'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా' అంటూ ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్‌ప్రైజ్ చేసేందుకు బరాత్‌లో 'బుల్లెట్టు బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారడం.. సాయి దంపతులకు ఫుల్ క్రేజ్ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. మరి, ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న 'బుల్లెట్టు బండి' పాట పాడిందెవరు? ఒరిజినల్ సాంగ్ ఎలా ఉంటుంది? అనేది ఒక్కసారి తెలుసుకుందాం..!
బుల్లెట్టు బండి.. మన మోహనదేనండి..!
'బుల్లెట్టు బండి' ఒరిజినల్ పాట ఆలపించింది మన తెలుగింటి అమ్మాయి మోహన భోగరాజు. సంగీతంపై ఉన్న ఆసక్తి.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎదురుచూసిన మోహన ప్రస్తుతం వరుస పాటలతో అందర్నీ కట్టిపడేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. 'బాహుబలి'లో 'మనోహరి', 'భలే భలే మగాడివోయ్' టైటిల్ సాంగ్, 'అరవింద సమేత'లో 'రెడ్డమ్మ తల్లి'తోపాటు ఇటీవల వచ్చిన 'మగువా మగువా' ఫీమేల్ వెర్షన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఓ వైపు సినిమా పాటలతో అలరిస్తూనే సమయం దొరికినప్పుడల్లా ప్రైవేటు ఆల్బమ్స్ క్రియేట్ చేయడం మోహన అభిరుచి. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆమె 'బుల్లెట్ బండి' ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు. లక్ష్మణ్ ఈ పాట రాశారు. మోహన కేవలం పాట పాడడమే కాకుండా దానికి అనువుగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇప్పటి వరకు ఈ పాటను 3.7 కోట్ల మంది వీక్షించారు. అయితే, ఒరిజినల్ వీడియో కంటే ఇటీవల నవవధువు సాయి చేసిన డ్యాన్స్ వీడియో వైరలయ్యాకే ఈ పాటకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఈ పాటకు సోషల్‌మీడియా కవర్ సాంగ్స్ వరుస కట్టాయి.
ఇదీ చదవండి : మెగాస్టార్ చిరు బర్త్‌డే.. అప్డేట్స్ మాములుగా లేవు!