ప్రఖ్యాత స్పానిష్ వెబ్‌సిరీస్ 'మనీ హైస్ట్'ను పాకిస్థాన్‌లో '50 క్రోర్' అనే పేరుతో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, చిత్రాలు చూసిన నెటిజన్లు సినిమాను ట్రోల్ చేస్తున్నారు. పాక్ వర్షన్ టీజరే ఇంత హాస్యాస్పదంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని నవ్వుకుంటున్నారు.
కథేంటీ :
లాక్‌డౌన్ సమయంలో బాగా పాపులరైన వెబ్ సిరీస్ 'మనీ హైస్ట్'. ఒక ప్రొఫెసర్ ఓ బృందంతో కలిసి స్పెయిన్‌లోని రాయల్‌మింట్‌లో ఎలా దోపిడీ చేశాడన్నది కథ. స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్’ పేరుతో డబ్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. దీంతో ఈ వెబ్‌సిరీస్‌కు లాక్‌డౌన్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ను పాకిస్థాన్‌లో రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పాక్ నటులు ఖురేషి, మహమూద్ అస్లాం, అయిజాజ్ అస్లాం, సబూర్ అలి, ఫర్యాల్ మహమూద్, ఝాలే సారాది, అసద్ సిద్ధిఖి, నొమన్ హబీబ్, నవీద్ రజా, ఒమర్ షాహజద్, అనౌషే అబ్బాసి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#50క్రోర్ ట్రోలింగ్ :
‘ఆ వెబ్‌సిరీస్ రేంజ్ ఏంటి? ఈ సినిమా రేంజ్ ఏంటి’?, ‘అది మనీ హైస్ట్.. ఇది మనీ వేస్ట్’, ‘ఆ మనీ హైస్ట్ 1080 పిక్సెల్ అయితే ఈ మనీ హైస్ట్(50క్రోర్‌ను ఉద్దేశించి) 240 పిక్సెల్’, ‘పాకిస్థాన్ వర్షెన్ మనీ హైస్ట్‌లో ఆ దేశంలో ఐటీలో డిగ్రీ పొందిన నిరుద్యోగే ఫ్రొఫెసర్ అయి ఉంటాడు’, ‘దోపిడీ చేసేది కేవలం 50 కోట్లేనా?’అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం సోషల్‌మీడియాలో #50క్రోర్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.