టాలీవుడ్‌లోని కథానాయకులకు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. అగ్రహీరోలు పవన్ కల్యాణ్, వెంకటేశ్ వంటివారు తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంటూ ఉంటారు. అలానే కొంతమంది హీరోలు అయ్యప్ప మాల, శివ దీక్షలు చేపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరకు చాలా మంది దీక్షలు తీసుకున్నవారు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు మాలలు ధరించిన హీరోల గురించి తెలుసుకుందాం.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక చింతన కోసం అయ్యప్ప మాలను ధరించారు.
రామ్‌చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. వివాహం తర్వాత అనేక సార్లు అయ్యప్ప దీక్షకు పూనుకున్నారు. 'ధృవ', 'రంగస్థలం' సినిమాల షూటింగ్ సమయంలో అయ్యప్ప మాల ధరించారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ ప్రారంభంలోనూ.. కరోనా వైరస్‌ను జయించిన తర్వాత ఆయన మరోసారి అయ్యప్ప దీక్షను తీసుకున్నారు.
రామ్
ఇటీవలే 'రెడ్' సినిమాలో ప్రేక్షకులకు కొత్త లుక్‌తో కనువిందు చేశారు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈ చిత్రం విడుదల తర్వాత ఆయన శివ దీక్ష తీసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్‌మీడియాలో వెల్లడించారు. "ఓం నమః శివాయ. చిన్న విరామం తీసుకుంటున్నా. మళ్లీ వస్తా" అని మాల దుస్తులతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
శర్వానంద్
యువ కథానాయకుడు శర్వానంద్.. చివరిసారిగా 'జాను' చిత్రంలో నటించారు. ఇప్పుడు ఆయన 'శ్రీకారం' షూటింగ్లో బిజీగా ఉన్నారు. హీరో రామ్‌చరణ్‌కు స్నేహితుడైన శర్వానంద్.. చెర్రీతో కలిసి అనేకసార్లు అయ్యప్ప మాలను వేసుకున్నారు. 'పడి పడి లేచే మనసు' చిత్రీకరణ సమయంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు శర్వా.
వీరితో పాటు హీరో మంచు మనోజ్.. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అయ్యప్ప మాలధారణ ధరించారు.
ఇదీ చూడండి: చిన్నప్పుడే హీరోయిన్గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై