ఒక్క హిట్ కొట్టి మరోసారి స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నారు కొందరు టాలీవుడ్ దర్శకులు. ఒకానొక సమయంలో టాప్ డైరక్టర్లగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం హిట్ కోసం తాపత్రయ పడుతున్నారు. తమదైన కథలు సిద్ధం చేసుకుని మళ్లీ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ ఉన్నారు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.
శ్రీనువైట్ల
ఢీ, రెడీ, వెంకీ, దూకుడు.. ఈ చిత్రాలు చాలు శ్రీనువైట్ల ప్రత్యేకత ఏంటో చెప్పడానికి. హాస్యభరిత సినిమాలు తీయడంలో ప్రసిద్ధుడైన ఈ దర్శకుడు.. ప్రస్తుతం హీరోల డేట్స్ దొరక్క కాలం వెల్లదీస్తున్నాడు. అతడి నుంచి చివరగా 'అమర్ అక్బర్ ఆంటోని' వచ్చింది. ఇప్పుడు ఓ సరికొత్త కథను సిద్ధం చేసుకుని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల
తొలి సినిమా 'కొత్త బంగారు లోకం' యువతను ఉద్దేశించి తీశాడీ దర్శకుడు. అనంతరం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద', 'బ్రహ్మోత్సవం' వంటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించాడు. అయితే గత సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ డైరక్టర్.. ఓ మెగాహీరోతో త్వరలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
బోయపాటి శ్రీను
ప్రస్తుత తరంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. ఈ దర్శకుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే హీరో రామ్‌చరణ్‌తో తీసిన గత చిత్రం 'వినయ విధేయ రామ' అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో రూపొందించబోయే సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నాడు బోయపాటి. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్'లు ఘనవిజయం సాధించాయి.
బొమ్మరిల్లు భాస్కర్
తొలి చిత్రం 'బొమ్మరిల్లు'నే తన ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు భాస్కర్. ఆ తర్వాత 'పరుగు'తో హిట్ కొట్టాడు. 'ఆరెంజ్', 'ఒంగోలు గిత్త' వంటి సినిమాలతో అపజయాలను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. మరి ఇతడి ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.
వి.వి.వినాయక్
టాలీవుడ్లో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినాయక్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నం.150'ను తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత 'ఇంటిలిజెంట్'తో డీలా పడ్డాడు. ప్రస్తుతం దర్శకత్వం పక్కనపెట్టి నటుడిగా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. 'సీనయ్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఓ సరైన సినిమాకు దర్శకత్వం వహిస్తే మళ్లీ గాడిలో పడతాడు