అలా చూస్తుండగానే మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. రెండున్నర నెలల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. దీనికి తగ్గట్లుగానే చిత్రసీమ కూడా తన ఏర్పాట్లు తాను చేసుకుంటోంది. ఇప్పటికే రాబోయే ముగ్గుల పండగకు బాక్సాఫీస్ బరిలో పోటీపడేందుకు పలు పెద్ద చిత్రాలు ముస్తాబైపోతున్నాయి. ఈసారి ఈ రేసులో మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', బాలకృష్ణ.. 'రూలర్', రజనీకాంత్.. 'దర్బార్' చిత్రాలతో తలపడబోతున్నారు. అయితే ఈ పోరు మొదలు కావడానికి ముందే బాక్సాఫీస్ ముందు మరో మినీ సంగ్రామం సందడి చేయబోతుంది. అదే చిత్రసీమకు ఆఖరిదైన క్రిస్మస్ సీజన్. ఈ పండగ నితిన్, అనుష్క, రవితేజ వంటి స్టార్ హీరోల రాకతో మరింత జోష్‌గా కనిపించబోతుంది.
సంక్రాంతి సీజన్ అనగానే సాధారణంగా స్టార్ హీరోల సందడే కనిపిస్తుంది. కాబట్టి చిన్న హీరో చూపంతా క్రిస్మస్, న్యూ ఇయర్‌లపైనే ఉంటుంది. ఎలాగూ క్రిస్మస్‌కు దాదాపు వారానికి పైగా సెలవులు దొరుకుతాయి కాబట్టి ప్రేక్షకులకు పసందైన వినోదాల విందును వడ్డించడానికి ఇంతకు మించిన సరైన సమయం దొరకదు. అందుకే ఇప్పుడు మిగిలిన కుర్ర హీరోలంతా క్రిస్మస్‌ను టార్గెట్ చేసుకుని తమ కొత్త చిత్రాలను ముస్తాబు చేస్తున్నారు. అయితే ఈసారి ఈ క్రిస్మస్ రేసులో నితిన్, సాయిధరమ్ తేజ్ వంటి కుర్ర హీరోలతో పాటు రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇక వీరితో పాటు 'నిశ్శబ్దం'గా తన జోరు చూపించేందుకు రెడీ అవుతోంది స్వీటీ అనుష్క.
తొలి పంచ్ 'డిస్కోరాజా'దే..
ఈసారి క్రిస్మస్ సీజన్‌లో బాక్సాఫీస్‌పై తొలి పంచ్ విసరబోతుంది మాస్ మహారాజా రవితేజనే. ఈ హీరో 'డిస్కోరాజా'లా థియేటర్లో వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సైన్స్‌తో ముడిపడి ఉన్న అంశాలతో ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అంతేకాదు ఇందులో రవితేజ మూడు భిన్నమైన గెటప్పుల్లోనూ దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న విడుదల కాబోతుంది. ఇప్పటికే అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రతిరోజు పండగలా జరుపుతూ..
రవితేజ తర్వాత క్రిస్మస్ రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న మరో హీరో సాయిధరమ్ తేజ్. 'ప్రతిరోజూ పండగే' అంటూ ఈ క్రిస్మస్ సీజన్‌ను ఓ ఉత్సవంలా మార్చుకోవాలని ఊవిళ్లూరుతున్నాడు తేజు. విభిన్న చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రమిది. కుటుంబ బంధాల విలువలు తెలియజేసేలా ఓ చక్కటి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తేజుకు జోడీగా రాశీ ఖన్నా కనిపించబోతుంది. ఇప్పటికైతే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాలేదు కానీ, డిసెంబరులోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బ్రహ్మచారి 'భీష్మ' సైతం..!
‘ఛలో'తో తొలి అడుగులోనే దర్శకుడిగా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అతడి దర్శకత్వంలో రాబోతున్న రెండో చిత్రమే 'భీష్మ'. సింగిల్ ఫర్ ఎవర్.. ఉపశీర్షిక. దాదాపు ఏడాది విరామం తర్వాత నితిన్ నుంచి వస్తోన్న సినిమా ఇది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ కూడా విడుదల తేదీని ఇంకా ఖరారు చేసుకోనప్పటికీ.. క్రిస్మస్ కానుకగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నితిన్ అధికారికంగా ప్రకటించేశాడు.
అటు ఇటైతే.. బాలయ్య కూడా సై..
బాలకృష్ణకు సంక్రాంతి సీజన్‌కు విడదీయరాని బంధం ఉంది. ప్రతి ముగ్గుల పండగకు తన కొత్త చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ఇష్టపడుతుంటాడు బాలయ్య. 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రాలతో గత రెండు సంక్రాంతి సీజన్లలోనూ జైత్ర యాత్రను కొనసాగించాడు. కానీ, ఈసారి ఆ మ్యాజిక్ సాధ్యమవుతుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ప్రస్తుతం బాలయ్య తన 105వ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి రేసు కోసమే ముస్తాబు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే పండగ క్యాలెండర్ 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో', 'ఎంత మంచివాడవురా', 'దర్బార్' చిత్రాలతో ఫుల్ అయిపోయింది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా బాలయ్య క్రిస్మస్ సీజన్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసారి క్రిస్మస్ రేసులో బాలయ్య సందడి కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఈసారి క్రిస్మస్ రేసులో స్టార్ హీరోలే కాదు నేను కూడా పోటీ పడబోతున్నాను అంటూ 'నిశ్శబ్దం'గా సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ముస్తాబవుతోంది అనుష్క. 'భాగమతి' వంటి హిట్ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రమిది. మాధవన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఓ వినూత్నమైన థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో ప్యాన్ ఇండియా సినిమాగా ఒకేసారి నాలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క మూగ పెయింటర్‌గా కనిపించబోతుండగా.. అంధుడైన సంగీతకారుడిగా మాధవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని డిసెంబరులోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ప్రస్తుతం రేసులో ఉన్న చిత్రాల విడుదల తేదీలను బట్టీ ఈ సినిమా రిలీజ్ తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయి.
గతేడాది ఇదే సీజన్లో వరుణ్ తేజ్.. 'అంతరిక్షం', శర్వానంద్.. 'పడిపడి లేచే మనసు', 'మారి 2' వంటి చిత్రాలు సందడి చేసి విజయాలు అందుకున్నాయి.
ఇవ చూడండి.. 'ఆ సమయంలో నన్ను రణ్‌బీర్ ఆదుకున్నాడు'