Dulquer Salmaan movies ban: మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్‌పై కేరళ థియేటర్స్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. ఇకపై ఆయన నటించిన సినిమాలను రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకుంది. ఆయన నటించిన 'సెల్యూట్'ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడమే దానికి కారణం. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సెల్యూట్'కు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. దుల్కర్‌కు చెందిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 14న 'సెల్యూట్'ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ అందరితో నిర్మాణ సంస్థ చర్చలు జరిపింది. అదే సమయంలో కొవిడ్ మూడో వేవ్ రావడం వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తామని టీమ్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే 'సెల్యూట్'ను తొలుత అనుకున్నట్లు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల కేరళ థియేటర్ అసోసియేషన్ అసహనం చెందింది. 'సెల్యూట్' థియేటర్ రిలీజ్‌కు సంబంధించి తమతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ ఓటీటీకి వెళ్లడం ఏం బాగోలేదని అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్.. 'గని' ట్రైలర్ అదుర్స్