప్రచారం దక్కలేదు. శివరాత్రికి 'శ్రీకారం', 'జాతిరత్నాలు', 'గాలి సంపత్' లాంటి చిత్రాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడగా.. 'జాతిరత్నాలు' మంచి వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది. కె.వి.అనుదీప్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. 'శ్రీకారం'తో బి.కిషోర్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు. ఇక ఈ వారం 'చావు కబురు చల్లగా', 'మోసగాళ్లు', 'శశి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ ముందు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
అసలు పరీక్ష ఇప్పుడే
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 70వరకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో దాదాపు సగానికిపైగా చిన్న సినిమాలే ఉన్నాయి. ఇవన్నీ టాక్‌ని బట్టీ.. హీరో స్థాయిని బట్టీ పెట్టిన పెట్టుబడికి చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టాయి. 'ఉప్పెన', 'జాతిరత్నాలు' లాంటివి మాత్రమే పెద్ద సినిమాల స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించాయి. అయితే మునుపటిలా రూ.వందల కోట్లు వసూళ్లు రాబట్టాలంటే మాత్రం.. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ లాంటి పెద్ద హీరోలు బరిలోకి దిగాల్సిందే. ఏప్రిల్ తొలివారం నుంచి ఈ సందడి మొదలవుతుంది. ఇప్పుడు వాళ్ల సినిమాలకు దక్కే ఆదరణ ఆధారంగానే.. ఓవర్సీస్ మార్కెట్‌లు ఎలా స్పందించబోతున్నాయి? అది రాబోయే రోజుల్లో పాన్ ఇండియా చిత్రాలకు ఎంత మేర కలిసొస్తుందనేది తెలుస్తుంది.
ఇదీ చూడండి: 'ఉప్పెన' రివ్యూ: ప్రేమకథకు సరికొత్త ముగింపు!
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 'జాతిరత్నాలు' వసూళ్ల హంగామా