ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత సీఎస్‌రావు(86).. ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెట్టుగూడ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం 'ప్రాణం ఖరీదు', 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ', జాతీయ అవార్డు చిత్రం 'ఊరుమ్మడి బతుకులు', 'నాయకుడు వినాయకుడు', 'మల్లెమొగ్గలు' వంటి ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించారు.
![TOLLYWOOD WRITER CS RAO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6790790_writer-2.jpg)
ఎన్టీఆర్ 'సరదా రాముడు', సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'సొమ్మొకడిది సోకొకడిది' వంటి చిత్రాల్లో ఈయన నటించారు. నాటక రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకుగానూ పలు అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. సీఎస్ రావుకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం లాకౌడౌన్ నియమాలను గౌరవించి ఎవరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయొద్దని కుటుంబ సభ్యులు.. సినీపరిశ్రమ మిత్రులను, శ్రేయోభిలాషులను కోరారు. హైదరాబాదులో బుధవారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.