కొన్ని విషయాలు వినేందుకు సరదాగా వుంటాయి. ముఖ్యంగా సినిమా సంగతులు! చరిత్రను పరికిస్తే డి.వి.నరసరాజు రచించిన 'రాముడు-భీముడు' సినిమా స్క్రిప్టు నాలుగేళ్లు అజ్ఞాతంలో గడిపింది. మిద్దె జగన్నాథరావు, భరణీ రామకృష్ణ ప్రసాద్‌తో సహా కొందరు తమిళ నిర్మాతలూ ఆ స్క్రిప్టును వద్దన్న వాళ్లే. చివరికి రామానాయుడు వెలికితీస్తేగాని ఆ మట్టిలోని మాణిక్యం వెలుగులోకి రాలేదు. అలాగే ఏకంగా ఎనిమిదేళ్లుగా నరసరాజు వద్ద మగ్గిన మరో మరకతమే 'చదరంగం' సినిమా స్క్రిప్టు. జీవన సమరంలో ఎన్నో చిక్కులు ఏర్పడుతుంటాయి. వాటికి కారకులు కొందరు.
జటిలమైన జీవిత సమస్యల్ని, చికాకుల్ని, చిక్కుల్ని తొలగించుకునేందుకు ఆత్మ స్థైర్యం కావాలి. నిర్భాగ్యుడైన భర్తతో ఒక నారీమణి ఈ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఇంటిపెద్ద చదరంగం క్రీడ వంటి నైపుణ్యంతో ఈ సమస్యల పరిష్కారానికి పావుగా నిలబడి రసవత్తంగా పరిష్కరించాడు. ఈ నేపథ్యంలో నట చక్రవర్తి ఎస్వీ రంగారావు నిర్మాతగా మారి, స్వీయ దర్శకత్వంలో ప్రధానపాత్రను పోషిస్తూ నిర్మించిన ఉత్తమ చిత్రం 'చదరంగం'.. వేసవి 19 మే, 1967న విడుదలై ప్రేక్షకులకు వానజల్లు కురిపించి ఆనందాన్ని పంచింది. 53 వసంతాలు పూర్తి చేసుకున్న ఆ 'చదరంగం' సినిమా విశేషాలు మీకోసం.
తెరవెనుక చిదంబర రహస్యం
'కింగ్ లియర్' నాటకంలో షేక్స్పియర్ "మానవులు సహసం వీడక ముందుకు సాగాలి. ఆ నిరీక్షణే పరిపూర్ణతను సిద్ధింప జేస్తుంది" అంటూ ఒక ఓదార్పు వాక్యాన్ని పలికిస్తాడు. ఈ స్పూర్తితోనే స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ప్రఖ్యాత రచయిత ఎరిక్ లింక్లేటర్ 1935 'రైప్నెస్ ఈజ్ ఆల్' పేరుతో ఒక సృజనాత్మక నవల రచించాడు. సాహిణీ వారి 'పెంకి పెళ్లాం' సినిమా తర్వాత నిర్మించబోయే సినిమా కోసం నిర్మాత ఎస్.వి.రంగారావు సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని నరసరాజు ఒక మంచి కుటుంబ కథను తయారుచేసి స్క్రిప్టు రూపొందించారు. భావనారాయణ సమక్షంలో దర్శకుడు పి.పుల్లయ్య ఆ స్క్రిప్టు విని పెదవి విరిచారు. పుల్లయ్య అంతకు ముందే శివాజీ గణేశన్‌తో 'వణంగాముడి' తెలుగులో 'తలవంచని వీరుడు'గా డబ్ చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నారు.
చదరంగంలో ఏముంది
ఆ గ్రామంలో పరమేశం (ఎస్వీ రంగారావు) ధనవంతుడే కాదు నీతి నిజాయితీలలో అతన్ని మించినవారు లేరు. అతని తమ్ముడు పరంధామయ్య (ధూళిపాళ) మంచివాడే కానీ భార్యా విధేయుడు. సొంత అభిప్రాయమంటూ లేదు. ఒకవేళ ఉన్నా అది చెల్లని రూపాయే! భార్య.. ఆడది మగాడికి బానిసై పోతుందని వివాహం చేసుకునేందుకు మొరాయిస్తూ ఉంటుంది.
దర్జాలకు పరంధామయ్యను అప్పుల ఊబిలోకి దించుతారు. పరమేశానికి మరొక మరణించిన తమ్ముడుంటాడు. కూతురు సీత (జమున) పరమేశం వద్దే పెరుగుతుంది. ఆమెను కన్నకూతురికంటే ఆప్యాయంగా పెంచుతాడు పరమేశం. అయితే సీత పరమేశాన్ని కాదని రాము (హరనాథ్) అనే అభాగ్యున్ని పెళ్లాడి కష్టాలను కొనితెచ్చుకుంటుంది. అయితే పరమేశం పెంపకంలో పెరిగిన అనుభవంతో ఆ కష్టాలను ధైర్యంతో ఎదుర్కొంటుంది. ఆ చికాకుల్ని సంయమనంతో పరిష్కరించుకుంటూ భర్తను దారిలో పెట్టగలుగుతుంది. పరమేశం శక్తియుక్తులతో అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తాడు. ఇదే చదరంగం కథ.
టి.వి.రాజు సంగీతం
'ఇల్లాలంటే నీవమ్మా' అనే పాటను ఘంటసాల ఆలపించారు. ఇది బహుళ జనాదరణ పొందిన పాట కావడం చేత ఈ నాటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది. పాటలో సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. చీకటి బోధించే విధంగా దాశరథి ఈ పాటను మలిచారు. ఇందులోనే ఒక తత్వాన్ని బోధించే "నీవెవరన్నా నేనేవరన్నా... నీలోనే నాలోనూ శివుడొక్కడన్నా" అనే పాటను మాధవపెద్ది ఆలపించారు. "నీరెంతవుందో సంసారమందున్న సారమంతేలే" అంటూ ఉద్బోధ చేసే పాట ఇది. "సయ్యారి సయ్యారి" స్వర్ణలత బృందం ఆలపించారు. ఇలాంటి పాటే మరొకటి వుంది. "వలచిన మనసే మనసు వలపే జగతికి బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం" అనేది సాధారణ పాట.
మరిన్ని విశేషాలు
- 1967 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'చదరంగం' సినిమాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి రజత నంది పురస్కారాన్ని అందించింది. నిర్మాతగా ఎస్వీ రంగారావు ఆ బహుమతిని నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతులమీదుగా స్వీకరించారు. ప్రథమ బహుమతి 'సుడిగుండాలు' నరసరాజుకు లభించింది.
- 'చదరంగం' సినిమా విజయంతో ఎస్వీ రంగారావు 1968లో నిర్మించిన 'బాంధవ్యాలు' సినిమాకూ నరసరాజే సంభాషణలు సమకూర్చారు. "ఇష్టం లేదు. నేనే డైరెక్టు చేస్తా" అని ఎస్వీఆర్ దర్శకత్వ బాధ్యతలు మోశారు.
- నరసరాజు స్క్రిప్టుకు మార్పులు చేసేందుకు ఒప్పుకోకపోవడం వల్ల భావనారాయణ 'చదరంగం' సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నారు.
ఇదీ చూడండి.. అలలపై అందాల సోయగం.. నుష్రత్ భరూచ