సుహాసిని ఎన్నో ఏళ్లుగా మిద్దెతోటను పెంచుతున్నా తాజాగా మట్టిలేకుండా హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను పెంచుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షకులతో పంచుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకున్న.. ఆమె ఈ వైపుగా అడుగులు వేశారు. ‘ఈ ఏడాది కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. దాంతో చాలా సమయం మొక్కల మధ్యే గడిపేదాన్ని. అలా ఎక్కువ మొక్కలనూ పెంచా.
హైడ్రోపోనిక్స్ విధానంలో టొమాటోలు, చిక్కుళ్లు, వంకాయ, కొత్తిమీర, కీరా, పచ్చిమిర్చి, దోస లాంటి కూరగాయలతోపాటు ఆకుకూరలు కూడా పెంచా. వీటి కోసం ఎరువునూ వంటగదిలోని వ్యర్థాల నుంచి స్వయంగా తయారుచేశా. నాకేదైనా సందేహం వస్తే వ్యవసాయ శాఖలో పనిచేసే స్నేహితుల సలహాలు తీసుకుంటా. సహజ పద్ధతిలో పెంచిన తోట నుంచి కోసి, వండుకోవడం వల్ల వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను’ అని చెబుతారామె.
నీటి వృథాను అరికట్టడానికి హైడ్రోపోనిక్స్ విధానాన్ని ఎంచుకున్నారామె. ‘ఈ విధానంలో ఖర్చు ఎక్కువే అయినా... మట్టి లేకుండా, తక్కువ నీటితో మొక్కలను పెంచొచ్చు. నలభై చదరపు అడుగుల్లో మొక్కలను పెంచుతున్నా. మావారికి ఇక్కడ పండించే ఆకు కూరలంటే చాలా ఇష్టం’ అని చెబుతుంది సుహాసిని.
- ఇదీ చూడండి : ఇళ్లే నందనవనం.. ఆనందంతో పాటు ఆరోగ్యం