స్వర్గీయ ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ వాయిదా పడింది. తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఆగస్ట్ 25న ఆవిష్కరణ కార్యక్రమం చేసేందుకు నిర్ణయించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారని ప్రకటించారు. అయితే పలు కారణాలతో వేడుక వాయిదా పడినట్లు నిర్వహకులు ఈరోజు చెప్పారు. త్వరలోనే కొత్త తేదీని తెలియజేయనున్నారు.
నటనే ఆయన ఆయుధం...
ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జులై 3న జన్మించిన ఆయన... 18 జులై 1974లో మరణించారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై మక్కువ ఉండేది. 1946లో వచ్చిన వరూధిని చిత్రంతో ఆయనకు నటుడిగా తొలి అవకాశం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు వంటి ప్రతినాయక పాత్రల్లో తనదైన నటనతో ఎన్నో ప్రశంసలు పొందారు.
పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన కొన్ని చిత్రాలు. నర్తనశాలలో ఆయన పాత్రకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం లభించింది. ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారమూ అందుకున్నారు ఎస్వీఆర్. విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ అనే బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు.
ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి