బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను పోలిన వ్యక్తి సచిన్ తివారీ ప్రధానపాత్రలో 'సూసైడ్ ఆర్ మర్డర్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సుశాంత్ సింగ్ బయోపిక్‌గా రూపొందుతుందంటూ పలువురు నెటిజన్లు ప్రచారం చేశారు. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు షామిక్ మౌలిక్ వాటిని తోసిపుచ్చాడు. ఈ సినిమాకు, సుశాంత్ మరణానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు.
"ఇది బయోపిక్ కాదు. యువతీ యువకులు ఎన్నో కలలతో వారి సొంతూళ్ల నుంచి ముంబయికి ఎలా వస్తారనేది ఈ చిత్ర కథాంశం. అలా వచ్చిన వారు విజయాన్ని చూస్తారు. కానీ, వారు కోరుకున్న స్థాయికి చేరుకోబోతున్నప్పుడు అకస్మాతుగా జరిగే సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది". -షామిక్ మౌలిక్, 'సూసైడ్ ఆర్ మర్డర్' దర్శకుడు
ఈ చిత్రంలో సచిన్ తివారీ ప్రధానపాత్ర పోషిస్తుండగా.. సినిమాలోని మిగిలిన పాత్రల కోసం ఎంపిక జరుగుతుందని దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రానికి అలాంటి టైటిల్ ఎంచుకోవడంపై దర్శకుడు స్పందిస్తూ.. "మీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని చంపారు అని కాదు. కానీ, పరిస్థితుల ప్రభావం.. నిరాశకు గురై మిమ్మల్ని మీరు హతమార్చుకునేలా చేస్తుంది" అని తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ గతవారం సోషల్‌మీడియాలో విడుదలైంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.