ప్రేమ నింగి అయితే... సినిమా పాటలు దానిపై మెరిసే తారకలు. ప్రేమ సంద్రమైతే... ఈ పాటలు అందులో ఎగిసిపడే అలలు. ప్రేమ వర్షమైతే... పాటలు జలజల రాలే చినుకులు. అవును తమలోని ప్రేమను రంగరించి ప్రేమించిన వారి ముందు ఉంచాలంటే కవిత్వమే కావాలి. సంగీతం తోడు రావాలి. అలా కథానాయకులు తమలోని ఇష్టాన్ని చాటడానికి సంగీత దర్శకుల, రచయితల సాయం కోరారు. వారు వినసొంపైన ప్రేమను పాటలుగా ఆవిష్కృతం చేశారు. ఎల్లలులేని భావుకతను ప్రేమకు అద్దారు. ప్రేమికుల రోజు సందర్భంగా కొన్ని సినిమాల్లోని ఆ పాటలను ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. మరి కొందరు పోస్టర్‌లను ఆవిష్కరించారు.
భాగ్యనగరిలో.. కొత్త ప్రేమ కావ్యమై
"ప్రేమే పునాదిగా నిర్మితమైన నగరం హైదరాబాద్. ఎన్నో ప్రేమకథలు నిలిచి, గెలిచిన ఈ నగరంలో ఆవిష్కృతం కానున్న మరో ప్రేమ కావ్యమే.. మా 'లవ్‌స్టోరి' అంటున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ తర్వాత ఆయన దర్శకత్వం నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలందించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి.. నే చిత్తరువైతిరయ్యో..’’ అంటూ ప్రేమకథను తెలియజేస్తూ సాగుతున్న ఈ గీతానికి మిట్టపల్లి సురేందర్ చక్కటి సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పాటలో భాగ్యనగర ప్రేమ చిహ్నాలైన ‘పురాణ పూల్’, ‘తారామతి బరాదారి’, ‘కోటీ రెసిడెన్సీ’ వంటి వాటిని చూపించి.. చివరిగా రేవంత్, మౌనిక ప్రేమ వారధిగా ‘రేవంత్ జుంబా’ సెంటర్‌ను చూపించారు. ఈ సినిమాలో రేవంత్ పాత్రలో చైతూ కనిపించనుండగా.. మౌనిక పాత్రలో సాయిపల్లవి దర్శనమివ్వనుంది. తెలంగాణ నేపథ్యంగా సాగే ఓ సరికొత్త ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందు కొస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కోల కళ్లే ఇలా...
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రంలోని ‘కోల కళ్లే ఇలా గుండె గిల్లే ఎలా...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. సిద్‌శ్రీరామ్ ఆలపించిన ఈ గీతాన్ని రాంబాబు గోసల రాశారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. ‘‘శ్రావ్యమైన ఈ గీతాన్ని ఆలపించడం, ఇది ప్రేమికుల రోజు సందర్భంగా సంగీత ప్రియులకి చేరువ కావడం ఎంతో ఆనందంగా ఉంద’’ని గాయకుడు సిద్‌శ్రీరామ్ చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగు తున్నాయని చిత్రవర్గాలు తెలిపాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శీతాకాలం ప్రేమకథ
సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఆదివారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సత్యదేవ్, తమన్నా ఒకరి చేతులు మరొకరు పట్టుకొని.. కళ్లతోనే ప్రేమ కావ్యాలు రచిస్తూ రొమాంటిక్‌గా కనిపించారు. ‘‘కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్ టేల్’కి తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.
![gurthunda seethakalam movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10629653_movies-2.jpg)
థ్రిల్లింగ్ ఆట
రాజ్‌తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పవర్ ప్లే’. మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేమల్ ఇంగ్లే, పూర్ణ కథానాయికలు. మార్చి 5న విడుదల చేస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాజ్‌తరుణ్, హేమల్ రొమాంటిక్ మూడ్‌లో కనిపించారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త జానర్‌లో ఓ విభిన్నమైన థ్రిల్లర్ కథాంశంతో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్మకంగా ఉంద’’న్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. కచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంద’’న్నారు దర్శకుడు విజయ్.
![raj tarun power play movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10629653_movies-3.jpg)
ఏ కన్నులు చూడని చిత్రమే...
కార్తిక్‌రత్నం, కృష్ణప్రియ, నవీన్‌చంద్ర, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘ఏ కన్నులు చూడని చిత్రమే...’ అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి నౌపల్ రాజా స్వరాలు సమకూర్చారు. పాట విడుదల అనంతరం రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘‘మెలోడియస్‌గా సాగే ‘ఏ కన్నులు చూడని...’ పాట వింటుంటే చక్కటి రొమాంటిక్ అనుభూతి కలుగుతుంది. ప్రచార చిత్రాలు, టీజర్ చాలా బాగున్నాయి. అష్కర్ కెమెరా పనితనం నచ్చింది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుకుమార్, కథానాయకుడు రానా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించాయి. రకుల్ విడుదల చేసిన పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు.