సిల్వెస్టర్ స్టాలోన్.. హాలీవుడ్ సినిమాలు చూసేవారిలో ఈయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! 'రాకీ', 'రాంబో' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాలన్నీ కలిపి 2 బిలియన్ డాలర్లు(దాదాపు 10వేల కోట్లకు పైగా)పైనే వసూలు చేశాయి. అయితే ఒకప్పుడు స్టాలోన్ పేదరికంలో బతికాడు. సినిమా అవకాశాల కోసం వెతుకుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు తన పెంపుడు కుక్కకు తిండి పెట్టలేక 40 డాలర్లకు అమ్ముకున్నాడు.
జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. అతడు రాసిన 'రాకీ' చిత్ర కథ వారం రోజుల్లోగా అమ్ముడైంది. ఆ డబ్బు రాగానే స్టాలోన్ చేసిన మొదటి పని తన కుక్కను తిరిగి తెచ్చుకోవడం. కాకపోతే అంత సులభంగా అతనికి దొరకలేదు. ఆ కుక్కను తిరిగి పొందడం కోసం 15వేల డాలర్లు వెచ్చించాడు.
'రాకీ' సినిమాలో హీరో కూడా స్టాలోనే. అంతకుముందు ఆ కథను ఎంతమంది అడిగినా వారికి ఇవ్వలేదు. కారణం అందులో హీరోగా తానే చేయాలనుకోవడం. ఈ చిత్రంలో కనిపించే సిల్వెస్టర్ స్టాలోన్ పక్కన కనిపించే కుక్క అతడి సొంత శునకమే.
ఇది చదవండి: దొరసాని: మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే