బలన్మరణానికి పాల్పడిన హిందీ నటుడు సుశాంత్ సింగ్ కేసు విచారణలో.. ముంబయి పోలీసులు పలు విషయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా చనిపోయే ముందు ఈ యువహీరో గూగుల్‌లో వెతికిన విషయాలను కనుగొన్నారు. నొప్పి తెలియని చావు, స్కిట్జోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ గురించి సెర్చ్ చేసినట్లు సోమవారం మీడియాకు వెల్లడించారు ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్.
ఇప్పటికే సుశాంత్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 2019 నుంచి జూన్ 2020 వరకు డేటాను చూసిన పోలీసులు.. మొత్తం 14.5 కోట్లు అకౌంట్లో జమ అయినట్లు తెలిపారు. వాటిలో 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు విచారణ సాగిస్తున్న బిహార్ పోలీసులకు తాము వీలైనంతగా సహాకారం అందిస్తామని పరమ్‌వీర్ వెల్లడించారు. తాము చట్టపరంగానే అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు.
జూన్ 14న.. సుశాంత్ ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.