ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్‌తో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ప్రతి రోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. తేజ్ సరసన రాశీ ఖన్నా కథానాయిక. ఈనెల 20న చిత్రం విడుదల కానున్న సందర్భంగా బన్నీ వాసు.. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ మీడియా సమావేశంలో ముచ్చటించాడు. ఈ సినిమాతో చాలా మందికి కనువిప్పు కలిగిస్తుందని అంటున్నాడీ నిర్మాత.
ఇది వర్కౌట్ అవుతుందా అనిపించింది...
మారుతి ఈ కథ చెప్పినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. ‘ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? తండ్రి గురించి ఇలా కూడా ఆలోచిస్తారా? అనిపించింది. అయితే ఓ రోజు మా అమ్మ ఫోన్ చేసింది. నీతో మాట్లాడాలని ఐదు రోజుల నుంచీ ఎదురుచూస్తున్నా అని చెప్పింది. నిజంగానే ఆ ఐదు రోజులూ అమ్మ ఫోన్ చేసినా మాట్లాడలేకపోయాను. బిజీ జీవితంలో ఏం కోల్పోతున్నామో అర్థమైంది. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న తనయుల గురించి పత్రికల్లో చదివాను. అవన్నీ చూశాక ఈ సినిమా చేయాల్సిందే అనిపించింది.
సిక్స్‌ప్యాక్ అందుకే..
మరణం గురించి అందరూ బాధ పడుతుంటారు. అయితే దాన్ని కూడా పండగలా చేసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. మారుతి తనదైన శైలిలో వినోదాత్మకంగా మలిచాడు. పిల్లా నువ్వులేని జీవితం తరవాత సాయితేజ్‌తో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కానీ అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాతో తనలోని మరో కోణం బయటపడుతుంది. ఈ సినిమాకి ముందు తను కొంచెం లావయ్యాడు. ఫిట్‌గా కనిపించాలన్న ఉద్దేశంతోనే సిక్స్‌ప్యాక్ చేయించాం
నియమం లేదు...
ప్రస్తుతం మా సంస్థలో 'జెర్సీ' హిందీ రీమేక్ సిద్ధం అవుతోంది. అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నాం. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ - సూర్య ప్రతాప్ కలయికలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా ఉంది. గీతా ఆర్ట్స్‌లో మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్తులో మహేష్‌తో తప్పకుండా సినిమా చేస్తాం. దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చామని, మా సంస్థలోనే పనిచేయాలన్న నియమం ఏమీ పెట్టలేదు. బయటి నుంచి అవకాశాలు వస్తే చేసుకోమనే చెబుతున్నాం. పరశురామ్ మా సంస్థలోనే సినిమా చేయాలి. కానీ అంతకంటే ముందు బయటి సంస్థలో తనకు అవకాశం వచ్చింది. అందుకే వెళ్లారు.