Tollywood Movies 2021: ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహాల మధ్య మొదలై.. 'అఖండ'మైన విజయాలతో పరిశ్రమకు 'పుష్ప'గుచ్ఛాలు ఇచ్చి ముగుస్తోంది 2021 సినిమా సంవత్సరం. ఎప్పట్లాగే కొన్ని విజయాలు సొంతమయ్యాయి. ఎక్కువ పరాజయాలూ వెంటాడాయి. వీటిన్నిటికంటే కరోనా భయాల మధ్య ఈ ఏడాది చిత్రసీమ చేసిన ప్రయాణం.. ప్రేక్షకుల సినీ ఉత్సాహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరోనాతో తలెత్తిన ఈ సంక్షోభ సమయంలోనూ.. ప్రపంచ సినిమా మొత్తం తీవ్ర ఒడుదొడుకులకి లోనవుతూ ఆచితూచి అడుగేలేస్తున్న ఈ దశలోనూ తెలుగు సినిమా హౌస్‌ఫుల్ బోర్డ్‌తో థియేటర్లని కళకళలాడించింది. రూ.కోట్లు కురిపించింది. కొత్త ముప్పు రాకపోతే వచ్చే ఏడాదీ బాక్సాఫీసు మనదే అనేంత నమ్మకం తెలుగు చిత్రసీమలో కనిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల ఉత్సాహం చూసి తెలుగు చిత్రసీమ తగ్గేదే లేదన్నట్టుగా వరుసబెట్టి సినిమాల్ని విడుదల చేసింది. గతేడాది వాయిదా పడినవన్నీ పోటాపోటీగా విడుదల తేదీల్ని ఖరారు చేశాయి. రెండో దశ కరోనాతో కొన్ని నెలలపాటు థియేటర్లు మూతపడినా.. ఆ తర్వాత కొన్నాళ్లు యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు కొనసాగినా రికార్డు స్థాయిలో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేశంలోనే ఎక్కువ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్రసీమగా టాలీవుడ్ కీర్తిని గడించింది. దాదాపు 183 తెలుగు సినిమాలు విడుదల కాగా, 45కిపైగా అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓటీటీలోనూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, షోలతో హోరెత్తించారు మన తారలు.
సంక్రాంతికి కళకళ
తెలుగులో ఒక్క బ్లాక్‌బస్టర్ వచ్చిందంటే చాలు.. దాని మొత్తం వసూళ్లకి మించి పెట్టుబడి పెట్టేంతగా ధైర్యం చేస్తుంటారు నిర్మాతలు. ఒక మంచి విజయం వచ్చిందంటే ఆ సినిమా స్ఫూర్తితో వంద సినిమాలు షురూ అవుతుంటాయి. పెట్టుబడి తిరిగొచ్చినా చాలు.. మరో ప్రయత్నం చేద్దాం అంటూ మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ దూకుడు అలా ఉంటుంది. గతేడాది 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదల కావడం.. ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టడంతో కొండంత ధైర్యాన్ని కూడగట్టుకుంది చిత్రసీమ. ఆ వెంటనే సంక్రాంతి సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. తెలుగు ప్రేక్షకుల సినిమా అభిరుచి చూసి ఇతర పరిశ్రమలన్నీ అవాక్కయ్యాయి. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా లెక్క చేయకుండా మాస్క్‌లు ధరించి థియేటర్లకి వచ్చారు ప్రేక్షకులు. అందుకే సంక్రాంతికి విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో కళకళలాడాయి. అది చాలు కదా చిత్రసీమలో ఉత్సాహం పెంచడానికి. అక్కడ్నుంచి వరుసగా విడుదలయ్యాయి. తొలి నెలలోనే 21 స్ట్రెయిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రవితేజ కథానాయకుడిగా నటించిన 'క్రాక్' ఘన విజయం సాధించింది. 'రెడ్' పర్వాలేదనిపించింది. యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' లాభాల్ని సొంతం చేసుకుంది. 'అల్లుడు అదుర్స్', 'బంగారు బుల్లోడు', 'డర్టీ హరి' తదితరాలు ఇదే నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
- రెండో నెలలో 'ఉప్పెన' బాక్సాఫీసుని వసూళ్లతో ముంచెత్తింది. 'జాంబీరెడ్డి', 'నాంది' చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. 'కపటధారి', 'చెక్' తదితర చిత్రాలు నిరుత్సాహపరిచాయి.
- మూడో నెలలో 'ఎ1 ఎక్స్‌ప్రెస్', 'శ్రీకారం’, 'గాలిసంపత్', 'జాతిరత్నాలు', 'చావు కబురు చల్లగా', 'మోసగాళ్లు', 'శశి', 'రంగ్‌దే', 'అరణ్య', 'తెల్లవారితే గురువారం' తదితర చిత్రాలొచ్చాయి. వీటిలో 'జాతిరత్నాలు' ఘన విజయాన్ని సొంతం చేసుకోగా, మిగిలినవి ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయాయి.
- భారీ అంచనాలతో ఏప్రిల్ మాసం మొదలైంది. నాగార్జున 'వైల్డ్‌డాగ్', పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రాలు ఇదే నెలలోనే విడుదలయ్యాయి మరీ! 'వకీల్‌సాబ్'గా పవన్‌కల్యాణ్ చేసిన సందడి అభిమానులకి ప్రేక్షకులకు బాగా నచ్చింది. నాగార్జున 'వైల్డ్‌డాగ్' పర్వాలేదనిపించుకున్నా బాక్సాఫీసుపై ప్రభావం చూపించలేకపోయింది. తొలి నాలుగు నెలల కాలంలో 79 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాక రెండో దశ కరోనాతో మరోసారి చిత్రసీమ స్తంభించిపోయింది. విరామం తర్వాత.. రెండో లాక్‌డౌన్ తర్వాత జులై చివర్లో 'తిమ్మరుసు', 'ఇష్క్' చిత్రాలతో మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. 'తిమ్మరుసు' విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టులో 'ఎస్.ఆర్.కళ్యాణమండపం', 'పాగల్', 'రాజ రాజ చోర', 'బజార్‌రౌడీ', 'ఇచట వాహనములు నిలుపరాదు', 'శ్రీదేవి సోడా సెంటర్' తదితర చిత్రాలొచ్చాయి. సెప్టెంబర్‌లో 'డియర్ మేఘ', 'నూటొక్క జిల్లాల అందగాడు', 'సీటీమార్', 'గల్లీరౌడీ', 'లవ్‌స్టోరి' చిత్రాలు రాగా.. వీటిలో 'లవ్‌స్టోరి' ప్రేక్షకులకు నచ్చింది. 'సీటీమార్' మాస్ ప్రేక్షకుల్ని మెప్పించింది.
విరామం తర్వాత..
రెండో లాక్‌డౌన్ తర్వాత జులై చివర్లో 'తిమ్మరుసు', 'ఇష్క్' చిత్రాలతో మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. 'తిమ్మరుసు' విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టులో 'ఎస్.ఆర్.కళ్యాణమండపం', 'పాగల్', 'రాజ రాజ చోర', 'బజార్‌రౌడీ', 'ఇచట వాహనములు నిలుపరాదు', 'శ్రీదేవి సోడా సెంటర్' తదితర చిత్రాలొచ్చాయి. సెప్టెంబర్‌లో 'డియర్ మేఘ', 'నూటొక్క జిల్లాల అందగాడు', 'సీటీమార్', 'గల్లీరౌడీ', 'లవ్‌స్టోరి' చిత్రాలు రాగా.. వీటిలో 'లవ్‌స్టోరి' ప్రేక్షకులకు నచ్చింది. 'సీటీమార్' మాస్ ప్రేక్షకుల్ని మెప్పించింది.
చివరి మూడు నెలల్లో..
