నటి అక్షరహాసన్‌తో తాను నాలుగేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నానని నటుడు తనూజ్ వీర్వాణి తెలిపారు. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 2018లో అక్షరహాసన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు. ఆ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న తనూజ్.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
"డేటింగ్‌లో ఉన్న అమ్మాయి గురించి బయటకు చెప్పడం నాకస్సలు నచ్చదు. ఎందుకంటే, వృత్తిపరంగా అందరూ నన్ను గుర్తించాలి తప్ప నా వ్యక్తిగత విషయాల వల్ల కాదు. కానీ, సమయం వచ్చింది కాబట్టి ఈరోజు చెబుతున్నాను. అక్షర-నేనూ నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్నాం. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం మేమిద్దరం విడిపోయాం. ఆ తర్వాత కూడా చాలాసార్లు కలిశాం. పార్టీలకు వెళ్లాం. అలా మేమిద్దరం స్నేహితులమయ్యాం. తన బాయ్‌ఫ్రెండ్‌ను కూడా అక్షర నాకు పరిచయం చేసింది. అలాగే నేనూ నా గర్ల్‌ఫ్రెండ్‌ను తనకు చూపించాను" అని తనూజ్ చెప్పారు.
"2018లో తన ప్రైవేట్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకైన సమయంలో అక్షర మొదట నాకే ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పింది. 2013 నాటి తన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం గురించి నాకేమైనా తెలుసేమోనని ఆరా తీసింది. అసలు ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టాలని మేమిద్దరం ఎంతో ప్రయత్నించాం. అక్షరకు జరిగినట్లు ఏ అమ్మాయికీ జరగకూడదు. అయితే, అక్షరహాసన్ ప్రైవేట్ చిత్రాలను నేనే బయటపెట్టానని చాలా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి.
ఇదే విషయం గురించి ఆమెతో మాట్లాడగా.. "నాకు నీపై నమ్మకం ఉంది. నువ్వు ఇలా చేసి ఉండవు" అని సమాధానమిచ్చింది. వ్యక్తిగతంగా నా ఎదుట ఆ సమాధానం చెప్పినప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం ఒక్క ప్రకటన కూడా విడుదల చేసి.. నా తప్పులేదని చెప్పలేకపోయింది. ఆ విషయంలో ఎంతో బాధపడ్డాను. అప్పుడే తనకు దూరంగా వచ్చేశాను. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నమ్ముతున్నాను" అని తనూజ్ వీర్వాణి వివరించారు.
ఇవీ చూడండి :