'నీది నాదీ ఒకే కథ' చిత్రంతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల.. నిర్మాత అవతారం ఎత్తారు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ రచనల్లో ఒకటిగా భావించే చలం 'మైదానం' నవలను సినిమాగా మలచబోతున్నారు. వేణు ఊడుగుల ప్రొడక్షన్ హౌస్ పేరుతో నిర్మాణ సంస్థను ఆరంభించిన ఆయన.. 'ఆహా' ఓటీటీ కోసం ఈ నవలను అదే పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
స్త్రీలను ప్రాణమున్న మనుషులుగా గుర్తించని సమాజాన్ని విమర్శిస్తూ.. 1927లో చలం 'మైదానం' నవల రాశారు. ఈ నవల తెలుగుతోపాటు వివిధ భాషల్లో అనువాదమై విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో కొంతమంది 'మైదానం' నవలను సినిమా తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించి మైదానాన్ని తన మిత్రుడు కవి సిద్ధార్థ్ దర్శకత్వంలో సినిమాగా రూపొందించేందుకు వేణు ఊడుగుల తనవంతు ప్రయత్నంగా ముందుకొచ్చారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో సొట్ట బుగ్గల సుందరి తాప్సీని ప్రధానపాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమచారం. ప్రస్తుతం రానా, సాయిపల్లవితో విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీ గా ఉన్నారు వేణు ఊడుగుల.