టీమ్ఇండియా సీనియర్ బౌలర్ శ్రీశాంత్(Sreesanth) ఇప్పటికే పలు సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో కనిపించి అలరించారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 'పత్తా' పేరుతో ఆ సినిమా తెరకెక్కనుంది. ఆర్.రాధాకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఒక వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీలియోని(Sunny leone) ఆ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించనుందట. సీబీఐ అధికారిగా శ్రీశాంత్ కనిపించనున్నాడు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నటి అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం సన్నీలియోని వైపు మొగ్గు చూపిందట.
అసలు సన్నీ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకొంటుందో లేదో అనే సందేహం కలిగిందని, అయితే.. కథ చెప్పిన తర్వాత సినిమా చేసేందుకు ఆమె వెంటనే సరే అన్నారని డైరెక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ మహిళ పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. ఇన్వెస్టిగేటివ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీశాంత్, సన్నీలియోని ఇద్దరూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న వారే కాబట్టి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
2014లో 'కరెంట్ తీగ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సన్నీ.. 'పి.ఎస్.వి గరుడవేగ' చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్‌లో మెరిసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తోందామె. మరోవైపు.. ఫాస్ట్‌బౌలర్‌గా భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్ నిషేధం తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. రెండు హిందీ చిత్రాలు, ఒక మలయాళం, ఒక కన్నడ సినిమాల్లో నటించాడు.
ఇదీ చూడండి: వలస కార్మికులకు సాయంగా సన్నీలియోని