ఏడాది చివరి మూడు నెలల కాలంలో కీలకమైన దసరా, దీపావళి సీజన్లు ఉంటాయి. ఆ సీజన్లని లక్ష్యంగా చేసుకుని సినిమాలు విరివిగా ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. ఈసారీ అంతే. 'రిపబ్లిక్', 'కొండపొలం', 'మహా సముద్రం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'పెళ్లి సందడి', 'రొమాంటిక్', 'వరుడు కావలెను' చిత్రాలు అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విజయాన్ని అందుకుంది.
నవంబర్‌లో 'మంచి రోజులు వచ్చాయి', 'ఎనిమి', 'కురుప్', 'పుష్పకవిమానం', 'తెలంగాణ దేవుడు', 'రాజా విక్రమార్క', 'అనుభవించు రాజా', 'కాలీఫ్లవర్' ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నవంబర్ ఆఖరు నుంచి క్రిస్మస్ వరకు అన్‌సీజన్‌గా భావిస్తుంటుంది చిత్రసీమ. సంక్రాంతికి రానున్న పెద్ద సినిమాలవైపు ప్రేక్షకుల దృష్టి మళ్లుతుంటుంది. కానీ పండగకి పెద్ద సినిమాలు రావడం కాదు, పెద్ద సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అని నిరూపించాయి ఈ ఏడాది ఆఖరి నెలలో వచ్చిన 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్ సింగరాయ్' సినిమాలు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ' బాక్సాఫీసు దగ్గర సత్తా చాటింది. చాలా రోజుల తర్వాత మాస్ ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్‌కి రప్పించింది. అల్లు అర్జున్ 'పుష్ప' విజయ పరంపరని కొనసాగించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శితమవుతూ తెలుగు సినిమా సత్తాని దేశవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పింది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్'దే ఈసారి క్రిస్మస్. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో వచ్చిన 'స్కైలాబ్', 'గమనం' మంచి ప్రయత్నాలుగా నిలిచాయి. శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ', రామ్‌గోపాల్ వర్మ చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'తో ఏడాది ముగుస్తోంది.
తెలుగులో తెరకెక్కిన చిత్రాలే కాదు, అనువాద చిత్రాలూ పెద్ద ఎత్తునే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో సంక్రాంతికి విడుదలైన విజయ్ 'మాస్టర్'తోపాటు శివకార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', కార్తీ 'సుల్తాన్', కంగనరనౌత్ 'తలైవి', 'సూపర్‌మేన్ నో వే టు హోమ్' చిత్రాలు మంచి వసూళ్లని సొంతం చేసుకున్నాయి. రజనీకాంత్ 'పెద్దన్న'తోపాటు సిద్ధార్థ్ 'ఒరేయ్ బామ్మర్ది', విజయ్ ఆంటోనీ 'విజయ రాఘవన్' తదితర కీలక చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఓటీటీలో సందడే సందడి
థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ పలు కీలకమైన సినిమాలు విడుదలయ్యాయి. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'నారప్ప', 'దృశ్యం2' చిత్రాలు ఓటీటీ వేదికల్లోనే ఆదరణ పొందాయి. నితిన్ 'మాస్ట్రో', నాని 'టక్ జగదీష్', సూర్య 'జై భీమ్', ఆర్య 'సార్‌పట్ట', తేజ సజ్జా - శివాని రాజశేఖర్‌ల 'అద్భుతం'తోపాటు 'మెయిల్', 'సినిమాబండి', 'ఏక్ మినీ కథ', 'నెట్', 'వివాహ భోజనంబు', 'ఆకాశవాణి' తదితర చిత్రాలు ఓటీటీలో అలరించాయి.
ఇదీ చదవండి:
'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్.. త్వరలో మరో రెండు సీజన్లు
సల్మాన్ బర్త్‌డేకు రూ.కోట్లలో కానుకలు.. కత్రినా ఏమిచ్చిందంటే?