అప్పట్లోనే అల్లరి పిల్లగా
1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతానికి చిన్నప్పుడే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిందట. స్కూల్లో పంతులమ్మని ఏడిపించడం, ఊళ్ళో సైకిల్ మీద చక్కర్లు కొట్టడం, సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్లు మాట్లడడం ఆమెకు చిన్నప్పుడే అలవడ్డాయట!
సినీరంగ ప్రవేశం
కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్ నాటకాల్లో వేషాలు వెయ్యడం ద్వారా ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, యస్వీ రంగారావులాంటి ప్రముఖులతో పరిచయమై, ఆమె ఆసక్తి వెండితెరవైపు మళ్లింది. నృత్య సన్నివేశాల్లో గుంపులో కనిపించడం, కథానాయకుల పక్కన చెలికత్తెగా నటించడం లాంటి పాత్రలు చేసింది.
ఫేస్‌వాల్యూ
మాటల మధ్యలో ముక్కు ఎగపీలుస్తూ, గొంతులో దుఃఖం పలికిస్తూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకునే ఘట్టాల్లో సూర్యకాంతాన్ని చూడండి- నిజజీవితంలో మనకు బాగా తెలిసిన వారు కనిపిస్తారు. మెటికెలు విరుస్తూ, శాపనార్థాలు పెడుతూ, తిట్ల వర్షం కురిపించినప్పుడు- ‘అచ్చం మన లాగే ఉంది కదంటూ’ ప్రేక్షకులు తమ సన్నిహితులతో సరిపోల్చుకుంటారు. ఒక తరంలో గయ్యాళితనానికి సూర్యకాంతం పేరు పర్యాయపదమైపోయిందంటే అతిశయోక్తి కాదు. ‘
మలుపు తిరిగింది
అదిగో.. అప్పుడు వచ్చింది సాధనవారి ‘సంసారం’ (1950). ఎన్టీఆర్, ఏయన్నార్‌లు హీరోలుగా ఎల్వీప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సూర్యకాంతాన్ని కయ్యాలమారిగా గయ్యాళిగంపగా నిలబెట్టింది. ఆమె చలనచిత్ర జీవితానికి ఓ దశనూ, దిశనూ నిర్దేశించింది. కొన్ని పాత్రల్నీ కొన్ని సంభాషణల్నీ, ఊతపదాల్నీ కేవలం సూర్యకాంతం కోసమే రచయితలు, దర్శకులు సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
తాను తింటూ మరొకరికి పెడుతూ
సూర్యకాంతం ‘మనిషి మామిడల్లం... మనసు పటికబెల్లం’ అన్నారు ఆరుద్ర. ఇంటి నుంచి క్యారేజ్ నిండా మోసుకొచ్చి షూటింగ్‌లో అందరికీ వడ్డించిన ఆమె చేతి రుచుల్ని వెనకటి తరం సినిమా ప్రముఖులు కథలు కథలుగా చెప్పుకొంటారు. తాను సంపాదించి మరొకరికి సహాయం చెయ్యడం వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి.
ఆ మహానటి 1994 డిసెంబరు 18 నాడు తనువు చాలించారు.
ఇదీ చూడండి : అల్లూరితో తొలిసారి కలవనున్న కొమరం భీమ్!