సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారుల మొదటి రోజు విచారణ ముగిసింది. మనీలాండరింగ్ కేసులో మంగళవారం పూరీ జగన్నాథ్‌ను విచారించిన అధికారులు.. దాదాపు 10 గంటల పాటు పూరీని ప్రశ్నించారు. ఉదయం 10.15 గంటలకు పూరీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. 11 గంటల సమయంలో ఈడీ అధికారుల బృందం విచారణ మొదలుపెట్టింది. భోజన విరామ సమయానికి అర్ధగంట వదిలిపెట్టి.. మళ్లీ రాత్రి 8.30 గంటల వరకు అధికారులు పూరీని ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఈడీ అధికారులు.. పూరీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు.
పూరీ జగన్నాథ్, తన చార్టెడ్ అకౌంటెంట్‌తో కలిసి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలతో పాటు.. ఇతర ఆర్థిక విషయాలను ఈడీ అధికారులు ప్రశ్నించగా.. చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చారు. అవసరమైతే అధికారులు పూరీని మరోసారి పిలిచే అవకాశం ఉంది.
పూరీని కలిసేందుకు వచ్చిన బండ్ల..
మరోవైపు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్.. ఈడీ కార్యాలయానికి వచ్చారు. పూరీని కలిసే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు అందుకు అనుమతించకపోవడంతో.. దాదాపు గంట పాటు ఈడీ కార్యాలయంలోనే వేచి చూశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఈడీ అధికారులు కోరడంతో.. బండ్ల అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సెప్టెంబర్ 2న చార్మి..
డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.
ఇదీ అసలు కథ..
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.
ఇదీ చూడండి: మళ్లీ డ్రగ్స్ కలకలం.. భయంతో బాత్రూంలో దాక్కున్న నటి!