'చెల్లమ్ సర్'.. ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్ వచ్చాక ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పదం. మీమ్స్, జోక్స్, ట్వీట్స్‌తో నెట్టింటిలో ఎక్కడ చూసినా ఆ పేరే కనిపిస్తోంది. ఆ పాత్ర కనిపించేది నాలుగు సన్నివేశాల్లోనే అయినా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. టీకా అవగాహన కార్యక్రమాల్లోనూ ఈ పాత్రను ఉదహరిస్తున్నారంటే ఎంతలా ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే మానవ సెర్చింజన్ అని గూగుల్‌తో పోల్చుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిపెట్టిన ఆ పాత్రలో నటించే అవకాశం ఉదయ్ మహేశ్‌కు ఎలా వచ్చింది? 'చెల్లమ్' వెనుకున్న ఆ కథేంటో చూద్దాం..
కేవలం పదిహేను నిమిషాల నిడివి ఉన్న పాత్రకు ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదంటున్నాడు ఉదయ్ మహేశ్. 'ఆఫీస్' అనే తమిళ సీరియల్ ద్వారా సుపరిచితడైన ఈ నటుడికి ఇప్పుడు 'చెల్లమ్ సర్' పాత్రతో దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఈయన దర్శకుడు కూడా. 'నాలై', 'చక్కర వియుగమ్' సినిమాలను తెరకెక్కించారు. నటుడిగా 'ముదర్ కూడమ్' సినిమాతో 2013లో తెరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించారు. నిజానికి సీనియర్ ఆఫీసర్ దీపన్ పాత్రకోసం ఉదయ్ మహేశ్ ఆడిషన్ ఇచ్చారు. కానీ, ఎంపికవ్వలేదు. ఆ పాత్రలో నటించేందుకు మరో నటుడు అళగమ్ పెరుమాళ్‌ను తీసుకున్నారు. దీంతో కాస్త నిరాశ చెందాడు. తన కోసం ఓ బ్రహ్మాండమైన పాత్ర ఎదురు చూస్తుందని అప్పుడాయనకు తెలియదు.
'ఆడిషన్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత చెల్లమ్ పాత్రలో నటించాలని ఫోన్ వచ్చింది. మొదటి సీజన్ ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. దీంతో రెండో సీజన్‌లో భాగం కావాలని ఉండేది. దర్శకుల నుంచి ఫోన్ రాగానే నటించేందుకు ఒప్పుకొన్నా. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి కలిస్తే ముప్పై నిమిషాల్లోనే నా పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేశారు. హీరోకి ఏ సందేహాన్నైనా తీర్చే సూపర్ స్పైగా నా పాత్ర ఉంటుందని వివరించారు. పాత్ర తీరుతెన్నులపై కొన్ని సూచనలిచ్చారు. వారు చెప్పింది చెప్పినట్లు చేశానంతే. చిత్రీకరణ సమయంలో దీనికి ఇంత పేరొస్తుందని ఊహించలేదు. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో దర్శకులకు ముందే తెలిస్తే అన్ని హిట్టే అవుతాయి" అని ఉదయ్ మహేశ్ చెప్పుకొచ్చారు.
చెల్లమ్ అంటే..?
తమిళంలో 'చెల్లమ్' అంటే డార్లింగ్ అనే అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రియమైన వారిని ప్రేమగా పిలుచుకునే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. "ప్రకాశ్ రాజ్ ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. తమిళ చిత్రం 'గిల్లీ'లో త్రిష తెరపై కనిపించిన ప్రతిసారి ముద్దుగా చెల్లమ్ అనే పిలుస్తాడు. ఆ పదంలోనే ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. నా పాత్రకు ఈ పేరే పెట్టడానికి ప్రేరణ ఏంటో తెలియదు కానీ, ఇది ఆ పాత్ర పూర్తి పేరు కాకపోవచ్చు. గూఢచారి కాబట్టి తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచేందుకు చెల్లమ్ అనే మారు పేరు పెట్టి ఉంటారు" అని చెప్పుకొచ్చారు ఉదయ్ మహేశ్.